పార్టీల్లో పెరిగిపోతున్న ‘సుప్రిం’ టెన్షన్
x
Supreme Court

పార్టీల్లో పెరిగిపోతున్న ‘సుప్రిం’ టెన్షన్

డైరెక్టుగా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదని తీర్పిస్తుందా లేకపోతే ఈవిషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోమంటుందా అన్న టెన్షన్ పార్టీల్లో పెరిగిపోతోంది.


రాజకీయపార్టీల్లో సుప్రింకోర్టు టేన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వటానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ను సుప్రింకోర్టు(Supreme court) సోమవారం విచారించబోతోంది. రిజర్వేషన్ల(BC Reservations) అమలుపై ప్రభుత్వం జారీచేసిన జీవో9కి వ్యతిరేకంగా వంగా గోపాల్ రెడ్డి దాఖలుచేసిన పిటీషన్ను జస్టిస్ విక్రమ్ సేథ్, జస్టిస్ సందీప్ మెహతా ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణకు స్వీకరించింది. పిటీషన్లోని మెరిట్స్ చూసిన తర్వాత తదుపరి విచారణ సోమవారానికి వాయిదావేసింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలుచేస్తే మొత్తం రిజర్వేషన్లు 67శాతానికి చేరుతాయని వంగా తన పిటీషన్లో వాదించారు.

ప్రస్తుతం ఎస్సీలకు అమలవుతున్న 15శాతం, ఎస్టీ రిజర్వేషన్లు 10శాతంకు కొత్తగా బీసీలకు అమలవ్వబోయే రిజర్వేషన్లు 42శాతం కలిపితే రిజర్వేషన్ల శాతం 67కి పెరుగుతాయని వాదిస్తున్నారు. మొత్తం రిజర్వేషన్లు 50శాతంకు మించకూడదన్న సుప్రింకోర్టు గతతీర్పును తెలంగాణప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. తెలంగాణ పంచాయితీరాజ్ చట్టంలో స్ధానికసంస్ధల రిజర్వేషన్లు 50శాతంకు మించకూడదన్న నిబంధనను తొలగిస్తు అసెంబ్లీ చేసిన చట్టసవరణకు గవర్నర్ ఆమోదం లభించలేదన్న విషయాన్ని వంగా తన పిటీషన్లో ద్విసభ్య ధర్మాసనంకు గుర్తుచేశారు.

ఇదే కేసును ఈనెల 8వ తేదీన హైకోర్టు విచారణ చేయబోతున్న విషయం తెలిసీ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటాన్ని వంగా తప్పుపట్టారు. 5 దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ ప్రకటించిన షెడ్యూల్ ను కొట్టేయాలని పిటీషనర్ రిక్వెస్టుచేశారు. సోమవారం ఈ కేసు విచారణను ద్విసభ ధర్మాసనం టేకప్ చేయబోతోంది. బేసిక్కుగా చూస్తే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీచేసిన జీవో9, ఎన్నికల కమీషన్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ చెల్లదు. సాంకేతికంగా, చట్టపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించటం సాధ్యంకాదు. ఈవిషయం తెలిసికూడా రేవంత్ ప్రభుత్వం తనకు లేని అధికారాలను చేతిలోకి తీసుకుని పంచాయితీరాజ్ చట్టాన్ని సవరించేసింది. ఈసవరణ కారణంగానే పోయిన ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 24 శాతం నుండి 42శాతంకు పెరిగింది.

కేసు విచారణలో సుప్రింకోర్టు ఏమిచెబుతుంది అన్న విషయమే పార్టీల్లో టెన్షన్ పెంచేస్తోంది. డైరెక్టుగా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదని తీర్పిస్తుందా లేకపోతే ఈవిషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోమంటుందా అన్న టెన్షన్ పార్టీల్లో పెరిగిపోతోంది. కోర్టుతీర్పు ఎలాగుంటుందో తెలీదు కాబట్టి అన్నీపార్టీలు అభ్యర్ధులను ఎంపికచేయటంలో బిజీగా ఉంటున్నాయి. అయితే పోటీఖాయమని అనుకుంటున్న కొందరు నేతలు ఎక్కడా ఖర్చులు పెట్టడంలేదు. దసరాపండుగ సమయంలోనే కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మామూలుగా అయితే దసరా పండుగ, ఎలక్షన్ సంబరాలు వేర్వేరుగా ఉన్నపుడే దావత్(పార్టీలు)లకు లోటుండదు. అలాంటిది ఇపుడు దసరా పండుగ+ఎలక్షన్ నోటిఫికేషన్ ఒకేసారి వచ్చాయి. అయినా సీనియర్ నేతలు, పోటీచేయటం ఖాయమని అనుకుంటున్న(అభ్యర్ధులు)నేతలు కూడా దావత్ లు ఇవ్వటంలేదు. కారణం ఏమిటంటే కోర్టు తీర్పు ఎలాగుంటుందో అనే అనుమానమే. దావత్ లు ఇచ్చి డబ్బులు అనవసరంగా వృధా చేసుకోవద్దని బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పిలుపు నేతల మీద బాగా పనిచేసినట్లు అర్ధమవుతోంది. సోమవారం సుప్రింకోర్టు విచారణ తర్వాతే దావత్ గురించి నేతలు ఆలోచిస్తారనటంలో సందేహంలేదు.

Read More
Next Story