
నేటినుండి తెలంగాణలో విద్యాసంస్ధల నిరవధిక బంద్
పీజు రీఎంబర్స్ మెంట్ రూపంలో కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వం సుమారు రు. 10 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి
తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుండి విద్యాసంస్ధలు నిరవధికంగా మూతపడ్డాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంటును చెల్లించకపోవటంతోనే విద్యాసంస్ధలను నిరవధికంగా మూసేయాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్దల సమాఖ్య పిలుపిచ్చింది. ఇందులో భాగంగానే ఈరోజు నుండి అన్నీ ఉన్నత విద్యాసంస్ధలు మూతపడ్డాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పీజు రీఎంబర్స్ మెంట్ రూపంలో కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వం సుమారు రు. 10 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి. ఈ బకాయిలు బీఆర్ఎస్ హయాం నుండి బాగా పేరుకుపోయాయి.
కాలేజీల బంద్ కు యాజమాన్యాలు పిలుపివ్వటం, ప్రభుత్వం చర్చలకు పిలిచి మాట్లాడటం చాలాసార్లు జరిగింది. యాజమాన్యాలేమో ఒక్కసారిగా తమ బకాయిలను తీర్చాల్సిందే అని ఒకపుడు గట్టిగా పట్టుబట్టాయి. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో పెట్టుకుని విడతల వారీగా చెల్లింపులకు సరే అన్నాయి. ఈ నేపధ్యంలోనే మొన్ననే జరిగిన దీపావళి పండుగ సందర్భంగా రు. 600 కోట్లను విడుదలచేస్తామని కాలేజీల యాజమాన్యాల సమాఖ్యతో జరిగిన చర్చల్లో ఆర్ధికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
అయితే హామీ అయితే వచ్చింది కాని నిధులు మాత్రం విడుదలకాలేదు. దాంతో కొద్దిరోజులు ఎదురుచూసి మళ్ళీ కాలేజీల యాజమాన్యాలు బంద్ చేశాయి. అప్పుడు ప్రభుత్వం సమాఖ్యను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఆ చర్చల్లో బకాయిల్లో కనీసం 50శాతం అన్నా విడుదలచేయాల్సిందే అని సమాఖ్య గట్టిగా పట్టుబట్టింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, బీఈడీ కాలేజీలతో పాటు డిగ్రీ కాలేజీల్లోనే బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఏ విషయం తేల్చకపోగా బంద్ ప్రకటన నేపధ్యంలో రు. 1200 కోట్లకు టోకెన్లు ఇచ్చిన ప్రభుత్వం రు. 300 కోట్లు మాత్రమే విడుదలచేసింది. దాంతో సమాఖ్యకు మండిపోయింది. ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఉపయోగం ఉండదని అర్ధమైపోయిన యాజమాన్యాలు సోమవారం నుండి నిరవధిక బంద్ ప్రారంభించాయి. మరిపుడు ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాలి.

