అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి...
x

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి...

అమెరికాలోని మిస్సౌరీలో హైదరాబాద్‌ కు చెందిన భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.


అమెరికాలోని మిస్సౌరీలో హైదరాబాద్‌ కు చెందిన భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తూ నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. అతడిని రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వారికి కూడా ఈత రాకపోవడంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. కిరణ్‌ కి కూడా ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. చికాగోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది.

కాగా, హైదరాబాద్‌ లో నివసిస్తున్న ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్, సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు నవంబర్ 2023లో అమెరికా వెళ్లాడు. ఇటీవల తన ముగ్గురు స్నేహితులతో కలిసి మిస్సౌరీలోని శాండ్ హిల్‌ టౌన్ సమీపంలోని ఓ స్విమ్మింగ్ పూల్ లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్ళాడు. ఆ పూల్ లోతు 8 అడుగులు ఉండటంతో ఈత కొట్టడం రాని కిరణ్ మునిగిపోయాడు. అతని స్నేహితులకు కూడా ఈత రాకపోవడంతో రక్షించేందుకు ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. స్నేహితుడు తమ కళ్ళముందే నీటమునిగిపోతున్నా ప్రాణాలు కాపాడలేకపోయామని వారు ఎమోషనల్ అయ్యారు.

కిరణ్ మూడు రోజుల క్రితం DevOps లో సర్టిఫికేషన్ పూర్తి చేసినట్లు లింక్డ్‌ ఇన్‌ లో పోస్ట్ చేశాడు. అతని అకాల ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని తండ్రి లక్ష్మణ్ రాజు గతంలో మరణించగా, తల్లి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కిరణ్ తాత కృష్ణమూర్తి రాజు కుటుంబ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ కిరణ్ చదువుకు సహకరిస్తున్నారు.

కిరణ్ సెయింట్ లూయిస్‌లో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ చదువుతున్నాడు. అతను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అండర్ గ్రాడ్యుయేట్ చదివాడు. చికాగోలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కిరణ్ బంధువులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఈ కష్ట సమయంలో అవసరమైన సహాయాన్ని అందజేస్తున్నామని పేర్కొంది. మృతదేహాన్ని హైదరాబాద్ పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

Read More
Next Story