
ఆరో రోజుకు చేరుకున్న ‘ఇండిగో’ సంక్షోభం
రైళ్లు, బస్సు సర్వీసుల ఏర్బాటుతో పాటు ధరల నియంత్రణ
ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం ఆరో రోజుకు చేరుకుంది. ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 54 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 61 విమానాలను రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయంలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ప్రయాణికులకు కల్పించారు. స్పైస్‌జెట్ విమాన సంస్థ దేశవ్యాప్తంగా వంద అదనపు విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముంబయి, దిల్లీ, పుణె, హావ్‌డా నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. వంద కంటే ఎక్కువ ట్రిప్పులతో 89 ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. రైల్వేశాఖ 37 రైళ్లకు అదనపు కోచ్‌లు జోడించి నడుపుతోంది. శంషాబాద్ నుంచి పలు ప్రాంతాలకు జీఎంఆర్ సంస్థ, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో తీసుకొచ్చింది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
సంక్షోభం నేపథ్యంలో ధరల నియంత్రణ
ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం నేపథ్యంలో విమాన చార్జీలు భారీగా పెరుగుతుండడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి దారులు వెతుకుతోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రద్దు వల్ల ఏర్పడ్డ సంక్షోభంతో దేశీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన చార్జీలపై గరిష్ఠ పరిమితులు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం.. దేశీయ మార్గాల్లో 500 కిలోమీటర్ల ప్రయాణానికి గరిష్ఠ ధర 7,500 రూపాయలు. 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు దూరానికి గరిష్ఠ టికెట్ ధర రు. 12,౦౦౦, 1,000 నుంచి 1,500 కిలోమీటర్ల దూరానికి చార్జీలు రు. 15,000 రూపాయలు. 1,500 కిలోమీటర్లకు పైగా దూరానికి గరిష్ఠంగా 18,000 రూపాయలుగా నిర్ణయించింది.
అయితే, ఈ చార్జీలలో యూడీఎఫ్, పీఎస్ఎఫ్ వంటి ఇతర పన్నులు లేవు. ఈ చార్జీలు బిజినెస్ క్లాస్, ఆర్సీఎస్-ఉడాన్ విమానాలకు వర్తించవు. ఈ ధరలు వెంటనే తక్షణమే అమలులోకి వస్తాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్ ధరలను పర్యవేక్షించి నియంత్రించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రజల ప్రయోజనార్థం ఈ చర్య తీసుకున్నామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. పరిస్థితి యధా స్థితికి వచ్చేవరకు ఈ చార్జీలు అమలులో ఉంటాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ టికెట్ ధరలు ఎయిర్‌లైన్ వెబ్సైట్, ట్రావెల్ పోర్టల్ రెండింటిలోనూ ఆన్లైన్ బుకింగ్‌లకు వర్తిస్తాయి అని పేర్కొంది.

