మెస్సీ బృందంపై ‘ఇండిగో’ దెబ్బ
x
Football top star Lionel Messi

మెస్సీ బృందంపై ‘ఇండిగో’ దెబ్బ

మెస్సీ వ్యక్తిగత బృందం హైదరాబాద్ పర్యటన చివరినిముషంలో రద్దయ్యింది


ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియొనల్ మెస్సీ బృందంపైన కూడా ఇండిగో విమాన సంస్ధ దెబ్బపడింది. ఈనెల 13వ తేదీన మెస్సీ హైదరాబాదుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. మెస్సీ(Lionel Messi) హైదరాబాదులో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన రక్షణ, పర్యవేక్షక బృందాలు ముందుగానే(Hyderabad) హైదరాబాద్ రావాల్సుంది. మెస్సీ బసచేయబోయే హోటల్, హోటల్ దగ్గర భద్రత, మ్యాచ్ ఆడబోయే(Uppal Stadium) ఉప్పల్ స్టేడియంను వ్యక్తిగతంగా పరిశీలించటం, స్టేడియంలోపలా, బయటా ఏర్పాటుచేసిన భద్రతా ఏర్పాట్లపై ఫోలీసు ఉన్నతాధికారులతో భేటీ అవ్వాల్సుంది. ఇందుకోసం మెస్సీ తరపున రెండు బృందాలు శుక్రవారం నగరానికి రావాల్సుంది. అయితే (Indigo Airlines)ఇండిగో విమాన సంస్ధలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా విమానాలు రద్దవుతున్న విషయం తెలిసిందే. నాలుగురోజులుగా రద్దవుతున్న విమానాలవల్ల ప్రయాణీకులు దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో నానా గోలచేస్తున్నారు.

ఈ కారణంగానే మెస్సీ వ్యక్తిగత బృందం హైదరాబాద్ పర్యటన చివరినిముషంలో రద్దయ్యింది. శనివారం లేదా ఆదివారం నాడు వేరే మార్గంలో మెస్సీ బృందం హైదరాబాద్ చేరుకునే అవకాశముంది. మెస్సీ పర్యటనలో మినిట్ టు మినిట్ వివరాలను వెల్లడించటానికి ప్రభుత్వం ఇష్టపడటంలేదు. మెస్సీ హైదరాబాద్ పర్యటనను భద్రతా కారణాల వల్ల ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచింది. మెస్సీ వ్యక్తిగత సిబ్బంది విజ్ఞప్తి ప్రకారమే పర్యటనను గోప్యంగా ఉంచినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఉప్పల్ స్టేడియంలో ఆడబోయే మ్యాచ్ వివరాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈనెల 13వ తేదీన మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కోల్ కత్తా నుండి 200 మంది బృందంతో మెస్సీ హైదరాబాదుకు వస్తారు. వీరందరికీ బస, వసతి ఏర్పాట్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మెస్సీతో పాటు తన సిబ్బంది బస, వసతి వివరాలను కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. 13వ తేదీ మధ్యాహ్నం హైదరాబాదుకు వస్తున్న మెస్సీ అదేరోజు సాయంత్రం 5.30 గంటల నుండి 6.15 గంటలవరకు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొంటారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అంటే ఏమిటో ప్రభుత్వం వివరించలేదు. అయితే ఉన్నతాధికారుల సమాచారం ఏమిటంటే నగరంలోని అత్యంత ప్రముఖులను మెస్సీ కలవబోతున్నారు.

తర్వాత రాత్రి 7 నుండి 9 గంటల మధ్య ఉప్పల్ స్టేడియంలో ఉంటారు. సెలబ్రిటీల ఫుట్ బాల్ జట్టుతో మెస్సీ జట్టు ఎగ్జిబిషన్ మ్యాచ్ అడబోతోంది. సెలబ్రిటీల జట్టుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా మరో జట్టుకు మెస్సీ కెప్టెన్ గా ఉంటారు. మ్యాచ్ తర్వాత యువ ప్రతిభావంతులతో మెస్సీ మాస్టర్ క్లాస్ కార్యక్రమం ఉంటుందని మాత్రమే ప్రభుత్వం చెప్పింది. మాస్టర్ క్లాస్ కార్యక్రమం అంటే ఏమిటో వివరించలేదు. యువ ఆటగాళ్ళకు మెస్సీ మెళుకువలు చెబుతారని అనుకుంటున్నారు. తర్వాత స్టేడియంలోనే మ్యాచ్ లో భాగమైన పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుంది. చివరగా సంగీత కార్యక్రమం ఉంటుంది. అదేరోజు రాత్రి మెస్సీ హైదరాబాదులోనే బసచేసి మర్నాడు 14వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో ముంబాయ్ కు బయలుదేరుతారు.

Read More
Next Story