కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
x

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించారని పలువురు విమర్శించారు. నిధుల మంజూరులో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని పలువురు నేతలు విమర్శించారు.



Heading

Content Area

బీజేపీ తెలంగాణను నిర్లక్ష్యం చేసింది : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణను పూర్తిగా విస్మరించారని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.బడ్జెట్‌ రాజకీయ ప్రేరేపితమైందని,ప్రజల కోసం కాదని, బీజేపీ మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్‌ను రూపొందించారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.బీహార్‌కు రూ.41,000 కోట్ల ఆర్థిక సాయం అందించగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా ఇతర నిధులు వచ్చాయి.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు,ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు.
తెలంగాణ పట్ల వివక్ష చూపారు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు.ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

దరఖాస్తులిచ్చినా నిధులేవి?
ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కోరుతూ పలు దరఖాస్తులు సమర్పించామని గుర్తు చేశారు.పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలమూరు రంగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు.

అమలు కాని విభజన హామీలు
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న ఆశతో తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారని, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్‌ రైలు కనెక్టివిటీ వాగ్దానాలు అమలు చేయాలని కోరారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంపిక చేసి గ్రాంట్లు మంజూరు చేశారని, అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావనను దాటవేయాలని నిర్ణయించుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఇద్దరు మంత్రులున్నా నిరాశే...
ఇద్దరు కేంద్ర మంత్రులు జి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సహా 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు.

కేంద్ర బడ్జెట్ పై ఆసక్తి లేదు : కేటీఆర్
కేంద్ర బడ్జెట్ పై తనకు ఎలాంటి ఆసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీ రామారావు వ్యాఖ్యానించారు.తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు కేటీ రామారావు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ కేంద్రం నుంచి మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రతి బడ్జెట్‌లోనూ ప్రయోజనకరమైన కేటాయింపుల కోసం తాము గతంలో చేసిన అభ్యర్థనలను మోదీ ప్రభుత్వం విస్మరించిందని కేటీఆర్ చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి వచ్చే నిధులు గుండు సున్నానే అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.



Read More
Next Story