
చంచల్‌గూడ జైలులో ఖైదీల దీక్ష?
నిరాహార దీక్ష చేపట్టిన ఏడుగురు మావోయిస్ట్‌లు..!
చంచల్‌గుడ జైలులో వాతావరణం వేడెక్కినట్లుంది. పలువురు ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టినట్లు ప్రజాసంఘాలు పేర్కొంటున్నాయి. జైలు అధికారుల ప్రవర్తనకు వ్యతిరేకంగా జైలులోని మావోయిస్ట్ ఖైదీలు నిరాహార దీక్ష చేస్తున్నట్లు సంఘాలు తెలిపాయి. అయితే తమ జైలులో మావోయిస్ట్ ఖైదీలు ఏడుగురే ఉన్నారని, వారిని ఎప్పటిలా రొటీన్ ప్రాసెస్‌లో భాగంగా వాళ్ల బారక్‌లు మార్చినట్లు జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ వెల్లడించారు. అంతకుమించి జైలులో ఇంకేమీ జరగలేదని అన్నారు. అయితే ఖైదీలకు మద్దతుగా ప్రజాసంఘాలు కూడా ధర్నా చేశాయని, మావోల తరుపున వారి అడ్వకేట్లు జైలులో పరిస్థితి పరిశీలించినట్లు అధికారులు వివరించారు. ధర్నాల నేపథ్యంలో మావో ఖైదీలకు, ప్రజాసంఘాల నేతలకు ములాకాత్ ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.
అయితే డిప్యూటీ జైలర్ లక్ష్మణ్ బాబు, జవాన్ సందీప్‌లు శనివారం ఉదయం మావోయిస్టులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీలను విచక్షణారహితంగా కొట్టారని పౌరహక్కుల సంఘం కన్వీనర్ గుంటి రవి ఆరోపించారు. ఆ తర్వాత వారందరినీ కూడా వేరువేరు సెల్‌లలో నిర్భందించారన్నారు. ఈ క్రమంలోనే ఖైదీల పట్ల అధికారులు తమ హింసాకాండను ఆపాలని నినాదిస్తూ ఖైదీలు నిరాహారదీక్ష చేపట్టారని అన్నారు. వారికి మద్దుతగానే పౌరసంఘాలు ధర్నా చేపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అధికారుల హింసాకాంపై జిల్లా న్యాయమూర్తి ఇండిపెండెంట్‌గా దర్యాప్తు జరిపించాలని వాళ్లు కోరారు.