Pharma Fire Accidents| ఆమ్యామ్యాలకు అలవాటు పడి ‘సేఫ్టీ’వదిలేశారు
x
పాశమైలారంలోని సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన పేలుడు అనంతరం సహాయక చర్యలు

Pharma Fire Accidents| ఆమ్యామ్యాలకు అలవాటు పడి ‘సేఫ్టీ’వదిలేశారు

తెలంగాణలోని ఫార్మా పరిశ్రమల్లో భద్రత నిల్. ఇన్ స్పెక్షన్ నామమాత్రం. ఐదేళ్లలో 703 అగ్నిప్రమాదాలు, పేలుళ్లు.


తెలంగాణలోని పలు పరిశ్రమల్లో భద్రతా నిబంధనలు పాటించడం లేదని డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆకస్మిక తనిఖీల్లో తేలింది.అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, అగ్నిమాపక యంత్రపరికరాలను ఫ్యాక్టరీల్లో సిద్ధంగా ఉంచుకోవడంలో పలు పరిశ్రమలు విఫలమయ్యయని అధికారుల తనిఖీల్లోనే వెల్లడైంది. కాలం చెల్లిన పాత యంత్రపరికరాలతోనే పరిశ్రమలల్లో ఉత్పత్తి చేస్తుండటంతో అది ప్రమాదాలకు దారి తీస్తుంది.


భద్రతా నిబంధనలు పాటించని పరిశ్రమలు
ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, తెలంగాణ ఫ్యాక్టరీస్ రూల్స్ 1950 ప్రకారం పరిశ్రమల్లో భద్రతా నిబంధనలు తప్పకుండా పాటించాలి. కానీ తెలంగాణలో ఇప్పటికీ 703 పరిశ్రమలు భద్రతా నిబంధనలు పాటించడం లేదని తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల పిరియాడికల్స్ తనిఖీల్లో వెల్లడైంది.



703 పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు

తెలంగాణ రాష్ట్రంలో గడచిన అయిదేళ్లలో 703 పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరిగాయని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రికార్డులే తేటతెల్లం చేస్తున్నాయి.అత్యంత లాభసాటి వ్యాపారం కావడంతో హైదరాబాద్ కేంద్రంగా ఫార్మాస్యుటికల్ తయారీ యూనిట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రసాయనాలను ఉపయోగించే కర్మాగారాలకు కూడా హైదరాబాద్ హబ్ గా మారింది. మొత్తం 703 పరిశ్రమల్లో ప్రమాదాలు వాటిల్లగా వాటిలో 500 కంటే ఎక్కువగా పేలుళ్లు, అగ్నిప్రమాదాలు జరిగాయని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గణాంకాలే చెబుతున్నాయి. ఫార్మాయూనిట్లలో పేలుళ్లు, అగ్నిప్రమాదాల వల్ల కార్మికుల మరణాలు అధికంగా సంభవించాయి. ఫార్మాస్యుటికల్ కర్మాగారాల్లో అధికంగా ప్రమాదకర రసాయనాలను ఉపయోగించడం వల్ల ప్రమాదాలు వాటిల్లుతున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఫార్మారంగ నిపుణుడు ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

అతి పెద్ద ఫార్మా ప్రమాదం
పాశమైలారంలోని సిగాచీ ఫార్మా కర్మాగారంలో జరిగిన పేలుడు, అగ్నిప్రమాద ఘటన అత్యంత విషాదకరమైనది. ఈ ఘటనలో ఎక్కువ మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో వైపు ఎక్కువ మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఫార్మా పరిశ్రమల భద్రత అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ యూనిట్‌లో మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్((MCC)) ఉత్పత్తిని తయారు చేస్తుంటారు.



రసాయనాల వల్లే ప్రమాదాలు

ఫార్మా పరిశ్రమల్లో రసాయన పదార్థాల వినియోగం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్, ఔషధ తయారీ లేదా తుది ఉత్పత్తిని తయారు చేయడానికి రసాయనాలు అవసరమయ్యే ఇతర పదార్థాల కోసం కర్మాగారాలు, పరిశ్రమల యూనిట్లు రసాయనాలను ఉపయోగిస్తున్నాయి. పరిశ్రమల్లో ప్రమాదాల సంభావ్యత ఆధారంగా పరిశ్రమలకు పరిశ్రమల శాఖ గ్రీన్, ఎల్లో, రెడ్ రంగు హెచ్చరికలను జారీ చేస్తుంది. ఈ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిశ్రమల జాబితాను పరిశ్రమల శాఖ పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి. కానీ మధ్య ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు అలా ఉంచినా, తెలంగాణ పరిశ్రమల శాఖ మాత్రం ప్రమాదకర పరిశ్రమల జాబితాను పబ్లిక్ డొమైన్ లో ఉంచలేదు.

పరిశ్రమల్లో పిరియాడికల్ తనిఖీలు ఏవి?
ఏదైనా పరిశ్రమలో అగ్నిమాపక యంత్రపరికరాలు ఉండాలి. పరిశ్రమలో అగ్నిమాపక యంత్రపరికరాలను అగ్నిమాపక శాఖ అధికారులు ప్రతి ఏటా పిరియాడికల్ గా తనిఖీలు చేసి అవి బాగున్నాయో లేదో తేల్చి, బాగా లేక పోతే నోటీసులు ఇవ్వాలి. దీంతో పాటు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు అగ్నిప్రమాదాలు వాటిల్లితే ఏం చేయాలనేది ముందస్తు చర్యలను చేసి చూపించాలి.

సేఫ్టీ సూట్లు లేవు...
ఘోర పేలుడు జరిగిన పాశమైలారం సిగాచీ పరిశ్రమలో అత్యంత ప్రమాదకరమైన వాయువులను ఉపయోగిస్తున్నారు. అలాంటపుడు పరిశ్రమలోని కార్మికుల భద్రత కోసం వారికి భద్రతా సూట్లు, పరికరాలను అందజేయాలి. కానీ ఎలాంటి భద్రతా పరికరాలు, సేఫ్టీ సూట్లు ఇవ్వక పోవడం వల్లనే సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో అధిక ప్రాణ నష్టం జరిగిందని కార్మికులు ఆరోపించారు.



పాటించని భద్రతా చర్యలు

హైదరాబాద్ నగరంలోని ఫార్మా కంపెనీల్లో అధిక భాగం సురక్షితంగా లేవని డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులే చెబుతున్నారు. ఫార్మా దిగ్గజ కంపెనీల్లో సైతం భద్రతా చర్యలు సరిగా పాటించడం లేదని తేలింది. తెలంగాణలోని 703 ఫార్మా కంపెనీలు నాసిరకం చర్యలతో భద్రతా చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించాయని వెల్లడైంది.



భద్రతపై సదస్సు జరిగిన అయిదురోజుల్లోనే పేలుడు ఘటన

జూన్ 25వతేదీన హైదరాబాద్ నగరంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 'పిల్లర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ - ఫోర్జింగ్ ఎ సేఫర్ ఫ్యూచర్ ఫర్ ఫార్మా అండ్ కెమికల్ మాన్యుఫ్యాక్చరింగ్' (Pillars of Protection – Forging a Safer Future for Pharma and Chemical Manufacturing) అనే పరిశ్రమల భద్రత అంశంపై సదస్సు జరిగిన అయిదు రోజుల తర్వాత సిగాచీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ సమావేశంలో ఫ్యాక్టరీల డైరెక్టర్ బి.రాజగోపాలరావు, తెలంగాణ అగ్ని విపత్తు ప్రతిస్పందన, అత్యవసర & పౌర రక్షణ విభాగం డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి ప్రసంగిస్తూ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.ఫార్మా పరిశ్రమల్లో కార్మికుల భద్రత ప్రధానమని చెప్పినా, అది ఆచరణలో అమలు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఫార్మా, లైఫ్ సైన్సెస్ యూనిట్లకు తప్పనిసరి వార్షిక అగ్ని ఆడిట్లను నిర్వహించాలని ఇద్దరు అధికారులు కోరినా అయిదు రోజులకే సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది.

పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాక అధికారుల నోటీసులు
ఫార్మాతో పాటు ఇతర పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా బాయిలర్లు, రియాక్టర్లు, అగ్నిమాపక యంత్రపరికరాలను పరిశీలించి పిరియాడికల్ తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయాాల్సిన డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు ప్రమాదాలు జరిగాక పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఉదాహరణకు 703 పరిశ్రమలకు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పరిశ్రమల్లో బాయిలర్, రియాక్టర్లను డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ స్పెక్టర్లు తనిఖీలు చేసిన వాటి పనితీరును పరిశీలించి ఏవైనా డిఫెక్టులు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని నోటీసులు జారీ చేయాలి. ఈ రెండు శాఖల అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి పెద్ద పరిశ్రమల యాజమాన్యాల నుంచి ముడుపులు తీసుకొని భద్రత అంశాన్ని గాలికి వదిలేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



ఎన్నెన్నో ప్రమాదాలు...అధికారుల మెమోలు జారీ

- పాశమైలారంలో సింథోకెమ్ ల్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్ యూనిట్ 2లో గత ఏడాది అక్టోబరు 1వతేదీన పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సంగారెడ్డి ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, తెలంగాణ ఫ్యాక్టరీల రూల్స్ 1950ని ఉల్లంఘించి ప్రమాదానికి కారణమయ్యారని మెమో నంబరు బీ1 4100 నంబరుతో మెమో జారీ చేశారు.
- నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని కుమార్స్ మెటలర్జికల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో గత ఏడాది సెప్టెంబ రు 17వతేదీన ప్రమాదం జరగడంతో నల్గొండ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సందర్శించి దీనిపై చర్యలు తీసుకోవాలని బీ1 4200 నంబరుతో గత ఏడాది అక్టోబరు 9వతేదీన మెమో జారీ చేశారు.
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాజబొల్లారం గ్ామంలోని మరినో ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తర్వాత మేడ్చల్ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బీ1 4201 నంబరుతో అక్టోబరు 3వతేదీన నోటీసులు జారీ చేశారు.
- నల్గొండ జిల్లా విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో గత ఏడాది జూన్ 20వతేదీన జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మరణించారు. ఈ ఘటనపై నల్గొండ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బీ1 2556 నంబరుతో గత ఏడాది నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు.
-పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ కేంద్రప్రభుత్వ రంగ పరిశ్రమలో గత ఏడాది జూన్ 12వ తేదీన జరిగిన ఘోర ప్రమాదంపై కరీంనగర్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బీ12378 నంబరుతో నోటీసు ఇచ్చారు.
- సంగారెడ్డి జిల్లా చేరియాల గ్రామంలోని బాలాజీ పాలీ ఇండస్ట్రీస్ లో జరిగిన ఘోర ప్రమాదంపై సంగారెడ్డి ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విచారణ జరిపి నోటీసులు ఇచ్చి వదిలేశారు.
- రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లోని పహల్ ఫుడ్స్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై హైదరాబాద్ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ బీ1 1261 నంబరుతో మెమో జారీ చేసి చేతులు దులుపుకున్నారు.


నోటీసులతోనే సరి

ఇలా ఎన్నెన్నో 703 పరిశ్రమల ప్రమాదాలపై అధికారులు నోటీసులతోనే సరిపుచ్చారు. ప్రమాదాలు జరగక ముందు జాగ్రత్తలు తీసుకోక పోగా ప్రమాదాలు జరిగాక నోటీసులతోనే చేతులు దులుపుకున్నారు. దీంతో పరిశ్రమల్లో భద్రతా నిబంధనలు గాలికి వదిలేయడంతో ప్రమాదాలకు తెరపడటం లేదు.


Read More
Next Story