‘ఏ పాఠశాల మూత పడదు’.. స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
x

‘ఏ పాఠశాల మూత పడదు’.. స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.


ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలన్నదే తమ లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపడతున్నామని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈరోజు ఆయన ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలకు అన్ని మౌలిక సదుపాయాలను ఉచితంగా అందించేలా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, తాగునీరు, కరెంటు అన్నీ ఉచితంగా అందిస్తామని చెప్పారు. పాఠశాలలకు వచ్చే కరెంటు బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుందని, అదే విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నడుస్తున్న ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను కొనసాగిస్తామని, ఏ స్కూల్ కూడా మూతబడకుండా చూసుకుంటామని, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. గత ప్రభుత్వం తన మోసాల నుంచి పాఠశాలలకు కూడా మినహాయింపు ఇవ్వలేదని, లక్షల మంది చిన్నారుల జీవితాలతో కూడా చెలగాటమాడిందని మండిపడ్డారాయన. కానీ తమ ప్రభుత్వం అలా చేయదని, పక్కా ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తామని, వారికి కేవలం చదువుపైనే కాకుండా క్రీడలపై కూడా ఆసక్తి ఉండేలా చూస్తామని చెప్పారు.

ఆ పథకం ప్రజలకే అంకితం

‘‘ఇందిరమ్మ పథకం ప్రజలకే అంకితంలా పనిచేస్తోంది. మన విద్య వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడే విధంగా సిలబస్ తయారు చేసి విద్యార్థులను తయారు చేస్తాం. కుల, మతాలకు అతీతంగా అందిరినీ కలుపుకుని ఉండేలా స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మేము ఎన్నో ఆలోచనలు చేసే ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొస్తున్నాం. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇది అందని ద్రాక్ష అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం గత ప్రభుత్వం రూ.73కోట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ.5వేల కోట్లు కేటాయించింది. సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ఏదీ అసాధ్యం కాదు. దాన్నే మేము నిరూపిస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది’’ అని పేర్కొన్నారాయన.

28 స్కూళ్లకు శంకుస్థాపన

తెలంగాణ అంతటా మొత్తం 28 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఈరోజు శంకుస్థాపన చేసినట్లు మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణలోని పేదల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. సకల సదుపాయాలతో ప్రతి విద్యార్థికి నాణ్యమై విద్య అందించాలన్న ధ్యేయంతోనే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రాజెక్ట్‌ను చేపట్టామని చెప్పారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.657 కోట్లు నిధులు కేటాయించినట్లు ఆయన చెప్పారు. గత ప్రభుత్వం 10ఏళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు మంత్రి పొంగులేటి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న భావనతోనే 10,006 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేశామని చెప్పారాయన. ఉపాద్యాయుల బదిలీలతో పాటు పదోన్నతులు కూడా చేపట్టామని, గత ప్రభుత్వం స్కూళ్లు పెట్టిందే తప్ప అందులో సదుపాయాలు, ఉపాధ్యాయులు ఇలా కనీస అవసరాలను అమర్చడంలో మాత్రం నిర్లక్ష్యం వహించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తుందని, వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య, సౌకర్యాలు కల్పించనున్నామని చెప్పారు.

Read More
Next Story