జగిత్యాల కాంగ్రెస్ లో చల్లారని ఆగ్రహ జ్వాలలు
జగిత్యాల కాంగ్రెస్ లో రగులుకున్న వర్గపోరు మాత్రం సర్దుమణగలేదు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీలో కల్లోలం సృష్టించింది. తన ప్రత్యర్థిని కనీస సమాచారం లేకుండా పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే చర్యలు తగవంటూ బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు.
జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రయత్నించారు. దీపాదాస్ మున్షి ఫోన్ లో మాట్లాడి ఆయనను శాంతిపజేసేందుకు ట్రై చేశారు. కానీ ఆయన ఆవేశం తగ్గలేదు. దీంతో పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఆయనని ఢిల్లీకి పిలిపించుకుని బుజ్జగించింది. అదే సమయంలో ఢిల్లీలో ఉన్న రేవంత్ సంజయ్ చేరికతో కొంత గందరగోళం నెలకొంది. కానీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ సమన్వయంతో అంతా సర్దుమణిగింది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతల సలహాలు సూచనలతో పార్టీని ముందుకు నడిపిస్తామంటూ మీడియాకి చెప్పారు. ఇక ఢిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి కలిసి బ్రేక్ ఫాస్ట్ కూడా చేశారు. దీంతో వ్యవహారం చక్కబడింది అనుకున్నారు అంతా. కానీ వర్గపోరు మాత్రం సర్దుమణగలేదు.
ఇద్దరు నేతల అనుచరుల్లో అసంతృప్త జ్వాలలు భగ్గుమంటూనే ఉన్నాయి. అధిష్టానం చర్చలతో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ లు సైలెంట్ గా ఉన్నప్పటికీ వారి అనుచరులు రగిలిపోతూనే ఉన్నారు. విషయం ఏమిటంటే... జగిత్యాల అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ లో చేరానని ఎమ్మెల్యే సంజయ్ ప్రకటించడాన్ని స్వాగతిస్తూ ఆయన అనుచరులు శుభాకాంక్షలు తెలియజేస్తూ జగిత్యాలలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలకు పోటీగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు జగిత్యాల అంటే జీవన్ రెడ్డి... జీవన్ రెడ్డి అంటేనే జగిత్యాల అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
పోటాపోటీగా పట్టణంలో పలుచోట్ల ప్లెక్సీలు ఏర్పాటు చేసిన అనుచరులు తమ ఆధిపత్యాన్ని చాటుకునే పనిలో పడ్డారు. ఎమ్మెల్యే అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి ఫోటో, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఎమ్మెల్యే సంజయ్ ఫోటోలు పెట్టలేదు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారాయి.