తెలంగాణలో అభివృద్ధి అంతా గ్రాఫిక్సులోనేనా ?
x
Revanth and Future City graphics

తెలంగాణలో అభివృద్ధి అంతా గ్రాఫిక్సులోనేనా ?

నాలుగు అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు లక్ష కోట్లరూపాయలకు పైగా కావాలి.


తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుములరేవంత్ రెడ్డి చెబుతున్న అభివృద్ధి అంతా గ్రాఫిక్సులోనే కనబడుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు(త్రిబుల్ ఆర్), మూసీరివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటి(ఎంఆర్ఎఫ్డీఏ)ఏర్పాటు, ఫ్యూచర్ సిటి నిర్మాణం(Future City), మెట్రో రెండోదశ(Musi river) విస్తరణ తదితరాలన్నీ గ్రాఫిక్సులోనే(Graphics) కనబడుతున్నాయి. గ్రాఫిక్సులోనే ఎందుకు కనబడుతున్నాయంటే అభివృద్ధిపనులు మొదలవ్వాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బుండాలి. ఆడబ్బే రేవంత్(Revanth) సర్కార్ దగ్గర లేదు. పైన చెప్పిన నాలుగు అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు లక్ష కోట్లరూపాయలకు పైగా కావాలి.

మెట్రో ప్రాజెక్టుకు రు. 20 వేల కోట్లు, మూసీ ప్రాజెక్టుకు రు. 25 వేల కోట్లు అవసరం. ఇక త్రిబుల్ ఆర్ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్(పీపీపీ)తో చేపట్టే అవకాశాలున్నాయి. అలాగే ఫ్యూచర్ సిటి నిర్మాణం కూడా పీపీపీ పద్దతిలోనే మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకసారి ప్రభుత్వమే నిర్మిస్తుందని, మరోసారి ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తామని రేవంత్ రకరకాల మాటలు చెబుతున్నాడు. పైనచెప్పిన నాలుగు ప్రాజెక్టులు మినహాయిస్తే అభివృద్ధిలో రేవంత్ ప్రభుత్వం ముద్ర ఎక్కడా కనబడదు. కారణం ఏమిటంటే ఏమి అభివృద్ధి చేయాలన్నా ముందు ప్రభుత్వం దగ్గర నిధులుండాలి. రేవంత్ లెక్కల ప్రకారమే ప్రభుత్వం రు. 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. అందుకనే అభివృద్ధిని రేవంత్ ప్రభుత్వం గ్రాఫిక్సులో మాత్రమే చూపిస్తు కాలం గడిపేస్తోంది.

రాష్ట్ర ఆర్ధికపరిస్ధితిని రేవంత్ ఇప్పటికి చాలాసార్లు బహిరంగంగానే ప్రకటించాడు. ఉద్యోగులజీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, సంక్షేమపథకాల అమలు, అభివృద్ధికార్యక్రమాలకు నిధులు కావాలంటే నెలకు రు. 32 వేల కోట్లు అవసరం. అయితే నెలకు వస్తున్న ఆదాయం సుమారు రు. 20 వేల కోట్లు మాత్రమే. వచ్చేమొత్తంలో సగానికిపైగా జీతాలు, పెన్షన్లకే సరిపోతోందని స్వయంగా రేవంతే చెప్పాడు. మిగిలిన దానిలో సుమారు రు. 6500 కోట్ల కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించటానికి పోతోంది. మిగిలిన అరాకొరా నిధులతో అభివృద్ధి చేయలేకపోతున్నట్లు చెప్పాడు. ఈకారణంగానే సంక్షేమపథకాలను కూడా అనుకున్నట్లుగా అమలుచేయలేకపోతున్నట్లు తెగబాధపడ్డాడు.

రాష్ట్రఆర్ధికపరిస్ధితి ఇంతదారుణంగా ఉన్నపుడు త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు, మూసీనది సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మెట్రో రెండోదశ నిర్వహణం ఎలాగ సాధ్యమని రేవంత్ అనుకుంటున్నాడో అర్ధంకావటంలేదు. వీటిన్నంటి మీద తాజాగా మెట్రో రైల్ నిర్వహణ భారం కూడా తొందరలోనే ప్రభుత్వంమీద పడబోతోంది. ఇప్పటివరకు మెట్రో రైలును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ కంపెనీ నిర్వహణ నుండి తప్పుకుంటోంది. మెట్రోకి ఉన్న రు. 15 వేల కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకుని ఎదురు కంపెనీకి రు. 2 వేల కోట్లు ప్రభుత్వం ఇవ్వబోతోంది. రు. 2 వేల కోట్లను కంపెనీకి ఎదురిస్తే ప్రాజెక్టు మొత్తం ఎల్ అండ్ టీ నుండి ప్రభుత్వపరమైపోతోంది. ప్రైవేటు కంపెనీచేతిలో ఉన్నపుడే మెట్రో ప్రాజెక్టు నష్టాల్లో ఉన్నపుడు ప్రభుత్వం చేతికి వస్తే లాభాలు ఎలావస్తాయి ?

మూసీనది సుందరీకరణ


మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు మొత్తం 8 నియోజకవర్గాల పరిధిలోని 57 కిలోమీటర్లలో జరుగుతుంది. మొదటి దశలో 20.5 కిలోమీటర్లను ప్రభుత్వం టేకప్ చేయబోతోంది. మొదటిదశ పనులకే రు. 5641 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనావేసింది. ఫేజ్-1లో హిమాయత్ సాగర్ నుండి బాపూఘాట్ దాకా 9.5 కిలోమీటర్ల అభివృద్ధికి ప్లాన్లు రెడీ అయ్యాయి. అలాగే ఉస్మాన్ సాగర్ నుండి బాపూఘాట్ వరకు మరో 11 కిలోమీటర్లు డెవలప్ చేయబోతోంది. శుద్ధిచేసిన గోదావరిజలాల్లో గండిపేట నుండి బాపూఘాట్ వరకు బోటింగ్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. నదికి రెండువైపులా 20 మీటర్ల మేర బఫర్ జోన్ ఏర్పాటుచేసి గ్రీన్ బెల్ట్, వాక్ వే, సైక్లింగ్ ట్రాకులు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. మొదటి దశ అవటానికే ఎంతకాలం పడుతుందో తెలీదు. మూసీనది సుందరీకరణ ఎప్పుడు అవుతుందో ? పూర్తయ్యేటప్పటికి ఎన్ని వేల కోట్లరూపాయలు అవసరమో తెలీదు.

రీజనల్ రింగ్ రోడ్డు


రాష్ట్రంలోని పలుజిల్లాలను కలుపుతు 340 కిలోమీటర్ల మేర 8 లైన్లతో రింగురోడ్డును నిర్మించాలన్నది రేవంత్ పట్టుదల. దీనివల్ల హైదరాబాద్ తో పాటు చాలా ఊర్లలో ట్రాఫిక్ తగ్గిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. సంగారెడ్డి-నర్సాపూర్-తుప్రాన్-గజ్వేల్-యాదాద్రి-చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్ల ఉత్తరభాగం రోడ్డునిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అలాగే చౌటుప్పల్-చేవెళ్ళ-శంకరపల్లి-అమన్ గల్-సంగారెడ్డి దక్షిణభాగంగా మరో 182 కిలోమీటర్ల రోడ్డు వేయబోతోంది. మొత్తం ప్రాజెక్టుకు రేవంత్ ప్రభుత్వం వేసిన అంచనా సుమారు రు. 20 వేల కోట్లు. ప్రాజెక్టు మొదలై పూర్తయ్యేసరికి ఎన్నివేల కోట్లరూపాయలు అవుతుందో ఎవరూ చెప్పలేరు.

ఫ్యూచర్ సిటి


ప్రపంచస్ధాయి కంపెనీలను, సంస్ధలను ఆర్షించేందుకు రేవంత్ పదేపదే ఫ్యూచర్ సిటి జపంచేస్తున్నాడు. భవిష్యత్తులో తెలంగాణప్రభుత్వం ఆర్ధికఅవసరాలు తీర్చటానికి తాను ఫ్యూచర్ సిటీని రూపకల్పన చేసినట్లుగా రేవంత్ చెప్పుకుంటున్నాడు. ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూడాలంటే ఫ్యూచర్ సిటి వల్లే సాధ్యమని చెబుతున్నాడు. 30వేల ఎకరాల్లో ఏర్పాటుచేయబోయే ఫ్యూచర్ సిటిలో రెసిడెన్షియల్, కమర్షియల్, కార్పొరేట్ కంపెనీలు, ఐటి కంపెనీలు, సేవల కంపెనీలన్నీ కొలువుదీరుతాయి. ఈ ప్రాంతంలో ఏర్పాటవ్వబోయే ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫిన్ టెక్ తో పాటు స్మార్ట్ టెక్నాలజీ సంస్ధలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు రేవంత్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీశైలం హైవే-నాగార్జునసాగర్ హైవేకి మధ్యలో ఈఫ్యూచర్ సిటి ప్రాజెక్టు రాబోతోంది. అమన్ గల్, ఇబ్రహింపట్నం, కడత్తాల్, కందుకూర్, మహేశ్వరం, యాచారం, మేడ్చల్ మండలాలో 56 గ్రామాల్లోని 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఫ్యూచర్ సిటి ఏర్పాటవబోతోంది. ఈ సిటి ఏర్పాటుకు రేవంత్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటి డెవలప్మెంట్ అథారిటి(ఎప్సీడీఏ)ని కూడా ఏర్పాటుచేసింది.

మెట్రో 2వ దశ


మెట్రో రెండవ దశ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను రేవంత్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పంపి చాలాకాలమైన ఇంతవరకు అతీగతిలేదు. 76.4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు క్యారిడార్ల నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) పంపింది. దీని అంచనావ్యయం రు. 25 వేల కోట్లు. నాగోల్-శంషాబాద్ విమానాశ్రయం మధ్య 36.8 కిలోమీటర్లు, రాయదుర్గం-కోకాపేట మధ్య 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట మధ్య 7.5 కిలోమీటర్లు, మియాపూర్-పటాన్ చెరు మధ్య 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య 7.1 కిలోమీటర్లు మెట్రో నిర్మాణం చేయాలని రేవంత్ ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ సబ్మిట్ చేసినా ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. మోట్రో రెండోదశను పీపీపీ మోడ్ లో అమలుచేయాలని అనుకున్నా రాష్ట్రప్రభుత్వం వాటాగా రు. 7500 కోట్లు, కేంద్రం వాటాగా రు. 4230 కోట్లు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా) నుండి అప్పు తీసుకోవచ్చని డీపీఆర్ లో చెప్పింది. మొత్తం వ్యయంలో కేంద్రం రు. 4230 కోట్లు భరించినా రాష్ట్రం తనవాటాగా రు. 7500 కోట్లను ఎక్కడినుండి తెస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.

రేవంత్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్ళు అయ్యింది. అభివృద్ధిలో తన ముద్రను చూపించటానికి ఏ ముఖ్యమంత్రికి అయినా రెండేళ్ళసమయం చాలా తక్కువనే చెప్పాలి. పైగా లక్షల కోట్లరూపాయల్లో ఉన్నప్రభుత్వానికి తమ హయాంలో జరిగిన అభివృద్ధి ఇది అని చూపించాలంటే ఏమాత్రం సాధ్యంకాదు. అయితే రేవంత్ నేలవిడిచి సాము చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తానుచేసిన అభివృద్ధి ఇది అని గర్వంగా చెప్పుకోవాలని బాగా తాపత్రయపడుతున్నాడు. అయితే అది ఎంతవరకు సాధ్యమన్నది రేవంత్ కే తెలియాలి. ఎందుకంటే 2023 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరుగ్యారెంటీలే పూర్తిగా అమలుచేయలేకపోతున్నాడు. ఈ ఆరుగ్యారెంటీలతో పాటు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇంకా చాలా హామీలిచ్చాడు. ఆచరణ సాధ్యంకాని హామీల్లో కీలకమైనవి ఏమిటంటే కాలేజీలకు వెళ్ళే విద్యార్ధినులు అందరికీ ఉచితంగా స్కూటీ ఇస్తామని, మహిళలందరికీ తులంబంగారం ఇస్తామని.

రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి బాగుండాలని కోరుకునే ఏపార్టీ నేతకూడా ఇలాంటి హామీలివ్వడు. కాకపోతే తెలుగురాష్ట్రాల్లో ఆచరణసాధ్యంకాని హామీలిచ్చి జనాలను ముఖ్యంగా ఓటర్లను మభ్యపెట్టడం ఒక ట్రెండుగా మారిపోయింది. రేవంత్ కు ముందు తెలంగాణకు ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్ళు పాలించిన కేసీఆర్ కూడా ఇలాంటి ఆచరణసాధ్యంకాని హామీలను చాలానే ఇచ్చారు. రేపటిఎన్నికల్లో అధికారంలోకివచ్చేయాలని తాపత్రయపడుతున్న బీజేపీ ఏమిచేస్తుందో చూడాలి.

సర్వం దోపిడీయే : కేటీఆర్

అధికారంలోకి రావటానికి ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చినట్లు రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో ప్రజలను మోసంచేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు ఆరోపించారు. మూసీనది సుందరీకరణ, త్రిబుల్ ఆర్ ప్రాజెక్టుతో పాటు ఫ్యూచర్ సిటి, మెట్రో ప్రాజెక్టు అన్నింటిలోను రేవంత్ వేల కోట్లరూపాయలు కమీషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. ఢిల్లీ కాంగ్రెస్ కు డబ్బుల మూటలు పంపించటమే రేవంత్ కు ముఖ్యమైపోయిందని ఎద్దేవాచేశారు. రేవంత్ కే ఫ్యూచర్ లేనపుడు ఇక ఫ్యూచర్ సిటి ఏమి నిర్మిస్తాడని సూర్యాపేట ఎంఎల్ఏ, మాజీమంత్రి గుంటకళ్ళ జగదీశ్వర రెడ్డి ఎద్దేవాచేశారు.

పేదల పొట్టకొడుతున్నాడు: బండి

అభివృద్ధి పేరుతో రేవంత్ పేదల పొట్టగొడుతున్నట్లు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అభివృద్ధిపేరుతో రేవంత్ ప్రభుత్వం జనాలను మోసంచేస్తోందని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టుపేరుతో వేలాది పేదలఇళ్ళను ప్రభుత్వంకూలగొట్టేసి బడాకార్పొరేట్లకు భూములు అప్పచెబుతున్నట్లు బండి మండిపోయారు. రేవంత్ ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రాజెక్టుల్లో భారీఅవినీతి జరుగుతోందని కేంద్రమంత్రి రెచ్చిపోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకే దిక్కులేనపుడు ఇక అభివృద్ధి ఎలాచేస్తారని బండి ప్రభుత్వాన్ని నిలదీశారు.

Read More
Next Story