రేవంత్ నెత్తిన బీజేపీ పాలుపోస్తోందా ?
x
Gandhi Bhavan and Revanth

రేవంత్ నెత్తిన బీజేపీ పాలుపోస్తోందా ?

నోటీసులతో ఇబ్బందిపెడుతున్నామని అనుకుని రేవంత్ ఇమేజిని కమలంపార్టీ పెంచుతోందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.


ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నెత్తిన బీజేపీ పాలుపోస్తోందా ? నోటీసులతో ఇబ్బందిపెడుతున్నామని అనుకుని రేవంత్ ఇమేజిని కమలంపార్టీ పెంచుతోందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దుచేస్తున్నామని అమిత్ షా చెప్పినట్లుగా ఒక వీడియో దేశంలో బాగా వైరల్ అయ్యింది. రిజర్వేషన్లను రద్దుచేస్తానని తాను ఎక్కడా చెప్పలేదని అమిత్ షా వెంటనే క్లారిటి ఇచ్చారు. అంతేకాకుండా వీడియో సర్క్యులేషన్ పై ఢిల్లీ బీజేపీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈరోజు హైదరాబాద్ లోని గాంధిభవన్ కు వచ్చారు. పార్టీ సోషల్ మీడియా ఇన్చార్చి మన్నె సతీష్, నవీన్, శివకుమార్, తస్లీమాను విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.

వీళ్ళకి ఎందుకు నోటీసులు ఇచ్చారంటే అమిత్ షా పేరుతో తయారైన ఫేక్ వీడియోను వీళ్ళు నలుగురు వైరల్ చేశారని. సరే, వీళ్ళ నలుగురిని విచారణకు ఢిల్లీకి రమ్మని నోటీసులు ఇచ్చారంటే అర్ధముంది మరి వీళ్ళతో పాటు రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఎందుకు ఇచ్చినట్లు ? ఎందుకంటే రేవంత్ కూడా ట్విట్టర్ ఖాతాలో ఫేక్ వీడియోను పోస్టుచేశారని. సీఆర్పీసీ సెక్షన్ 90 కింద అందరికీ నోటీసులిచ్చి విచారణకు మే1న హాజరుకావాలని చెప్పారు. అయితే తమపై ఎవరు ఫిర్యాదు చేశారని నలుగురు అడిగితే పోలీసులు సమాధానం చెప్పలేదు. సింపుల్ గా బీజేపీ ఫిర్యాదు చేసిందని మాత్రమే చెప్పి వెళ్ళిపోయారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికలు మే 13వ తేదీన జరగబోతున్నాయి. పార్టీ అభ్యర్ధుల కోసం రేవంత్ ఒకటికి పదిసార్లు అన్నీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మధ్యలో కర్నాటక ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి వస్తున్నారు. ఒకవైపు ఎన్నికల్లో రేవంత్ ఇంత బిజీగా ఉంటే ఢిల్లీ పోలీసులు రేవంత్ ను మే 1న విచారణకు ఢిల్లీకి రమ్మని పిలవటంలో అర్ధమేంటి ? ప్రచారంలో పాల్గొనకుండా రేవంత్ ను అడ్డుకునే వ్యూహమే కనబడుతోంది తప్ప మరో కారణం కనబడటంలేదు. ‘విచారణకు తప్పకుండా సహకరిస్తామని అయితే తమకు 15 రోజులు గడువు కావాల’ని అడిగినా పోలీసులు అంగీకరించలేదని పీసీసీ లీగల్ సలహాదారు రామచంద్రారెడ్డి చెప్పారు. తమపై ఎవరు ఫిర్యాదుచేశారని అడిగినా పోలీసులు సమాధానం చెప్పలేదని రెడ్డి మండిపోయారు. ఇదే విషయమై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతు ‘ఇదంతా వెనుకనుండి బీజేపీనే చేయిస్తోంద’న్నారు. ఢిల్లీ పోలీసుల చర్యలను తాము న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే రేవంత్ ను పోలీసులు విచారణకు పిలవటంపై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ ను విచారించదలచుకుంటే పోలీసులు మే 13 పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా పిలవచ్చు. కాని అర్జంటుగా మే 1వ తేదీన విచారణకు ఢిల్లీకి రమ్మని సమన్లు జారీచేయటం వెనుక బీజేపీ కుట్రుందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. విచారణకు రేవంత్ హాజరైనా, హాజరుకాకపోయినా బీజేపీ వల్ల హస్తంపార్టీకి సింపతి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలాగంటే ఎన్నికల్లో బిజీగా ఉన్న రేవంత్ ను పోలీసులు విచారణకు రమ్మని పిలవటం అన్నది సానుభూతిని పెంచేదే అనటంలో సందేహంలేదు. పార్టీ అభ్యర్ధుల తరపున తనను ప్రచారం చేయనీయకుండా బీజేపీ పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతలు నానా గోల మొదలుపెట్టారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత బీజేపీ నేతలపైనే పడుతుందనటంలో సందేహంలేదు. మరి విచారణ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read More
Next Story