
బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ ‘సెంటిమెంటు’ను రాజేస్తోందా ?
కమిషన్ విచారణ పేరుతో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం అంటే మొత్తం తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే అని మండిపడ్డారు
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలను గమనిస్తే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు ఎందుకంటే బీఆర్ఎస్ కు లేదా వ్యక్తిగతంగా కేసీఆర్ కు ఎప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనుకున్నా వెంటనే పార్టీ నేతలు తెలంగాణ సెంటిమెంటును రాజేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు కేసీఆర్+బీఆర్ఎస్ కు వచ్చిన సమస్య ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీచేయటమే. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మూడు కుంగిపోయాయి. పిల్లర్లు కుంగిపోవటమే కాకుండా పెద్దపగుళ్ళు కూడా వచ్చేశాయి. పిల్లర్లు కుంగిపోవటంతో డ్యా ప్లాట్ ఫారమ్ కూడా అనేకచోట్ల బీటలువారాయి. ఫలితంగా బ్యారేజీ నీటినిల్వకు పనికిరాకుండా పోయింది.
హోలుమొత్తంమీద చూసినపుడు బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగింది వాస్తవం, ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగిందన్నది కళ్ళకే కనబడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్ధాపన జరిగింది, నిర్మాణం పూర్తయ్యింది కూడా కేసీఆర్(KCR) నేతృత్వంలోనే కాబట్టి జరిగిన అవినీతి, అవకతవకలకు బాధ్యత వహించాల్సింది కూడా కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే. ఇక్కడ బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వమే. ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావే(Harish Rao) ప్రాజెక్టుల డిజైన్లు, రీ డిజైన్లు, నిధుల విడుదల, స్ధలం ఎంపిక, నిర్మాణం సమస్తం పర్యవేక్షించారు. కాబట్టి ప్రాజెక్టులో ప్లస్సయినా, మైనస్సయినా భరించాల్సింది పై ఇద్దరే. అందుకనే ఇద్దరినీ విచారణకు హజరుకమ్మని కమిషన్ నోటీసులు జారీచేసింది. విచారణకు కేసీఆర్ హాజరవుతారా ? లేదా అన్నది ఇప్పటికైతే సస్సెన్సుగానే ఉంది. విషయం ఏమిటో తెలీదుకాని నోటీసులు జారీఅయిన దగ్గర నుండి ప్రతిరోజు కేసీఆర్-హరీష్ ప్రతిరోజు భేటీ అవుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని హరీష్ పదేపదే వాదిస్తున్నారు.
ఈనేపధ్యంలోనే మాజీమంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతు కమిషన్ విచారణ పేరుతో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం అంటే మొత్తం తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే అని మండిపడ్డారు. అంటే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం ద్వారా కమిషన్ మొత్తం తెలంగాణను అవమానించిందని గంగలు అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ వేరు తెలంగాణ వేరు. తెలంగాణ(Telangana)లో కేసీఆర్ ఒక భాగంమాత్రమే అన్న విషయాన్ని మరచిపోయిన బీఆర్ఎస్ నేతలు కేసీఆరే తెలంగాణ, తెలంగాణే కేసీఆర్ అన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడమని తెలంగాణ సమాజం ఎవరికైనా లైసెన్సిచ్చిందా ? తెలంగాణ సెంటిమెంటు ముసుగులో ఎవరెంత అవినీతికి పాల్పడినా అడక్కూడదా ? గంగుల మాటలు కూడా అలాగే ఉంది. బీఆర్ఎస్ హయంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగినా ఎవరూ ప్రశ్నించకూడదన్నట్లే గంగుల మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను ఎవరైనా ప్రశ్నిస్తే తెలంగాణ సమాజాన్ని అవమానించటమే అన్న పిచ్చిమాటలు మాట్లాడటం దేనికి సంకేతం ?
జూన్ 5 విచారణ తేదీ దగ్గరకొచ్చే సమయానికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంటును రాజేయటానికి గంగుల లాంటి నేతలు ప్లాన్ చేస్తున్నట్లే ఉన్నారు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో ఇరుక్కుని జైలుకు వెళ్ళే సమయంలో కూడా కవిత(Kavitha) ఇలాగే మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తర్వాత విచారణకు రమ్మని సీబీఐ, ఈడీలు నోటీసులు జారీచేసినపుడు తనను విచారణకు రమ్మని నోటీసులు జారీచేయటం అంటే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించటమే, తెలంగాణను విచారించినట్లే అని ఏవేవో పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. అఫ్ కోర్స్ కవిత మాటలను అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. వ్యక్తిగత హోదాలో అవినీతికి పాల్పడటం ఎక్కడన్నా ఇరుక్కుంటే వెంటనే తెలంగాణ సెంటిమెంటును రాజేయటం కల్వకుంట్ల ఫ్యామిలీకి మామూలైపోయింది. ముందుముందు బీఆర్ఎస్ నేతలు ఇంకెన్ని మాటలు మాట్లాడుతారో ? తెలంగాణ సెంటిమెంటును ఏ స్ధాయిలో రాజేస్తారో చూడాల్సిందే.