Chandrababu and TTD|ఈవో-ఛైర్మన్ మధ్య చంద్రబాబు ఇరుక్కున్నారా ?
చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో తప్పు మీదంటే కాదు నీదే అని ఈవో, ఛైర్మన్ మధ్య జరిగిన గొడవ టీటీడీ చరిత్రలోనే సంచలనంగా మారింది.
చంద్రబాబునాయుడు పరిస్ధితి అర్ధమైపోతోంది. విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా తయారైంది చంద్రబాబు వ్యవహారం. ఈవో-ఛైర్మన్ మధ్య గొడవలు ఇపుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. విషయం ఏమిటంటే వైకుంఠ ద్వార దర్శనం(Vykunta Dwara Darsanam) కోసం భక్తులకు ఆఫ్ లైన్ టోకెన్ల జారీ నేపధ్యంలో బైరాగిపట్టెడ కౌంటర్లదగ్గర తొక్కిసలాట జరిగిన విషయంతెలిసిందే. ఆతొక్కిసలాటలో ఆరుగురు మరణించగా సుమారు 50 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఈఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. తిరుమల శ్రీవారి(Tirumala Temple)కి సంబంధించిన వార్తలు, విశేషాలను ప్రపంచంలోని హిందువులందరు చాలా ఆసక్తితో గమనిస్తారని తెలిసిందే. అందుకనే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లజారీలో జరిగిన తొక్కిసలాట, భక్తుల మరణాలు, తీవ్రగాయాలు సంచలనమైపోయింది. వెంటనేస్పందించిన చంద్రబాబు(Chandrababu) తిరుపతికి(Tirupati) చేరుకుని సమీక్షించారు.
తొక్కిసలాటఘటనకు చంద్రబాబు కొందరుకిందస్ధాయి అధికారులను తప్పుపట్టడమే కాకుండా జేఈవో గౌతమితో పాటు మరికొందరు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు చంద్రబాబు ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉందికాని అసలు ఘటనలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో శ్యామలరావు(TTD EO), ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ బీఆర్ నాయడుపైన(TTD Chairman BR Naidu) ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా చంద్రబాబు హెచ్చరికలతో వదిలేశారు. ఇదేసమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం ఈవో, ఛైర్మన్ను బహిరంగంగానే తప్పపట్టిన విషయం కలకలం రేపుతోంది. తిరుపతిలోనే చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో తప్పు మీదంటే కాదు నీదే అని ఈవో, ఛైర్మన్ మధ్య జరిగిన గొడవ టీటీడీ చరిత్రలోనే సంచలనంగా మారింది. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి ముందే ఈవో, ఛైర్మన్ గొడవపడిన ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు.
ముఖ్యమంత్రి సమక్షంలోనే ఇద్దరు ఎందుకు గొడవపడ్డారు ? ఎందుకంటే, ఇద్దరూ చంద్రబాబుకు అత్యంతసన్నిహితులు కావటమే కారణం. ఎవరికివారు చంద్రబాబు తమకే మద్దతుగా నిలుస్తారన్ననమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే చంద్రబాబు ముందే ఇద్దరు గొడవపడ్డారు. అధికారంలోకి రాగానే శ్యామలరావును చంద్రబాబు ఏరికోరి ఈవోగా నియమించినట్లే బీఆర్ నాయుడును ఛైర్మన్ గా నియమించారు. ఇద్దరూ సీఎంకు అత్యంత సన్నిహితులు కాబట్టి టీటీడీపాలన సజావుగా సాగుతుందని అందరు అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఇద్దరి మధ్యా గొడవలు మొదలై పెరిగిపోయాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీటీడీ(TTD) పాలనా వ్యవహారాలు మొత్తం ఈవో చేతిలోనే ఉంటాయి. ఛైర్మన్ ఎంత వపర్ ఫుల్లయినా, సీఎంకు ఎంత దగ్గరైనా ఈవో సానుకూలంగా లేకపోతే ఛైర్మన్ ఏపనీ చేసుకోలేరు. ఇదేసమయంలో పాలనా వ్యవహారాల్లో ఈవో తీసుకోవాలని అనుకున్న ఎలాంటి మార్పులు, చేర్పులకు బోర్డు ఆమోదంలేకుండా సాధ్యంకాదు. తానుచేయాలని అనుకున్న మార్పులను ఛైర్మన్ నాయకత్వంలోని ట్రస్ట్ బోర్డు తిరస్కరిస్తే ఈవో చేయగలిగింది ఏమీలేదు.
అంటే టీటీడీ పాలనావ్యవహారలతో పాటు శ్రీవారిదర్శనంలో మార్పులు, తిరుమలకువచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల్లాంటి నిర్ణయాల్లో ఈవో, ఛైర్మన్ ఎంత కీలకమో అర్ధమవుతోంది. ఇద్దరిమధ్యా ఎంతో సమన్వయం ఉంటేకాని టీటీడీ వ్యవహారాలు సజావుగా జరగవు. తిరుమల శ్రీవారికి సంబంధించి ఎంతచిన్న విషయమైనా భక్తుల మనోభావాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అంతటి కీలకమైన స్ధానాల్లో ఉన్న ఈవో, ఛైర్మన్ చంద్రబాబు ముందే గొడవపడ్డారంటే వాళ్ళమధ్య సంబంధాలు ఎంతగా క్షీణించిందో అర్ధమైపోతోంది. తొక్కిసలాట ఘటన తర్వాత ఈవో, ఛైర్మన్ మధ్య గొడవతో ఇఫుడు అందరి దృష్టి చంద్రబాబు మీదపడింది.
ఇద్దరిలో ఎవరో ఒకరిమీద కాని లేదా ఇద్దరిమీద కాని చంద్రబాబు చర్యలు తీసుకోవాల్సిందే. ఇక్కడ చర్యలంటే అర్ధం బదిలీ లేదా రాజీనామా చేయించటమే. ఈవో సీనియర్ ఐఏఎస్ అధికారి కాబట్టి బదిలీచేసే అవకాశముంది. అలాగే బీఆర్ నాయుడుతో ఛైర్మన్ గా రాజీనామా చేయించచ్చు. లేదా ఇద్దరి మధ్య సర్దుబాటు చేసి, వార్నింగులిచ్చి ఇద్దరినీ కంటిన్యుచేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇద్దరిమధ్యా సర్దుబాటు అంటే అంత సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు. చంద్రబాబు సమక్షంలోనే ఇద్దరు ఒకరిని మరొకరు తప్పుపట్టి నిందించుకునేంత స్ధాయిలో ఇద్దరిమధ్య విభేదాలు ముదిరిపోయాయి. కాబట్టి చంద్రబాబు ఇపుడు సర్దుబాటుచేసినా అది తాత్కాలికమే అవుతుంది. శాస్వత పరిష్కారం ఏమిటంటే ఇద్దరిలో ఎవరో ఒకరిని టీటీడీ నుండి తప్పించటమే.
ఇక్కడే చంద్రబాబు ఇద్దరి మధ్యా ఇరుక్కుపోయారు. ఏరికోరి తెచ్చిపెట్టుకున్న ఇద్దరూ గొడవలు పడుతుండటంతో ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలన్న విషయం చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది. టీటీడీలో మొత్తం యంత్రాంగమంతా ఇప్పటికే ఛైర్మన్ కు వ్యతిరేకమైపోయారని సమాచారం. ఈ సమయంలో ఈవోను బదిలీచేస్తే మిగిలినవాళ్ళు ఛైర్మన్ కు ఎంతవరకు సహకరిస్తారన్నది అనుమానమే. ఇప్పటికే ఛైర్మన్ నాయడు టీటీడీలో ఒంటరి అయిపోయినట్లు అర్ధమవుతోంది.
వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై టీటీడీ 16 సమీక్షలు నిర్వహిస్తే ఈవో, ఛైర్మన్ ఇద్దరూ హాజరైంది ఒకే ఒక్కసారి. మిగిలిన 15 సార్లు ఈవో మాత్రమే సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో ఈవోపై ఛైర్మన్ మండిపోతున్నట్లు సమాచారం. అలాగే ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతు శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్ల విధానాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందు ఛైర్మన్ మాటమాత్రంగా కూడా ఈవోతో చెప్పలేదు. ఇలాంటి అనేక విషయాలే ఇద్దరి మధ్యా బాగా గ్యాప్ పెంచేశాయి. నిర్ణయాలు తీసుకునేది బోర్డే అయినా వాటిని అమలుచేయాల్సింది ఈవో మార్గదర్శనంలోని యంత్రాంగమే. యంత్రాగం ఎదురు తిరిగితే ఛైర్మన్ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండలేరు. పైగా రేపు ఈవోగా వచ్చే మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఛైర్మన్ తో సఖ్యతగా పనిచేస్తారని గ్యారెంటీలేదు. ఈవో శ్యామలరావు, ఛైర్మన్ నాయుడులోని ఇగో సమస్యే ఇప్పటి దుర్ఘటనకు కారణమని అందరికీ అర్ధమైంది. ఒకళ్ళతో మరొకళ్ళు సర్దుబాటు చేసుకుని పోవాలన్న ఆలోచన ఇద్దరిలోను లేకపోవటమే ఇపుడు చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది. మరి చంద్రబాబు వీళ్ళిద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.