చిరంజీవిది డబుల్ గేమేనా ?
x
Chiranjeevi

చిరంజీవిది డబుల్ గేమేనా ?

మెగాస్టార్ మాటలు, చేతలు చూస్తుంటే మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించటానికి భయపడుతున్నట్లుగా అనుమానాలు పెరిగిపోతున్నాయి.


మెగాస్టార్ చిరంజీవి తాజా ప్రకటన తర్వాత డబుల్ గేమ్ ఆడుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ చిరంజీవి ఏమన్నారంటే ‘తాను సినిమాలకు దగ్గరగా రాజకీయాలకు దూరంగా ఉంటాన’ని చెప్పారు. తాను రాజకీయాల్లోకి మళ్ళీ వస్తాననే ప్రచారం అబద్ధమే అన్నారు.‘సినీరంగానికి సేవలు అందించటంలో భాగంగానే రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను కలుస్తుంటా’నని సమర్ధించుకున్నారు. ‘రాజకీయంగా ముందుకు వెళ్ళటానికి, తన లక్ష్యాలు-సేవలను నెరవేర్చేందుకు తన సోదరుడు, జనసేన అధినేత కమ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉన్నార’ని చెప్పారు. ‘జీవితాంతం తాను రాజకీయాలకు దూరంగానే ఉంటాన’ని భీష్మప్రతిజ్ఞ చేశారు.

చిరంజీవి(Megastar Chiranjeevi) ఇంతచెప్పినా జనాలు పెద్దగా నమ్మటంలేదు. ఎందుకంటే ఏదో రూపంలో చిరంజీవికి రాజకీయ వాసనలు తగులుతునే ఉన్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన చిరంజీవి తరచూ రాజకీయాలగురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు. రాజకీయాలగురించి మాట్లాడమని చిరంజీవిని ఎవరూ అడగలేరు, ఒత్తిడిపెట్టలేరు. తనంతట తానుగానే రాజకీయాలగురించి మాట్లాడుతున్నారు. రాజకీయాలకు దూరమని ప్రకటించిన చిరంజీవి మరి కాంగ్రెస్ సభ్యత్వానికి(Congress membership) ఎందుకు రాజీనామా చేయలేదు ? చిరంజీవి తమ పార్టీవాడే అని చాలామంది కాంగ్రెస్ నేతలు ఇఫ్పటికి ఎన్నిసార్లు ప్రకటించారో లెక్కేలేదు. రాజకీయాలకు తానుదూరం అని చిరంజీవి ప్రకటించినపుడల్లా వెంటనే కాంగ్రెస్ నేతలు పార్టీ సభ్యత్వం అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి చిరంజీవి రాజీనామా చేసినట్లుగా ఇప్పటివరకు వార్తలు రాలేదు. మెగాస్టార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసుంటే హస్తంపార్టీ నేతలు ఆ విషయాన్ని ప్రకటించుండేవారే. చిరంజీవి కూడా కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. మెగాస్టార్ మాటలు, చేతలు చూస్తుంటే మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించటానికి భయపడుతున్నట్లుగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2009లో ప్రజారాజ్యంపార్టీని ఏర్పాటుచేసినపుడు కాబోయే సీఎం అని కలలుకన్నారు. అయితే ఆకలలన్నీ ఎన్నికల ఫలితాలతో భగ్నమైపోయాయి. పార్టీని నడిపేంత సీన్ లేకపోవటంతో వేరేదారిలేక ప్రజారాజ్యంపార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనంచేసేశారు. తాను రాజ్యసభ ఎంపీ అయి తర్వాత కేంద్రమంత్రి పదవిని తీసుకుని తనను నమ్ముకున్న నేతలు, క్యాడర్ ను వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేశారు. అప్పటినుండే చిరంజీవిపై ఎంతమాత్రం నమ్మదగ్గ వ్యక్తికాదనే ముద్రపడిపోయింది.

ఇతర సామాజికవర్గాల మాటెలాగున్నా స్వయంగా కాపు సామాజికవర్గంలోని చాలామంది చిరంజీవిని నమ్మటం మానేశారు. దానిదెబ్బే జనసేన(Janasena) పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ మీద కూడా గట్టిగా పడింది. 2019లో పవన్ పోటీచేసిన రెండునియోజకవర్గాల్లో ఓడిపోయారంటే అందు కారణం కాపు(Kapu)లు కూడా పవన్ను నమ్మకపోవటమే. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan mohan reddy) వ్యతిరేకత రూపంలో కాలం కలిసిరావటంతో పిఠాపురంలో(Pithapuram) పవన్ గెలిచాడు. జనసేన అధినేతగా పవన్ కూడా చిరంజీవి మీదున్న వ్యతిరేకతను చాలకాలం ఎదుర్కొన్నవాడే. అలాంటిది తన ఆలోచనలను, లక్ష్యాలను పవన్ కల్యాణ్ నెరవేరుస్తాడని చిరంజీవి చెప్పటమే విచిత్రంగా ఉంది. జీవితాంతం రాజకీయాలకు దూరమన్న తన మాటమీద చిరంజీవి ఎంతకాలం నిలబడతారో చూడాల్సిందే.

Read More
Next Story