తెలంగాణ బీజేపీకి ఢిల్లీ మ్యాజిక్ సాధ్యమేనా ?
x
Kishanreddy and Bandi Sanjay

తెలంగాణ బీజేపీకి ఢిల్లీ మ్యాజిక్ సాధ్యమేనా ?

ఢిల్లీఎన్నికల్లో విజయంసాధించినట్లే తెలంగాణలో ఈనెలాఖరులో జరగబోతున్న మూడు ఎంఎల్సీ(Telangana MLC elections) సీట్లలో కూడా గెలుస్తామని అంటున్నారు.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో బీజేపీ నేతలు తెలంగాణలో రెచ్చిపోతున్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లలో బీజేపీ 48 సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిందికాబట్టి ఢిల్లీ బీజేపీ(BJP) నేతలు రెచ్చిపోయారంటే అర్ధముంది. మరి ఢిల్లీ(Delhi elections)లో విజయంతో తెలంగాణ(Telangana) బీజేపీనేతలు ఎందుకురెచ్చిపోతున్నారో అర్ధంకావటంలేదు. ఢిల్లీఎన్నికల్లో విజయంసాధించినట్లే తెలంగాణలో ఈనెలాఖరులో జరగబోతున్న మూడు ఎంఎల్సీ(Telangana MLC elections) సీట్లలో కూడా గెలుస్తామని అంటున్నారు. తర్వాత అంటే 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపు తమదే అని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ తదితరులు ఆకాశమంతగా రెచ్చిపోతున్నారు. ఢిల్లీఎన్నికల్లో గెలిచిన బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో కూడా గెలిచేంత సీనుందా ?

ఈనెల 27వ తేదీన ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎంఎల్సీ సీట్ల భర్తీకి ఎన్నిక జరగబోతోంది. మూడుసీట్ల ఎన్నికలో బీఆర్ఎస్ పోటీచేయటంలేదు కాబట్టి ఫైట్ డైరెక్టుగా కాంగ్రెస్-బీజేపీ మధ్యే ఉండబోతోంది. పోటీలో ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా ఉన్నా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీనే కీలకం. ఇపుడు ఢిల్లీలో అయినా గతంలో గుజరాత్, హర్యాన ఎన్నికల్లో అయినా బీజేపీ గెలిచిందంటే ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలికే ప్రధాన కారణం. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య డైరెక్ట్ ఫైట్ జరిగినపుడు కమలంపార్టీ ఓడిపోయింది. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోయినపుడు మాత్రమే బీజేపీ గెలుస్తోంది డైరెక్ట్ ఫైట్ జరిగిన రాష్ట్రాల్లో ఓడిపోతోందని.

ఇపుడు ప్రస్తుత విషయానికివస్తే తెలంగాణలో జరగబోయే మూడు ఎంఎల్సీ సీట్లను గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నది. మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఒక గ్రాడ్యుయేట్, మరో టీచర్ ఎంఎల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. రెండో టీచర్ ఎంఎల్సీ పరిధిలోకి నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాలు వస్తాయి. ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటర్లు పరిమితంగా ఉంటారని అందరికీ తెలిసిందే. పై మూడు ఎన్నికల్లో కూడా మహాయితే ఒక్కో సీటులో ఓటర్లు 4 లక్షలుంటే చాలా ఎక్కువ. ఓటర్లు కూడా గ్రాడ్యుయేట్లు, టీచర్లే కాబట్టి ఓటర్లను కలవటం అభ్యర్ధులకు చాలా లేలికనే చెప్పాలి. ఓటర్లు తక్కువ, కలవటానికి ఎక్కువ అవకాశాలున్నా ఓటర్లను కన్వీన్స్ చేసి ఓట్లేయించుకోవటం అంత ఈజీకాదు. ఈ మూడు సీట్ల పరిధిలోని జిల్లాల్లో బీఆర్ఎస్ కు బలమున్నా ఓటమిభయంతోనే పోటీకి దూరంగా ఉంటోంది. సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్నా ఇప్పటివరకు పార్టీతరపున పోటీవిషయమై నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోలేదంటేనే పోటీకి దూరంగా ఉంటున్నారని అర్ధమైపోతోంది.

కాబట్టి పోటీ డైరెక్టుగా కాంగ్రెస్-బీజేపీ మధ్యే అన్నది స్పష్టమైపోయింది. ఎంఎల్సీ ఎన్నికలు అన్నది పూర్తిగా రాష్ట్రప్రభుత్వానికి సంబంధించింది మాత్రమే. ఎంఎల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి(Revanth) పాలనపై ఓటర్లు అనుకూలమా లేకపోతే వ్యతిరేకమా అన్నవిషయంలో కొంచెం క్లారిటి వస్తుంది. రేవంత్ పాలన బాగుందని ఓటర్లు అనుకుంటే కాంగ్రెస్ గెలుస్తుంది లేకపోతే బీజేపీ వైపు ఓటర్లు మొగ్గుచూపించే అవకాశముంది. రెండుపార్టీలు వద్దని ఓటర్లు అనుకుంటే ఇండిపెండెంట్లకు ఓట్లేసి గెలిపించే అవకాశాలను కూడా కొట్టేసేందుకులేదు. గ్రాడ్యుయేట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సుమారు 50 వేల ఉద్యోగాలను భర్తీచేసింది. ముఖ్యంగా గ్రూప్-1, గ్రూప్-2 పోటీపరీక్షలు ఎలాంటి వివాదాలు లేకుండానే ప్రశాంతంగా ముగిశాయి. అలాగే టీచర్ ఎంఎల్సీ సీట్లలో కూడా రేవంత్ ప్రభుత్వంపై ఓటర్లు మొగ్గుచూపే అవకాశాలున్నాయి.

ఎందుకంటే టీచర్లయిన భార్యా, భర్తలు ఒకేచోట ఉద్యోగాలు చేసుకునేట్లుగా రేవంత్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అలాగే చాలాకాలంగా పెండింగులో ఉన్న డీఎస్సీని నిర్వహించింది. డీఎస్సీని ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించి టీచర్ పోస్టులను కూడా భర్తీచేసింది. ఇటు గ్రాడ్యుయేట్లు అటు టీచర్లను ఆకట్టుకునేట్లుగానే ప్రభుత్వం కొన్నిచర్యలు తీసుకున్నది. కాబట్టి ఈ అంశాలను ప్రస్తావించి కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపుకు మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారంచేయబోతున్నారు. ఇదేసమయంలో బీజేపీ అభ్యర్ధుల గెలుపుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎంఎల్ఏలు ఏమని ప్రచారం చేస్తారో చూడాలి. వీళ్ళ ప్రచారంలో రేవంత్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తునే నరేంద్రమోడీ పాలనను ఆకాశమంత ఎత్తున చూపాల్సుంటుంది.

తెలంగాణలోని మూడు ఎంఎల్సీఎన్నికలకు నరేంద్రమోడీ(Narendra Modi) పాలనతో ఎలాంటి సంబంధంలేదు. ఈమధ్యనే ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండిచెయ్యి చూపించటం బీజేపీకి బాగా మైనస్సనే చెప్పాలి. కిషన్, బండి చెబుతున్నట్లుగా మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే సాధ్యంకాదు. కేంద్రమంత్రులు చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కార్(Double engine government) రావాలంటే మరో నాలుగేళ్ళు వెయిట్ చేయాల్సిందే. కాంగ్రెస్ కన్నా ముందుగా ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించటం బీజేపీకి అడ్వాంటేజ్ అయినా అభ్యర్ధులు ఇంకా విస్తృతంగా ప్రచారంలోకి దిగలేదన్నది వాస్తవం. ఇదేసమయంలో అభ్యర్ధులను కాంగ్రెస్ ఆలస్యంగా ప్రకటించినా అధికారంలో ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అలాగే బీఆర్ఎస్ పోటీలో లేకపోవటం కాంగ్రెస్ కు రెండో సానుకూల వాతావరణమనే చెప్పాలి.

బీఆర్ఎస్(BRS) ఓట్లను కాంగ్రెస్, బీజేపీలు ఏమేరకు చీల్చుకుంటాయో చూడాల్సిందే. ఓట్లు చీల్చుకోవటంలో కాంగ్రెస్ కు ఎక్కువ అవకాశాలున్నాయి. కారణం ఏమిటంటే ఇపుడు బీఆర్ఎస్ లోని చాలామంది నేతలు, క్యాడర్ ఒకపుడు కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళే. బీఆర్ఎస్ నేతల అవసరాలను రేవంత్ ప్రభుత్వం తీర్చగలదే కాని మోడీ ప్రభుత్వం తీర్చలేందు. బీఆర్ఎస్ ఎటూ పోటీలో లేదుకాబట్టి తమ ఓట్లను కారుపార్టీ నేతలు, క్యాడర్ హస్తంపార్టీకి వేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలున్నట్లే బీజేపీ నేతల మధ్య కూడా విభేదాలున్నాయని అందరికీ తెలిసిందే. క్షేత్రస్ధాయిలో సమీకరణలను భేరీజు వేసుకుంటే బీజేపీకి ఢిల్లీ మ్యాజిక్ తెలంగాణలో రిపీటయ్యే అవకాశాలు దాదాపు లేవనే అనిపిస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపంటారా అప్పటి సంగతి అప్పుడు చూసుకోవాల్సిందే.

Read More
Next Story