రేవంత్ అంటే కేటీయార్ కు ఇంత అక్కసెందుకు ?
x

రేవంత్ అంటే కేటీయార్ కు ఇంత అక్కసెందుకు ?

బీఆర్ఎస్ ను పదేళ్ళు పాలించమని అధికారాన్ని ఇచ్చిన ప్రజలే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు పాలనా అవకాశాన్ని అందించారు. దాన్ని కూడా తట్టుకోలేకపోతే ఎలాగ ?


బీఆర్ఎస్ లోని కీలక వ్యక్తుల వ్యవహారం భలే విచిత్రంగా ఉంటోంది. మెచ్యూర్డ్ పొలిటీషియన్లకు ఉండాల్సిన లక్షణాలు కనబడటంలేదు. పదేళ్ళ పరిపాలన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయింది. పదేళ్ళ ప్రతిపక్షవాసం అనుభవించిన కాంగ్రెస్ కు అధికారయోగం దక్కింది. పదేళ్ళు అధికారాన్ని అనుభవించిన కేసీయార్, కేటీయార్, హరీష్ అండ్ కో మరి ఆ అవకాశాన్ని కాంగ్రెస్ నేతలకు ఇవ్వాలి కదా. బీఆర్ఎస్ ను పదేళ్ళు పాలించమని అధికారాన్ని ఇచ్చిన ప్రజలే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు పాలనా అవకాశాన్ని అందించారు. దాన్ని కూడా తట్టుకోలేకపోతే ఎలాగ ?

ఇపుడు విషయం ఏమిటంటే నేతలు, కార్యకర్తల సమావేశంలో కేటీయార్ మాట్లాడుతు మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీచేద్దాం రమ్మని రేవంత్ రెడ్డిని చాలెంజ్ చేశారు. ‘నువ్వో నేనో తేల్చుకుందాం రమ్మ’ని రేవంత్ ను కేటీయార్ చాలెంజ్ చేయటమే విచిత్రంగా ఉంది. తాను చాలెంజ్ చేసినా రేవంత్ ఎలాగూ మల్కాజ్ గిరిలో ఎంపీగా పోటీచేయరని కేటీయార్ నమ్మకం అయ్యుండచ్చు. ఒకవేళ నిజంగానే రేవంత్ పోటీకి సిద్ధపడితే అప్పుడు కేటీయార్ ఏమిచేస్తారు ? రాబోయే ఎన్నికల్లో కేటీయార్ ఓడిపోతే అప్పుడేమంటారు ? ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ పోటీచేయబోయేది లేదు, కేటీయార్ తేల్చుకునేది లేదని అందరికీ తెలుసు. మరి తెలిసి కూడా కేటీయార్ ఎందుకీ చాలెంజులు చేస్తున్నట్లు ?

ఎందుకంటే కేటీయార్లో పేరుకుపోతున్న అక్కసే కారణం. అధికారంలో తాము తప్ప మరో పార్టీ ఉండకూడదు. అందులోను తమ కుటుంబానికి బద్ధశతృవైన రేవంత్ రెడ్డి అసలుండకూడదు. ముఖ్యమంత్రిగా రేవంత్ ను చూస్తు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు, కవితలు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే రేవంత్ ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుండి కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుహామీలు బూటకమని, దొంగ హామీలతో జనాలను మోసంచేశారని నానా గోలచేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని, ఈ ప్రభుత్వం ఎక్కువరోజులుండదని, తాము తలచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తామంటు నానా రచ్చచేస్తున్నారు.

వర్షాలు పడకపోయినా రేవంత్ ప్రభుత్వమే కారణమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో. అప్పటికి వర్షాకాలం అయిపోయింది. కేసీయార్ హయాంలోనే వర్షాలు కురవకపోవటంతో పంటలు దెబ్బతిన్నాయి. ఆ విషయాన్ని దాచిపెట్టి రేవంత్ సీఎం అవటం వల్లే వర్షాలు కురవటంలేదనే ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే హరీష్ రావు ఏకంగా కరువుయాత్రలు మొదలుపెట్టడం.

రేవంత్ ను కేసీయార్ అండ్ కో ముఖ్యమంత్రిగా చూస్తు తట్టుకోలేకపోతున్నారన్నది నిజం. ఎందుకంటే ఈ ఫ్యామిలీకి రేవంత్ కొరకరాని కొయ్యగా మారిపోయారు. ఓటుకునోటు ఘటనలో రేవంత్ అరెస్టుతో మొదలైన కేసీయార్-రేవంత్ వైరం మొన్నటి ఎన్నికల్లో పీక్స్ కు చేరుకుంది. దానిమీద రేవంత్ సీఎం అవటం అగ్నికి ఆజ్యంపోసినట్లయ్యింది. అందుకనే తమ అక్కసును రకరకాలుగా వెళ్ళగక్కుతున్నారు. పదేళ్ళ పాలనలో కేసీయార్ ఎన్నిహామీలిచ్చారు ? ఎన్నింటిని అమలుచేశారనేది జనాలకందరికీ తెలిసిందే. అలాంటిది వంద రోజుల పరిపాలనలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ ఎలాగ నెరవేర్చగలదు ?

పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి ప్రభుత్వం మీద రు. 7 లక్షల కోట్ల అప్పుందని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వాన్ని నడపటానికి ముందు అప్పులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకునేందుకే రేవంత్ ప్రభుత్వానికి వందరోజులు సరిపోదు. అయినా సరే వస్తున్న ఆదాయంతోనే నాలుగు హామీలను అమల్లోకి తెచ్చారు. 2018లో కేసీయార్ ఇచ్చిన డబుల్ బెడ్ రూముల ఇళ్ళు, రైతు బంధు, ఉద్యోగాల భర్తీ ఎంతవరకు అమలైందో అందరికీ తెలిసిందే.

ఇదే విషయమై సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ కే. సుధాకరరెడ్డి మాట్లాడుతు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ కేటీయార్ లో స్పష్టంగా కనబడుతోందన్నారు. తాను పుట్టుకతోనే రాజకుమారుడిగా కేటీయార్ ఫీలవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. అధికారం పోవటాన్ని కేసీయార్ ఫ్యామిలి సహించలేకపోతోందన్నారు. ఆ అక్కసులో నుండే నోటికొచ్చింది మాట్లాడుతు, చాలెంజులు చేస్తున్నట్లు ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. కేటీయార్ చాలెంజులకు అసలు విలువేలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటానికే గట్టి అభ్యర్ధులను వెతుక్కుంటున్న కేటీయార్ పోటీకి రేవంత్ ను చాలెంజ్ చేయటం విచిత్రంగా ఉందన్నారు.

Read More
Next Story