హైదరాబాద్ రెండు ముక్కలవబోతోందా ?
x
Greater Hyderabad Municipal Corporation

హైదరాబాద్ రెండు ముక్కలవబోతోందా ?

రెండుముక్కలు అవటం అంటే ఒకటిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ను రెండు కార్పొరేషన్లుగా విభజించబోతోన్నట్లు సమాచారం


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొందరలోనే రెండుముక్కలు అవబోతోందా ? రెండుముక్కలు అవటం అంటే ఒకటిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ను రెండు కార్పొరేషన్లుగా విభజించబోతోన్నట్లు సమాచారం. ఇపుడు 150 డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీని(GHMC) తొందరలోనే ప్రభుత్వం 75 డివిజన్లతో రెండుగా విభజించబోతోంది. అప్పుడు ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నే కంటిన్యు అవుతుంది. కొత్తది అంటే రెండోది గ్రేటర్ సికింద్రాబాద్(Secunderabad) మున్సిపల్ కార్పొరేషన్(జీఎస్ఎంసీ)గా ఏర్పాటవబోతోంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని, పాలన కూడా సులభం అవుతుందని ఈమధ్యనే జరిగిన సమీక్షలో రేవంత్(Revanth) కు మున్సిపల్ ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం.

జీహెచ్ఎంసీని రెండుగా విభజించిన తర్వాత శివారు మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీలను రెండింటిలోను కలపాలని సమీక్షలో డిసైడ్ అయినట్లు తెలిసింది. గ్రేటర్ పరిధిలోకే శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలను, పంచాయితీలను కలిపేసి మెగా కార్పొరేషన్ గా ఏర్పాటుచేయాలని గతంలో అనుకున్నారు. అయితే దానివల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని సమీక్షలో ఉన్నతాధికారులు రేవంత్ కు వివరించారు. పైగా జీహెచ్ఎంసీని రెండుగా విభజించటం వల్లే వచ్చేలాభాలను కూడా ఉన్నతాధికారులు చెప్పారు. అధికారుల వాదనకు రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అభివృద్ధి వేగంగా జరగటానికి, నిధుల కేటాయింపు, సిబ్బంది పర్యవేక్షణ తదితరాలకు ముంబాయ్(Mumbai) మున్సిపల్ కార్పొరేషన్ను ఉన్నతాధికారులు ఉదాహరణగా చూపించారు.

ఒకటిగా ఉన్న బృహన్ ముంబాయ్ మున్సిపల్ కార్పొరేషన్ను రెండుగా విడదీయటం వల్లే నిధుల కేటాయింపులు ఎక్కువగా జరిగి అభివృద్ధి కూడా స్పీడుగా జరిగిందని అధికారులు వివరించారు. ముంబాయ్ కార్పొరేషన్ లాగే జీహెచ్ఎంసీని కూడా రెండుగా విభజించటం వల్ల జరగబోయే అభివృద్ధిని రేవంత్ కు వివరించారు. కార్పొరేషన్ల అభివృద్ధికి కేంద్రపట్టణాభివృద్ధిశాఖ నుండి ఎక్కువ నిధులను రాబట్టవచ్చనే ప్రతిపాదన కీలకమైనది. జీహెచ్ఎంసీని మినహాయిస్తే ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)(Outer ring road) లోపల 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, కొన్ని పంచాయితీలున్నాయి. ఓఆర్ఆర్ వరకూ నగరాన్ని ఒకేపద్దతిలో అభివృద్ధిచేసేందుకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయితీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదంతా జరిగితే జీహెచ్ఎంసీ పరిధి 2 వేల చదరపు కిలీమీటర్లకు విస్తరిస్తుంది.

హైదరాబాద్(Hyderabad) ను ఓఆర్ఆర్ కు హద్దుగా చేసుకుని లోపలున్న 2 వేల చదరపు కిలీమీటర్లను రెండు కార్పొరేషన్లుగా అంటే చెరో వెయ్యి చదరపు కిలోమీటర్లుగా విడదీయాలన్నది ఉన్నతాధికారుల ప్రతిపాదన. దీనివల్ల 150 డివిజన్లను చెరో 75 డివిజన్లుగా విడదీసి హైదరాబాద్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కార్పొరేషన్లలో కలపటనికి వీలవుతుంది. రెండు గ్రేటర్ కార్పొరేషన్లుగా విడదీసిన తర్వాత డివిజన్ల సరిహద్దులను నిర్ణయించబోతున్నారు. కేసీఆర్ హయాంలోనే ఇలాంటి ప్రతిపాదన వచ్చినా ఎందుకనో ముందడుగు పడలేదు. ఇపుడు రేవంత్ హయాంలో అప్పటి ప్రతిపాదన మళ్ళీ ఊపిరిపోసుకున్నది. రెండు కార్పొరేషన్లను ప్రభుత్వం 30 సర్కిళ్ళు, ఆరుజోన్లుగా విభజించాలని కూడా ఆలోచిస్తోంది. ఇప్పటికే కాలపరిమితి తీరిన పంచాయితీలను దగ్గరలోనే ఉన్న మున్పిపాలిటీల్లో కలపేయబోతున్నది ప్రభుత్వం. మున్సిపాలిటీలను కార్పొరేషన్లలో కలిపేయాలని ఆలోచిస్తున్నది. ఈ కసరత్తును వీలైనంత తొందరలో మొదలుపెట్టి ముగించేయాలని రేవంత్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మరి కసరత్తు ఎప్పుడు మొదలవుతుంది ? ఎప్పటిలోగా ముగుస్తుందన్నది సస్పెన్సు.

Read More
Next Story