
మాగంటి సునీతకు డ్యామేజీ తప్పదా ? గెలిస్తే సమస్యలు తప్పవా ?
ఒకవైపు గోపీమరణం తాలూకు సింపథితో ఓట్లు వేయించుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద ప్లాన్ వేసి సునీత, పిల్లలను ప్రచారంలో తిప్పుతున్నారు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక తేదీ దగ్గరపడుతున్నకొద్దీ మాగంటి సునీత వివాదం కూడా తారాస్ధాయికి చేరుకుంటోంది. గుట్టుగా ఉండాల్సిన కుటుంబ వివాదం రచ్చకెక్కటంతో ఎన్నికలో(Jubilee Hills by poll) ఆమెకు డ్యామేజీ తప్పదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వివాదం ఏమిటంటే బీఆర్ఎస్(BRS) అభ్యర్ధిగా పోటీచేస్తున్న మాగంటిసునీత(Maganti Sunitha) దివంగత ఎంఎల్ఏ మాగంటి గోపీనాధ్(Maganti Gopinath) భార్య కాదని. గోపి-సునీత ఇన్ని ఏళ్ళుగా లివ్ ఇన్ రిలేషన్లోనే ఉన్నారనే సమాచారం మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. అసలీ వివాదానికి కారణం ఏమిటంటే సునీత నామినేషన్ వేసిన తర్వాత మాగంటి గోపీనాధ్ భార్యంటు మాలినీదేవి, కొడుకుని అంటు ప్రద్యుమ్న అమెరికా నుండి దిగారు.
వీళ్ళు రావటం రావటమే ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి అభ్యంతరం వ్యక్తంచేశారు. గోపీనాధ్ భార్య అంటు సునీత ఇచ్చిన డిక్లరేషన్ చెల్లదంటు అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే అప్పటికే నామినేషన్లు వేయటం, స్క్రూటిని జరగటం, సునీత అభ్యర్ధిత్వాన్ని ఓకే చేయటం అంతా అయిపోయింది కాబట్టి ఇపుడు చేయగలిగేది ఏమీలేదని, కావాలని అనుకుంటే ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదుచేసుకోమని రిటర్నింగ్ అధికారి చెప్పేశారు. అప్పటినుండి వివాదం సునీత చుట్టూ తిరుగుతునే ఉంది.
ఇది సరిపోదన్నట్లుగా గోపీ భార్యగా సునీతకు ఫ్యామిలి సర్టిఫికేట్ ఇచ్చిన శేరిలింగంపల్లి ఎంఆర్వో దగ్గర మాలినీదేవి, ప్రద్యుమ్న ఫిర్యాదుచేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎంఆర్వో అటు సునీత పిల్లలను, ఇటు మాలినీదేవి, ప్రద్యుమ్నను విచారించారు. ఈ వివాదం ఇలాగుండగానే గోపీనాధ్ తల్లి మహానందకుమారి ఎంట్రీతో సునీత పైన పెద్ద బాంబులే పడ్డాయి. మహానందకుమారి ఏమన్నారంటే సునీతను గోపి వివాహం చేసుకోలేదట. అలాగే మాలినీదేవికి గోపి విడాకులు ఇవ్వలేదన్నారు. ప్రద్యుమ్నే గోపి కొడుకు, తనకు మనవడు అంటు తల్లి చేసిన వ్యాఖ్యలు సునీత, బీఆర్ఎస్ ను బాగా ఇరకాటంలో పడేశాయి.
ఒకవైపు గోపీమరణం తాలూకు సింపథితో ఓట్లు వేయించుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద ప్లాన్ వేసి సునీత, పిల్లలను ప్రచారంలో తిప్పుతున్నారు. ఇదేసమయంలో మాలినీదేవి, ప్రద్యుమ్న, మహానందకుమారి ఆరోపణలు, వ్యాఖ్యలతో బాగా డ్యామేజి అవుతోంది. జనాలంతా మాగంటి కుటుంబంలోని వివాదం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఒకవైపు సింపథి ప్రచారం మరోవైపు ఫ్యామిలి డ్యామేజి రెండు ప్యారలల్ గా జరుగుతున్నాయి.
రెండు కుటుంబాలను ఎంఆర్వో వెంకటరెడ్డి పిలిపించి విచారించారు. గోపీ వారసత్వానికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించిన ఆధారాలను ఇవ్వమని కోరారు. గోపీ భార్యగా సునీత, పిల్లలు ఎంఆర్వో ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికేట్లనే చూపించారు. ఎంఎల్ఏ స్పౌజ్ హోదాలో అసెంబ్లీ సెక్రటేరియట్ జారిచేసిన గుర్తింపుకార్డులో కూడా సునీతకు వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాధ్ అనే ఉంది. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే గోపీకి ఇద్దరు భార్యలున్నారని.
ఎందుకింత వివాదం ?
ఇన్ని ఆధారాలు చూపించినా గోపీ భార్యగా సునీత చుట్టూ వివాదం పెరుగుతోంది. ఎందుకంటే మొదటిభార్య మాలినీదేవికి విడాకులు ఇవ్వకుండానే గోపి సునీతను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. గోపికి తనకు వివాహం అయినట్లు మాలినీదేవి ఏమి ఆధారాలు చూపించారో తెలీదు. గోపి-మాలిని చాలాకాలంగా విడివిడిగానే ఉంటున్నట్లు వీళ్ళ మాటలను బట్టి అర్దమవుతోంది. మాలినీకి గోపి దూరమైన తర్వాత సునీతను వివాహం చేసుకున్నాడా లేకపోతే సహచర్యం చేశాడా అన్న విషయంలో కూడా క్లారిటిలేదు. ఎందుకంటే సునీతను తన కొడుకు వివాహం చేసుకోలేదని, మొదటిభార్య మాలినీదేవికి విడాకులు ఇవ్వలేదని తల్లి ఇఫుడు చెబుతున్నారు. అయితే గోపి-సునీత వివాహం చేసుకున్నట్లుగా ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఫొటోలో మహానందకుమారి కూడా ఉన్నారు. గోపి-సునీత వివాహానికి హాజరైన మహానందకుమారి ఇపుడేమో గోపి-సునీతకు వివాహమే కాలేదని ఎందుకు చెబుతున్నారో అర్ధంకావటంలేదు.
ఇక ఎంఆర్వో విచారణకు హాజరైన తర్వాత సునీత తరపు లాయర్ లలితారెడ్డి మాట్లాడుతు ఎంఆర్వో ఇచ్చిన ఫ్యామిలి సర్టిఫికేట్ ప్రకారం గోపీకి భార్య సునీత, ముగ్గురు పిల్లలున్నారని నిర్ధారణ అయ్యిందన్నారు. ఇదేసమయంలో కొడుకని క్లైం చేసుకుంటున్న ప్రద్యుమ్న బర్త్ సర్టిఫికేట్ లో ఇంటిపేరు మాగంటికి బదులు కోసరాజు అని ఎందుకు ఉందని నిలదీస్తున్నారు. ప్రద్యుమ్న మాగంటి గోపీనాధ్ కొడుకే అయితే ప్రద్యుమ్నకు ఇంటిపేరు మాగంటి అనికాకుండ కోసరాజు అని ఎందుకు ఉందన్న ప్రశ్నకు సమాధానం వినబడటంలేదు. అసలు ఈ కోసరాజు ఎవరో చెప్పాలని కూడా లాయర్ డిమాండ్ చేశారు.
కేటీఆర్ మీద మహానంద ఆరోపణలు
తనకొడుకు గోపి ఆసుపత్రిలో ఉన్న విషయం కూడా తనకు సునీత, పిల్లలు ఎవరూ చెప్పలేదన్నారు. ఆసుపత్రిలోని తెలిసినవాళ్ళు చెబితేనే తనకు తెలిసిందన్నారు. కొడుకును చూడటానికి తాను ఆసుపత్రికి వెళితే తనను లోపలకు అనుమతించలేదని ఆరోపించారు. తనతో పాటు తమ కుటుంబసభ్యులను ఆసుపత్రిలోకి అనుమతించవద్దని సునీత ఆసుపత్రి యాజమాన్యానికి రాసిన లేఖ కారణంగానే తమను అనుమతించలేదని మండిపడ్డారు. లండన్ నుండి కేటీఆర్ వచ్చేంతవరకు గోపి మరణాన్ని ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని కేటీఆర్ ను గోపి తల్లి ప్రశ్నించారు. ఆసుపత్రిలో గోపీని చూడటానికి లోపలకు అనుమతించటంలేదన్న విషయాన్ని తాను కేటీఆర్ కు కూడా చెప్పినట్లు తల్లి చెప్పారు. తాను మాట్లాడుతానని చెప్పిన కేటీఆర్ తనను తప్పించుకుని ఆసుపత్రి వెనుక గేటు నుండి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. మహానందకుమారి ఆరోపణల కారణంగా కేటీఆర్ కూడా ఈ వివాదంలో ఇరుక్కున్నారు. ఆసుపత్రిలోకి గోపీ తల్లితో పాటు మరో నలుగురిని అనుమతించవద్దని సునీత రాసినట్లు చెబుతున్న లేఖ కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది.
సునీత కుటుంబంలోని రచ్చ ఎప్పుడైతే రోడ్డునపడిందో సహజంగానే కాంగ్రెస్, బీజేపీ అడ్వాంటేజ్ తీసుకున్నాయి. ఇందులో భాగంగానే సునీత, కేటీఆర్ పై మహానందకుమారి చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మాట్లాడుతు గోపీమరణంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. గోపీనాధ్ తల్లి, భార్య, కొడుకుల స్టేట్ మెంట్లు రికార్డు చేసి డెత్ మిస్టరీపై విచారణ చేయించాలన్నారు.
సునీత గెలిస్తే ఏమవుతుంది ?
ఇపుడీ వివాదం మొత్తంలో గమనించాల్సింది ఏమిటంటే మాగంటిసునీత గెలిస్తే పెద్ద సమస్య అవుతుంది. ఎలాగంటే గోపి భార్యగా చూపించిన ఫ్యామిలీ సర్టిఫికేట్ వరకు ఓకేనే. అయితే మొదటిభార్య మాలినీదేవికి విడాకులు ఇవ్వకుండానే గోపి సునీతను వివాహం చేసుకుని ఉంటే అది తప్పవుతుంది. మొదటిభార్య జీవించిఉండగా విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకోవటం చట్టరీత్యా తప్పు. చట్టరీత్యా రెండో వివాహాన్ని కోర్టు అంగీకరించదు. అయితే రెండో వివాహం ద్వారా పుట్టిన సంతానం మాత్రం గోపీకి చట్టబద్ద వారసులే.
మాలినీదేవికి విడాకులు ఇవ్వకుండానే సునీతను గోపి రెండో వివాహం చేసుకుని ఉంటే ఎంఆర్వో ఇచ్చిన ఫ్యామిలి సర్టిఫికేట్ చెల్లదు. ఫ్యామిలి సర్టిఫికేట్ చెల్లుబాటుపై మాలినీదేవి లేదా ఆమె కొడుకు కోర్టులో కేసు వేస్తే అప్పుడు సునీతకు ఇబ్బందులు తప్పవు. ఈ వివాదాన్ని విచారించి గోపి భార్యగా సునీత సమర్పించిన ఫ్యామిలీ సర్టిఫికేట్ చెల్లదని తీర్పుచెబితే ఎంఎల్ఏ ఎన్నికను కూడా రద్దు చేయాల్సుంటుంది. గోపీ భార్యగా తప్పుడు ఫ్యామిలి సర్టిఫికేట్ పెట్టిందన్న కారణంతో ఎంఎల్ఏ ఎన్నికను కోర్టు రద్దుచేయచ్చు. ఎంఎల్ఏ ఎన్నికను కోర్టు రద్దుచేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక రద్దును ప్రకటించి మళ్ళీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీచేయాల్సుంటుంది. ఒకవేళ ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నీవన్ యాదవ్ లేదా బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి గెలిస్తే ఏ సమస్యా ఉండదు పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చిందన్న సామెతలాగ అయిపోతుంది సునీత వివాదం.

