ఇంతకీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాల ఖాళీలున్నాయ్, ఎవరూ చెప్పరేం!
x

ఇంతకీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాల ఖాళీలున్నాయ్, ఎవరూ చెప్పరేం!

సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ఎలక్షన్ హామీ సాధ్యమేనా? అసలు తెలంగాణలో ఉన్న ఖాళీలు 30 వేలు అంటున్నారు. మరీ 2 లక్షల ఉద్యోగాలు ఎలా ?


ఇంతవరకు ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలున్నాయో ఒక్క సారి కూడా అధికారికంగా సంఖ్య బయటకు రాలేదు.

ఇంతకు ముందు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చామో చెబుతూ వచ్చింది తప్ప, నీళ్లు నిధుల నియామాకాల స్లోగన్ తో బతుకున్న నిరుద్యోగులకు భోరసా ఇచ్చే ఫిగర్ చెప్పలేదు.

కొత్త ప్రభుత్వం కొత్త ఆశలు రేపింది తప్ప, ఇది గో ఇవీ ఖాళీలు అన్ని చెప్పడం లేదు.

ఇంతకీ ప్రభుత్వం ఎన్ని కొల్వులు ఖాళీగా ఉన్నాయనేది అంత బ్రహ్మ రహస్యమా?


‘అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’అని కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హమీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో 25 వేల నుంచి 30 వేల మించి వేకెన్సీలు ఉండవని తాజాగా వివిధ డిపార్ట్ మెంట్ల నుంచి వెలువడిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.

మరీ ఒకే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు ఎలా భర్తీ చేస్తుంది.. ఏ మార్గం అవలంభిస్తారు? ప్రభుత్వ ఉద్యోగాలలో నిజంగా ఖాళీలు లేవా? ఉంటే ఎన్ని ఉన్నాయి?

ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో చూద్దాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో నాలుగున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమతి ఉంది. అందులో గత సంవత్సరం ప్రారంభం నాటి లెక్కల ప్రకారం మూడున్నర లక్షలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అవి పోగా మిగిలిన ఉద్యోగాలలో కేసీఆర్ ప్రభుత్వం దాదాపు వివిధ రకాల నోటిఫికేషన్లు ద్వారా దాదాపు 80 వేల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించినట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది.

ఉద్యోగ ఖాళీల సంఖ్య పెరగాల్సి ఉండేది..కానీ

నిజానికి తెలంగాణలో ఉద్యోగ ఖాళీల సంఖ్య మరో 20 నుంచి 30 వేల వరకు పెరిగేది. కానీ అప్పటీ బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పొడిగించింది. దేశంలోని జీవన ప్రమాణాలు పెరగడంతో ఆయు: ప్రమాణం పెరిగిందనే కారణంతో అదనంగా మూడు సంవత్సరాల సర్వీస్ పొడిగించింది. దీంతో చాలా వరకూ ఖాళీలు ఏర్పడకుండా పోయాయి.

ప్రస్తుత సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలవుతాయి. దీనివల్ల వచ్చే నాలుగైదు సంవత్సరాలలో దాదాపు 20 వేల వరకూ అదనంగా ఖాళీలు ఏర్పాడే అవకాశం మాత్రమే ఉంది. అయితే ఇవన్నీ కలుపుకున్న కూడా 2 లక్షల ఖాళీలు ఏర్పడే అవకాశం లేదు.మరి రెండులక్షల ఉద్యోగాలను ఎలా సృష్టిస్తారు, భర్తీ చేస్తారు. ఇదీ ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాల్.

అయితే ఇదే అంశంపై టీటీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఏరుకొండ నరసింహస్వామి ఫెడరల్ తో మాట్లాడుతూ "కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ప్రభుత్వ ఉద్యోగుల అవసరం పెరిగింది. కొత్త జిల్లాలు కేవలం 30 శాతం ఉద్యోగ సామర్థ్యంతోనే పనులను నెట్టుకొస్తున్నాయి. ఇక్కడ మనకు కొత్త ఉద్యోగాల కల్పన అవసరం. ఇవే కాకుండా వివిధ కార్పొరేషన్లలో ఖాళీలను కలుపుకుంటే చాలా సులువుగా రెండు లక్షల ఖాళీలు కనిపిస్తాయి. ఒక్క విద్యాశాఖలోనే మరో 25 వేలు ఖాళీలు ఉంటాయని ఒక అంచనా. విద్యాశాఖలో అన్ని ఖాళీలను కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం ఉద్యోగ భర్తీలను ప్రారంభిస్తే ఒక సంవత్సరంలోనే వాటిని పూర్తి చేయవచ్చు " అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల సంఖ్యపై పూర్తి గందరగోళం నెలకొందని, కొంతమంది ఉద్యోగ నిఫుణులు చెబుతున్నారు. అంతకుముందున్న ప్రభుత్వాలు( కాంగ్రెస్, బీఆర్ఎస్), ప్రభుత్వ హయాంలో నడిచే కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు ఇతర సంస్థలలో ఉన్న ఉద్యోగాలను కలపడం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన సాధ్యం కాలేదని వారంటున్నారు. "కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలను, ఇతర కార్పొరేషన్ల ఉద్యోగాలను కలుపుకున్నా కూడా రెండు లక్షల ఖాళీలు లేవు" మరొక నిఫుణుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

2021 నాటి సీఆర్ బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం ఉద్యో గ సామర్థ్యంలో కేవలం 61 శాతం మాత్రమే ఉందని నివేదిక ఇచ్చింది. అయితే ఇందులో కొన్ని పోస్టులు ఔట్ సోర్సింగ్, మరికొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు కలిపి ఉన్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.

మరికొన్ని పోస్టులు కాలక్రమేణా తొలగించాల్సివి ఉన్నాయి. ఉదాహరణకు టెలిఫోన్ ఆపరేటర్, వ్యవసాయ శాఖలో సినిమా డెరెక్టర్, ప్రొడ్యూసర్ వంటివి కూడా ఉద్యోగంగా ఉండేవి. ప్రజలను చైతన్యం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో వాటిని ప్రదర్శించి, అవగాహన కల్పించడానికి కూడా ఉద్యోగాల కల్పనగా అప్పట్లో అవి ఉండేవి. వాటిని భర్తీ చేయట్లేదు. కానీ అవి ఖాళీగా ఉన్నట్లు చూపుతుంటాయి. అలాంటి వాటిని కాకుండా మిగిలిన ఖాళీలు ఎన్నో తేల్చి వాటినే భర్తీ చేశారని ప్రభుత్వ వర్గాల వాదన.

మన దాంట్లో ఆంధ్ర ఉద్యోగులు ఏందీ: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో భవిష్యత్ లో రెండు లక్షల ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని, కానీ వాటిని ఆంధ్ర వారితో నింపే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్లని డెరెక్టర్లుగా నియమించారని, ఇప్పుడు ఆ ఎఫెక్ట్ తెలంగాణలో కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభించారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీకి ఆంధ్ర సలహదారుడు దేనికి అని ప్రశ్నించారు.

సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభించింది కేసీఆర్ సర్కార్ కాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి తనే ఆ పని చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని తూర్పారబట్టారు. సింగరేణి జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన వాటిని సీఎం ఇవ్వడం ఏంటన్నారు.

టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినను తొలగించి జ్యూడీషియల్ విచారణ చేయాలని హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ " ప్రభుత్వం ఏమి ఖాళీలను భర్తీ చేయాలని అనుకుంటుందో వాటిని నోటిఫై చేయండి. మీరు హామీ ఇచ్చినట్లు సంవత్సరంలోపు ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి" అని తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. అయితే పేపర్ లీక్ వల్ల యువత ఆగ్రహం వ్యక్తం చేశారని నిరుద్యోగ జేఏసీ నాయకుడు తిరుపతి ఫెడరల్ తో చెప్పారు. "ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ఒక్కటే 60 వేల ఖాళీలను నోటిఫికేషన్లు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేసి కొత్తగా మరికొన్ని పోస్టులతో రీ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే పోలీసు రిక్రూట్ మెంట్ ఉద్యోగాలు ప్రారంభం అయ్యాయి. వైద్య శాఖలో మరో 20 వేల ఖాళీలకు, మరో శాఖలో ఇంకో 20 వేల భర్తీ ప్రక్రియకు నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం ఖాతాలోనే అవి కూడా వస్తాయి. ఇవన్నీ కలిపితే సులువుగా ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హమీ నెరవేరుతుంది" అని ఆయన ఫెడరల్ తో అన్నారు.


Read More
Next Story