కవితకు జాగృతి కూడా షాకిస్తోందా ?
x
Kalvakuntla Kavitha

కవితకు జాగృతి కూడా షాకిస్తోందా ?

కవిత వ్యవహారశైలిని తప్పుపడుతు కొందరు నేతలు బాహటంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.


అదేదో సినిమాలో పాటలాగ అయిపోతున్నట్లుంది కల్వకుంట్ల పరిస్ధితి. బీఆర్ఎస్(BRS) కవితను బయటకు గెంటేసిన విషయం తెలిసిందే. పార్టీ పోతేపోయింది నమ్ముకున్న జాగృతి(Telangana Jagruthi) ఉందికదా అనుకుంటే ఇక్కడా అసమ్మతి స్వరాలు, తిరుగుబాట్లు మొదలైపోయాయి. జాగృతి సంస్ధలోని కొందరు కీలక నేతలు కవిత(Kavitha)ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ లోని కేటీఆర్(KTR), హరీష్(Harish Rao), సంతోష్ విషయంలో కవిత వ్యవహారశైలిని తప్పుపడుతు కొందరు నేతలు బాహటంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. క్షేత్రస్ధాయిలోని పరిణామాలను గమనిస్తుంటే జాగృతి నేతలనుండి కవితకు అందబోయే మద్దతు అంతంతమాత్రమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తెలంగాణ జాగృతి అసలైన నేతలం తామే అంటు కొందరు కీలకనేతలు మీడియాలో చెబుతున్నారు. జాగృతిలో కవిత యక్టివ్ గా పనిచేయకముందు నుండే తాము సంస్ధ బలోపేతానికి చేసిన కృషిని వివరించారు. జాగృతి వ్యవస్ధాపక అధ్యక్షుడు రాజీవ్ సాగర్ మాట్లాడుతు ‘‘బీఆర్ఎస్(టీఆర్ఎస్)కు అనుబంధంగా జాగృతి బలోపేతానికి కృషిచేసింది తామే’’ అన్నారు. ‘‘తనతో పాటు బిక్షపతి, రాజారాం తదితరులు ఎంతోమంది కష్టపడితేనే జగృతి సంస్ధ ఈరోజు ఈ స్ధాయిలో ఉంద’’న్నారు. 2006 నుండి కేసీఆర్ స్పూర్తితోనే తాము జాగృతిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ‘‘సంస్ధలో కవిత యాక్టివ్ అయిన దగ్గరనుండి ఆమె నాయకత్వంలో తాము పనిచేసిన మాట వాస్తవమే’’ అన్నారు. అంతమాత్రాన జాగృతిని కవితే ఏర్పాటుచేసినట్లు కాదన్నారు. ‘‘కవిత యాక్టవ్ కాకముందు నుండే తాము జాగృతిలో పనిచేస్తున్నామని, కేసీఆర్ కూతురు కాబట్టి కవితకు ప్రాధాన్యత దక్కిందంతే’’ అని రాజీవ్ చెప్పారు.

గడచిన కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు కవిత పాల్పడుతున్నది గమనించినట్లు చెప్పారు. ‘‘ఆమె ఎవరి ఆశయంకోసం పనిచేస్తున్నారో తమకు అర్ధంకావటంలేద’’న్నారు. ‘‘బీఆర్ఎస్ తో కవితకు బంధం తెగిపోయిన నేపధ్యంలో తామంతా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయబోతున్న’’ట్లు పై నేతలు స్పష్టంచేశారు. ‘‘కవితది తెలంగాణ జాగృతి కాదని కాంగ్రెస్ జాగృత’’ని ఎద్దేవాచేశారు. ‘‘కవిత నాయకత్వంలోని జాగృతి కోసం తాము పనిచేసేదిలేద’’ని కూడా ప్రకటించారు.

పై నేతల ప్రకటనలు, వైఖరి గమనించిన తర్వాత జాగృతిలో కూడా పెద్ద చీలక వచ్చినట్లు అర్ధమవుతోంది. జిల్లాల వారీగా జాగృతిలోని నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. తాము కవిత వెంబడి నడవాలా ? లేకపతే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నట్లు అర్ధమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా జాగృతిలో అత్యంత కీలకంగా ఉన్న అధ్యక్షుడు దాస్యం విజయభాస్కర్ బీఆర్ఎస్ నాయకత్వానికి జై కొట్టినట్లు తెలుస్తోంది. తొందరలోనే ప్రతిజిల్లాలోను నేతలు సమవేశమై తాము ఎవరివైపు నిలవాలన్న విషయాన్ని తేల్చుకోబోతున్నారు. జరుగుతున్నది చూస్తుంటే జాగృతి కూడా కవితకు పూర్తిగా మద్దతుగా నిలబడేట్లు కనబడటంలేదు.

Read More
Next Story