కేటీఆర్ కన్నా కవితే నయమా ?
x
Kavitha and KTR

కేటీఆర్ కన్నా కవితే నయమా ?

పార్టీలకు అతీతంగా ఎంపీలు ఆలోచించి ఓట్లేసి గెలిపిస్తే బాగుంటుందని కవిత ఆకాంక్షించారు.


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గుడ్డి వ్యతిరేకత, అక్కసు తప్ప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లో(KTR) ఇంకేమీ కనపించటంలేదు. తాజా డెవలప్మెంట్ ను గమనిస్తే కేటీఆర్ కన్నా కల్వకుంట్ల కవిత(Kavitha)లోనే మంచి క్లారిటి ఉన్నట్లు అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక(Vice President Election)ను తీసుకుందాం. జాగృతి(Jagruthi) సమావేశంలో కవిత మాట్లాడుతు ఏమన్నారంటే తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శనరెడ్డి(Justice Sudharsan Reddy) గెలవాలని కోరుకున్నారు. గతంలో జస్టిస్ ఇచ్చిన తీర్పులు, వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలను గమనిస్తే ఆయన వ్యక్తిత్వం అర్ధమవుతుందన్నారు. సుదర్శనరెడ్డి లాంటి వ్యక్తి ఉపరాష్ట్రపతి(Vice President)గా ఎన్నికైతే ఆ పదవికే వన్నె తెచ్చినట్లుగా ఉంటుందని తన అభిప్రాయాన్ని చెప్పారు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఎంపీలు ఆలోచించి ఓట్లేసి గెలిపిస్తే బాగుంటుందని కవిత ఆకాంక్షించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సుదర్శనరెడ్డి సీఎం క్యాండిడేట్ గానో లేకపోతే కాంగ్రెస్ అభ్యర్ధిగానో పోటీచేయటంలేదు. రేవంత్ ప్రతిపాదించిన, కాంగ్రెస్ మద్దతిచ్చిన ఇండియా కూటమి అభ్యర్ధిగా పోటీ చేశారు. ఇపుడు జాతీయస్ధాయిలో ఉంటే బీజేపీ నాయకత్వంలోని కూటమిలో లేకపోతే కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలో ఉండాలి. రెండు కూటముల్లో లేని పార్టీలకు మనుగడ కష్టమనే చెప్పాలి. ఎందుకంటే జాతీయ రాజకీయాలు బీజేపీ వ్యతిరేక లేదా బీజేపీ మద్దతుగా తయారైపోయాయి కాబట్టి. అనుకూల పార్టీలు ఎలాగూ ఎన్డీయే కూటమిలోనే లేదా మద్దతుగా ఉన్నాయి. ఇక మిగిలింది బీజేపీ వ్యతిరేక పార్టీలే. చాలాపార్టీలు ఇండియా కూటమిలోనే ఉన్నా తటస్ధంగాఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆప్ లాంటి మరికొన్ని ప్రాంతీయపార్టీలు అంశాల వారీగా ఇండియా కూటమికి మద్దతు ప్రకటిస్తున్నాయి. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తృణమూల్, ఆప్ కూడా మద్దతుగా నిలబడ్డాయి.

ఇక బీఆర్ఎస్ విషయంచూస్తే కేసీఆర్ లేదా కేటీఆర్ లో స్పష్టమైన అయోమయం కనబడుతోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్ధి సుదర్శనరెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వటంలేదనే విషయంలో కేటీఆర్ ఇప్పటికి మూడుకారణాలు చెప్పటమే విచిత్రంగా ఉంది. మొదట్లో మాట్లాడుతు రేవంత్ లాంటి చిల్లరమనిషి ప్రతిపాదించిన జస్టిస్ సుదర్శనరెడ్డికి తాము మద్దతిచ్చే ప్రశ్నేలేదన్నారు. సుదర్శనరెడ్డి రాజకీయ నేతకాదు. జస్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీచేస్తున్నారంతే. ఎన్డీయే వ్యతిరేక కూటమి అభ్యర్దిగా జస్టిస్ సుదర్శనరెడ్డి మంచి ఎంపికనే చెప్పాలి. మెరిట్ ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కూడా మద్దతు తెలపాల్సిన వ్యక్తే అనటంలో సందేహంలేదు. కారణం ఏమిటంటే సుదర్శనరెడ్డి సుప్రింకోర్టు జస్టిస్ గా పనిచేశారు. ఎన్డీయే వ్యతిరేక కూటమి తరపున పోటీచేస్తున్నారు. అలాగే తెలంగాణ వ్యక్తి. అయితే రేవంత్ ప్రతిపాదించాడు కాబట్టి సుదర్శనరెడ్డిని వ్యతిరేకించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు కేటీఆర్ మాట్లాడారు.

ఇక ఈమధ్య కేటీఆర్ మాట్లాడుతు తెలంగాణకు 2 లక్షల టన్నుల యూరియా ఎవరు సరఫరా చేస్తే వాళ్ళకే మద్దతు అని ప్రకటించారు. బీజేపీ గనుక యూరియా సరఫరా చేస్తే సీపీ రాధాకృష్ణన్ కు లేదా కాంగ్రెస్ సరఫరాచేస్తే జస్టిస్ సుదర్శనరెడ్డికి మద్దతు అనటంలోనే డొల్లతనం అర్ధమవుతోంది. ఎందుకంటే యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రప్రభుత్వం అన్న విషయం కేటీఆర్ కు బాగా తెలుసు. ఒకవేళ నిజంగానే కేంద్రప్రభుత్వం యూరియా సరఫరా చేసుంటే ఎన్డీయే అభ్యర్ధికి కేటీఆర్ మద్దతిచ్చేవారేనా ? పోనీ కాంగ్రెస్ ప్రభుత్వమే సరఫరా చేసుంటే రేవంత్ ప్రతిపాదించిన వ్యక్తి అన్న విషయాన్ని మరచిపోయి జస్టిస్ కు మద్దతుగా ఓట్లేసేవారా ?

తాజాగా ఏమన్నారంటే కాంగ్రెస్ అహంకారపు వైఖరి తనను జాతీయ స్ధాయిలో విఫల పార్టీగా మార్చిందన్నారు. తాము బీజేపీకి గాని, కాంగ్రెస్ కు కాని బీ టీమ్ కాదట. తెలంగాణ ప్రజలకు ఏ టీమ్ అని చెప్పుకున్నారు. దేశ రాజకీయాలను కేవలం రెండు పార్టీల మధ్య జరిగే పోరాటంగా చూడటం తప్పట. ప్రాంతీయ పార్టీలకూ స్వతంత్ర స్ధానం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఏ టీమ్ అని చెప్పుకున్నదే నిజమైతే తెలంగాణ వ్యక్తి సుదర్శనరెడ్డికి మద్దతు ఇవ్వాలి కదా ? ఎందుకు ఇవ్వలేదు ? ప్రాంతీయ పార్టీలకు స్వతంత్రస్ధానముంది అని చెప్పుకున్న కేటీఆర్ అందులో బీఆర్ఎస్ స్ధానం ఏమిటో చెప్పగలరా ? జస్టిస్ సుదర్శనరెడ్డికి మద్దతు విషయంలో కేటీఆర్ మూడురకాల ప్రకటనలు ఇవ్వటంలోనే అయోమయం కనబడుతోంది. ఈ విషయంలో కల్వకుంట్ల కవితే నయమని అన్నది ఇందుకనే.

Read More
Next Story