
కవిత షాకులో ఉన్నారా ?
మీడియా సమావేశంలో ఎంఎల్సీ ఫలితాలపై అర్ధంపర్ధంలేని కామెంట్లు, ఆరోపణలు, విమర్శలు చేశారు
పాపం కల్వకుంట్లవారి గారాలబిడ్డ కల్వకుంట్ల కవితకు పెద్ద షాకే తగిలినట్లుంది. మీడియా సమావేశంలో ఎంఎల్సీ ఫలితాలపై అర్ధంపర్ధంలేని కామెంట్లు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆమె మాట్లాడిన తీరుతోనే ఆమెకు పెద్ద షాక్ తగిలినట్లు అనుమానంగా ఉంది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే తాజా ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి కాని ప్రజాస్వామ్యం ఓడిపోయిందట. బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందట. ప్రతి అంశంలోను బీసీలను అణిచేస్తున్నారట. ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా బీసీలకు అన్యాయమే జరిగిందట. తాజా ఎన్నికల్లో ఒక్క బీసీ అభ్యర్ధి కూడా లేకపోవటమే నిదర్శనమట. బీజేపీ(BJP), కాంగ్రెస్)Congress) రెండూ బీసీలకు పోటీచేసే అవకాశం ఇవ్వలేదట. రెండు పార్టీలూ బీసీయేతర అభ్యర్ధులనే పోటీలోకి దింపినట్లు మండిపడ్డారు. బీసీలకు న్యాయం జరగాలంటే చట్టసభల్లో కూడా బీసీ రిజర్వేషన్ ఉండాల్సిందే అని కవిత(Kavitha) డిమాండ్ చేశారు.
కవిత షాకులో ఉన్నారన్నది ఎందుకంటే పార్టీలు గెలవటం ఏమిటి ? ప్రజాస్వామ్యం(Democracy) ఓడిపోవటం ఏమిటో ఆమెకే తెలియాలి. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలుజరిగి, లక్షలాదిమంది ఓటర్లు బారులుతీరి ఓట్లేసిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోవటం ఏమిటి ? ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు జరగటం కదా. ఇక బీసీలకు అడుగడుగునా అన్యాయం జరగటం ఏమిటో, అణిచివేయటం ఏమిటో ఆమే చెప్పాలి. తాజా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలేదని అనటమే ఆశ్చర్యంగా ఉంది. బీజేపీ తరపున మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీచేసి గెలిచిన మల్క కొమురయ్య బీసీ అన్న విషయం కవితకు తెలీదా ?
కాంగ్రెస్ పోటీచేసిన ఏకైక మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో నరేంద్రరెడ్డిని పోటీలోకి దింపింది. ఎన్నికల్లో పోటీ అన్నాక గెలుపోటములే కీలకం అవుతాయి కాని సామాజికవర్గాలను చూడరు. ఏ సామాజికవర్గమైనా సరే అభ్యర్ధి గెలుస్తాడా లేదా అన్నదే ఇంపార్టెంట్. పోటీలో ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్ధులున్నపుడు బీసీ అభ్యర్ధికి మద్దతుగా బీసీలంతా ఏకం కావాలని కవిత ఇపుడు పిలుపు ఇవ్వటమే విచిత్రం. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున నరేంద్రరెడ్డి, బీజేపీ తరపున అంజిరెడ్డి పోటీచేస్తే బీఎస్పీ అభ్యర్ధిగా బీసీనేత ప్రసన్న హరికృష్ణ పోటీచేశారు. బీసీ వాదనతో గెలవాలని ప్రసన్న ప్రయత్నించినా ఓటమితప్పలేదు. పోలింగుకు ముందు ప్రసన్నకు ఓట్లేసి రెడ్డి అభ్యర్ధులను ఓడించమని కవిత ఎందుకు చెప్పలేదు ? పోలింగ్ అయిపోయి, ఫలితాలు వచ్చేసిన తర్వాత బీసీ అభ్యర్ధికి మద్దతుగా బీసీలంతా ఏకంకావాలని ఇపుడు చెప్పటమే కవిత మానసిక పరిస్ధితిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోటీకి బీఆర్ఎస్(BRS) ఎందుకుదూరంగా ఉండిపోయింది ? పోటీచేసి మూడుసీట్లలోను బీసీనేతలకే టికెట్లు ఇచ్చుండచ్చుకదా ? ఎవరొద్దన్నారు ? ఎన్నికలైపోయి, ఫలితాలు వెల్లడైపోయిన తర్వాత ఇపుడు గోలచేయటంలో అర్ధమేంటి ?
అధికారంలో ఉన్న పదేళ్ళల్లో ఎప్పుడూ కవిత బీసీ(BC Slogan)లకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని అడగలేదు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయలేదు. అసెంబ్లీలో జ్యోతీరావు పూలే విగ్రహం పెట్టాలని ఏనాడు పదేళ్ళల్లో కవిత ఎప్పుడూ కోరలేదు. అధికారంలో ఉన్నంతకాలం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ గుర్తుకే రాలేదు. మహిళలకు 33 శాతం(Women reservations) టికెట్లు ఇవ్వకపోయినా, జ్యోతిరావు పూలే(Jyoti Rao Pule) విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టకపోయినా, మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకపోయినా, టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగినా ఏనాడు తనతండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ను నిలదీయాలని కవితకు పదేళ్ళల్లో ఎప్పుడూ అనిపించలేదు. ప్రతిపక్షంలోకి రాగానే పైఅంశాలపై ఎన్డీయే, కాంగ్రెస్ ప్రభుత్వాలను పదేపదే కవిత డిమాండ్లు చేస్తుండటమే విడ్డూరంగా ఉంది.