
అవినీతి జరిగింది కాని...
ముఖ్యమంత్రికి తెలీకుండా, సంబంధంలేకుండా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ ఒక్కడే అవినీతికి పాల్పడ్డాడని చెబితే నమ్మేట్లుగా ఉందా ?
కారుపార్టీ నేతలను కేసుల్లో గట్టిగా ఇరికించేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత(Kavitha) కావాల్సిన అస్త్రాలను అందిస్తున్నట్లున్నారు. కాళేశ్వరం(Kaleshwaram Scam), టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కేసుల్లో కవిత చేసిన ఆరోపణలు దర్యాప్తుసంస్ధలకు బాగా ఉపయోగపడేట్లుగానే ఉన్నాయి. బీఆర్ఎస్(BRS) నుండి సస్పెండ్ అయిన కవిత మీడియాతో మాట్లాడుతు కాళేశ్వరంలో భారీఎత్తున అవినీతి జరిగిందని అంగీకరించారు. అయితే జరిగిన అవినీతిలో కేసీఆర్(KCR) కు సంబంధంలేదని, చేసిందంతా హరీష్ రావు(Harish Rao), సంతోష్ రావే అని అన్నారు. అవినీతి జరిగింది కాని ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి కేసీఆర్ కు సంబంధంలేదని చెప్పటమే కవిత ఉద్దేశ్యం. ముఖ్యమంత్రికి తెలీకుండా, సంబంధంలేకుండా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ ఒక్కడే అవినీతికి పాల్పడ్డాడని చెబితే నమ్మేట్లుగా ఉందా ? హరీష్ తో పాటు సంతోష్ మీద కూడా కవిత చాలా ఆరోపణలే చేశారు.
ఇక టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా హరీష్, సంతోష్, శ్రవణ్ రావులపై కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ట్యాపింగ్ లో కూడా కేసీఆర్, కేటీఆర్ కు ఏమీ తెలీదట. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలాది ఫోన్టను ట్యాపింగ్ చేసింది హరీష్, సంతోష్, శ్రవణ్ మాత్రమే అని ఆరోపించారు. కవిత ఆరోపణలు వినటానికే విచిత్రంగా ఉన్నాయి. తమ హయాంలో అవినీతి జరిగిందట. అయితే జరిగిన అవినీతిలో కేసీఆర్, కేటీఆర్ కు మాత్రం ఎలాంటి సంబంధంలేదట. కవిత మాటలు నమ్మేట్లుగా లేకపోయినా చేసిన ఆరోపణల ప్రకారం అవినీతిలో హరీష్, సంతోష్ కీలక పాత్రపోషించినట్లు అర్ధమవుతోంది. మరి తన ఆరోపణలకు తగిన ఆధారాలు కవిత దగ్గర ఉన్నాయా అన్నదే అనుమానం.
ఏదేమైనా కవిత ఆరోపణల ఆధారంగా దర్యాప్తు సంస్ధలు హరీష్, సంతోష్ తో పాటు కవితకు కూడా నోటీసులు జారీచేసి విచారిస్తే అవినీతి బయటపడే అవకాశాలున్నాయని జనాలు అనుకుంటున్నారు. కవితను ముందుగా విచారిస్తే హరీష్, సంతోష్ అవినీతికి తన దగ్గరున్న ఆధారాలు దొరుకుతాయని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఆధారాలను దగ్గర పెట్టుకుని హరీష్, సంతోష్ ను విచారిస్తే మొత్తం వ్యవహారాలన్నీ బయటకు తన్నుకుంటూ వచ్చేస్తాయని సోషల్ మీడియాలో పోస్టులు కనబడుతున్నాయి. మరి ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాల్సిందే.