బీఆర్ఎస్ లో కవిత పరిస్ధితి ఇంత దారుణంగా తయారైందా ?
x
BRS working President KTR and Kavitha

బీఆర్ఎస్ లో కవిత పరిస్ధితి ఇంత దారుణంగా తయారైందా ?

పార్టీ అధినేత కూతురే కాని పార్టీలో నేతలెవరూ ఆమెను కనీసం లెక్కచేయటంలేదు


కల్వకుంట్ల కవిత పరిస్ధితి బీఆర్ఎస్ లో చాలా దారుణంగా తయారైంది. అవటానికి పార్టీ అధినేత కూతురే కాని పార్టీలో నేతలెవరూ ఆమెను కనీసం లెక్కచేయటంలేదు. తాజాగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాజీమంత్రి గుంటకళ్ళ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. యాంకర్ మాట్లాడుతు ‘బీఆర్ఎస్(BRS)లో కవిత(Kavitha) సునామీ సృష్టించబోతున్నారా’ ? అని అడిగారు. దానికి జగదీష్ రెడ్డి సమాధానమిస్తు స్టూడియో పై భాగాన్ని చూపిస్తు స్టూడియోలో సునా(Tsunami)మీ వస్తుందా ? స్టూడియోలో వర్షంపడుతుందా అని ఎదురుప్రశ్నించారు. బయట ఎంతవర్షంపడినా స్టూడియోలో అయితే వర్షంపడదు కదా. బయట ఎంత వర్షంపడితే ఏమవుతుంది స్టూడియోలో పడనపుడు ? అన్న అర్ధం వచ్చేట్లుగా జగదీష్ ఎద్దేవాచేశారు.

అంటే జగదీష్ మాటలకు అర్ధంఏమిటంటే పార్టీలో కవిత సృష్టించబోయే సునామీ ఏమీ ఉండదని, అసలు కవిత ప్రభావమే పార్టీపై పడదన్నారు. పార్టీలో కవిత ఉన్నా ఒకటే బయటకు వెళ్ళిపోయినా ఒకటే అన్న అర్ధం వచ్చేట్లుగా మాట్లాడారు. ఈవ్యాఖ్యలతోనే కవిత పరిస్ధితి ఎంత దారుణంగా తయారైందో అర్ధమైపోతోంది. అదినేత కూతురు అన్న భయంకూడా లేకుండా గుంటకళ్ళ కవితను అంతలా ఎద్దేవా చేశారంటే ఆమె పరిస్ధితి ఎలా తయారైందో అర్ధమైపోతోంది. కవిత పరిస్దితి ఇలాగ అయిపోవటానికి కారణం ఏమిటి ?

ఏమిటంటే మొదటిపాయింట్ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని తీహార్ జైలులో ఆరుమాసాలుండటమే. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలుకు పోవటంతోనే నేతల్లో ఆమెపై చులకనభావం వచ్చేసింది. కేసులో(జైలు)నుండి కూతురును బయటకు తీసుకురావటానికే అధినేత కేసీఆర్ బీజేపీ అగ్రనేతలతో చీకటి ఒప్పందం చేసుకున్నారన్న కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆరోపణలకు అవకాశం ఏర్పడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళ ఆరోపణలను జనాలు కూడా నమ్మినట్లే అనిపించింది. అప్పటినుండి తమపై వస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ అగ్రనేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నది వాస్తవం.

ఇక రెండోపాయింట్ ఏమిటంటే అన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పంచాయితీ పెట్టుకోవటమే. పార్టీపై ఆధిపత్యం కోసం కేటీఆర్ తో గొడవపెట్టుకున్నారు. తండ్రికి రాసిన లేఖ లీక్ అవటంతో పార్టీలో పెద్ద కలకలంరేగింది. తర్వాత పరిణామాల్లో కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేదిలేదని కవిత చేసిన ప్రకటన పెద్ద సంచలనమైపోయింది. ఎప్పుడైతే కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేదిలేదని కవిత ప్రకటన చేశారో అప్పటినుండే కూతురును కేసీఆర్ దూరంగా పెట్టేశారు. స్వయంగా అధినేత, కేటీఆర్ దూరంగా పెట్టేశారనే స్పష్టమైన సంకేతాలు నేతలందరికీ చేరిందో అప్పటినుండే కవితకు పార్టీలో విలువ లేకుండాపోయింది.

అందుకనే కవితను కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎంతలా టార్గెట్ చేస్తున్నా బీఆర్ఎస్ నుండి కనీస మద్దతుగా కూడా దొరకటంలేదు. ఆ అక్కసుతోనే ఒకసారి కవిత మాట్లాడుతు తాను జైలులో ఉన్నపుడు బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనంచేసే ప్రయత్నాలు జరిగాయని చెప్పిన మాటలు పార్టీలో బాంబులాగ పేలింది. అప్పటికే రాహుల్, రేవంత్ చేస్తున్న విలీనం ఆరోపణలకు కవిత వ్యాఖ్యలు సాక్ష్యాలుగా మారిపోయింది. కవిత వ్యాఖ్యలను తప్పుపట్టలేక ఇప్పటికీ కేసీఆర్, కేటీఆర్ నానా అవస్తలు పడుతున్నారు. కవిత ఉద్దేశ్యపూర్వకంగానే పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారనే అనుమానంతోనే ఆమె మాటలను పార్టీలో ఎవరూ పట్టించుకోవటంలేదు. ఈ కారణంగానే కవితపై పార్టీ నేతలు ఆరోపణలు, సెటైర్లు మొదలుపెట్టేశారు.

కవిత భవిష్యత్తు ?

ఈనేపధ్యంలోనే కవిత భవిష్యత్తు ఏమిటనే చర్చలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పార్టీ ఎంఎల్సీగా కవిత కంటిన్యు అవుతున్నారు. బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను కేటీఆర్ పీకేశారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ను గౌరవ అధ్యక్షురాలిగా నియమించటంతోనే ఆమెకు పార్టీలో ఎలాంటి విలువలేదని అందరికీ అర్ధమైపోయింది. 2020లో ఎంఎల్సీ అయిన కవిత పదవిని 2026లోపు మధ్యలో పీకలేరు కాబట్టే ఇంకా ఎంఎల్సీగా కంటిన్యు అవుతున్నారని అర్ధమవుతోంది.

ఇపుడు ఆమె పరిస్ధితి ఎలాగ తయారైందంటే బీఆర్ఎస్ లో ఉండలేరు అలాగని ఏ పార్టీలోను చేరలేరు. లిక్కర్ స్కామ్ లో కేసుపెట్టి అరెస్టుచేసి జైలులో ఉండటానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీలో చేరలేరు. కాంగ్రెస్ పార్టీలో చేరలేరు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏపార్టీకి అయినా కవిత పెద్ద భారమనే చెప్పాలి. కారణం ఏమిటంటే కవితను తెలంగాణలో చాలామంది లిక్కర్ క్వీన్ అని ఎద్దేవా చేస్తుంటారు. కాబట్టి ఆమె ఏపార్టీలో ఉన్నా ఆ పార్టీకి భారమే. ఈ కారణంగానే కేసీఆర్, కేటీఆర్ కూడా కవితను బయటకు పొమ్మనకుండా పొగబెడుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్, కేటీఆర్ ను లిక్కర్ స్కామ్ గురించి చేసే ఆరోపణలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు.

జాగృతి మాత్రమే దిక్కా ?

అధికారంలోకి వచ్చినకొత్తలో కవిత ఏర్పాటుచేసిన జాగృతిసంస్ధ మాత్రమే దిక్కుగా కనబడుతోంది. ఆసంస్ధ కేంద్రంగానే కవిత రాజకీయాలు చేయాలి తప్ప వేరేదారిలేదు. పార్టీ తనపై యాక్షన్ తీసుకోవాలని ఆమె కోరుకుంటున్నట్లున్నారు. ఇదేసమయంలో కవిత తనంతట తానుగా పార్టీని వదిలేయాలని పార్టీ అధినేత వెయట్ చేస్తున్నట్లున్నారు. ఈరెండింటిలో ఏది జరిగినా కాంగ్రెస్, బీజేపీ నేతలనుండి విపరీత స్ధాయిలో ఆరోపణలు, విమర్శల దాడులు తప్పవు తట్టుకోవాల్సిందే. కాకపోతే జాగృతి సంస్ద కేంద్రంగా రాజకీయాలు చేయాలని అనుకుంటే కవిత రాజకీయ భవిష్యత్తు ఎక్కువ కాలం సాగకపోవచ్చు. ఎందుకంటే ఇన్నిపార్టీల మధ్య జాగృతి సంస్ధ ఉనికి చాటుకోవటం కూడా కష్టమే. లిక్కర్ స్కామ్ మెడపైన కత్తిలాగ వేలుడుతున్నంత వరకు కవితకు రాజకీయ భవిష్యత్తు కష్టమే.

Read More
Next Story