
కెసీఆర్ ‘ఇద్దరి’ మధ్య నలిగిపోతున్నారా ?
కవిత ఆరోపణలను బట్టి అందరికీ అర్ధమవుతున్నది ఏమిటంటే పార్టీలో కవితకు మద్దతు దొరక్కుండా కేటీఆర్ అందరినీ నియంత్రిస్తున్నారని
విడవమంటే పాముకు కోపం..కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా తయారైంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరం. ఒకవైపు కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్, మరోవైపు కూతురు కవిత. ఇద్దరి మధ్య కేసీఆర్ బాగా నలిగిపోతున్నట్లు అర్ధమవుతోంది. కేటీర్(KTR) నాయకత్వాన్ని కవిత అంగీకరించటంలేదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీలో తనను ఎదగనీయకుండా అణిచివేస్తున్నట్లు కేటీర్ పేరు ఎత్తకుండానే కవిత(Kavitha) ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్నారు. దాంతో పార్టీ తరపున కవితకు నేతల్లో ఏ ఒక్కరి నుండి మద్దతు దొరక్కుండా కట్టడిచేసినట్లు తెలిసిపోతోంది. ఎలాగంటే కవిత పాల్గొంటున్న ఏ కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్(BRS) నేతలు, క్యాడర్ కనిపించటంలేదు.
కవిత ఆరోపణలను బట్టి అందరికీ అర్ధమవుతున్నది ఏమిటంటే పార్టీలో కవితకు మద్దతు దొరక్కుండా కేటీఆర్ అందరినీ నియంత్రిస్తున్నారని. అన్నా, చెల్లెళ్ళ మధ్య మాటలు ఆగిపోయి చాలాకాలం అయిపోయిందని పార్టీనేతల టాక్. అందుకనే ఏ కార్యక్రమంలో కూడా కేటీఆర్, కవిత కలిసి ఒకేసమయంలో పాల్గొనటంలేదు. ఈమధ్య కాళేశ్వరం అవినీతి, అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేసిన విచారణకు కేసీఆర్(KCR) హాజరైన విషయం తెలిసిందే. కొందరు నేతలతో పాటు కవిత కూడా ఫామ్ హౌస్ కు వచ్చి కేసీఆర్ ను కలవబోతోందన్న సమాచారం అందింది. దాంతో ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ బయలుదేరే సమయంలో కవిత ఉన్నారుకాని కేటీఆర్ కనబడలేదు. అలాగే విచారణ జరిగే బీఆర్కే భవన్ దగ్గర కేటీఆర్ ఉన్నారు కాని కవిత ఎక్కడా కనబడలేదు.
ఈమధ్యనే హెల్త్ చెకప్ కోసం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. కేసీఆర్ ఆసుప్రతిలో చేరేటపుడు కేటీఆర్ దగ్గరే ఉన్నారు. రెండోరోజు ఆసుపత్రిలో కవిత కనిపించారు కాని కేటీఆర్ కనబడలేదు. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమంటే ఇద్దరూ ఒకరికి మరొకరు ఎదురుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలతోనే అన్నా, చెల్లెళ్ళ మధ్య వైరం ఏ స్ధాయికి చేరుకుందో అర్ధమవుతోంది. దానికి తోడు ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతు బీఆర్ఎస్ పార్టీ తనదిగా చెప్పుకున్నారు. కుటుంబసభ్యులు, దగ్గరి వాళ్ళ టెలిఫోన్లు ట్యాపింగ్ జరగటం తనను చాలా బాధించిందని అన్నారు. తాను తెలంగాణకు సీఎం అవుతానని గట్టిగా చెప్పారు. అన్నా, చెల్లెళ్ళ మధ్య పార్టీలో ఆధిపత్యం విషయంలోనే గొడవలైనట్లు అందరికీ తెలిసిపోయింది. ఇలాంటి నేపధ్యంలోనే బీఆర్ఎస్ తనదని, టెలిఫోన్ ట్యాపింగ్ జరగటం బాధాకరమని, తాను సీఎం అవుతానని చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ ను ఇరుకునపడేసేవే అనటంలో సందేహంలేదు.
ఇరకాటంలో కేసీఆర్
ఇలాంటి పరిణామాలను గమనిస్తుంటే ఇద్దరిమధ్యా మొదలైన ఆధిపత్య గొడవలతో మధ్యలో కేసీఆర్ నలిగిపోతున్నట్లు అర్ధమవుతోంది. కొడుకు, కూతురిలో ఏ ఒక్కరికీ కేసీఆర్ మద్దతుగా నిలిచే పరిస్ధితిలో లేరు. ఇద్దరి మధ్యా మొదలైన ఆధిపత్య గొడవల్లో ఇప్పటికి అయితే కేసీఆర్ కొడుకు పక్షానే నిలబడినట్లు అర్ధమవుతోంది. వివాదం మొదలైనప్పటినుండి కవితకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీకూడా దొరకటంలేదు. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పార్టీ నేతలు అంటున్నారు. అంటే ఇంట్లో మొదలైన వివాదాన్ని పార్టీ నేతలతో కూడా చర్చించేందుకు కేసీఆర్ ఇష్టపడటంలేదని తెలుస్తోంది. కేసీఆర్ ఇద్దరినీ పిలిపించి క్లాసు తీసుకుని వివాదాన్ని కంట్రోల్ ఎందుకు చేయటంలేదనే ప్రశ్నకు సమాధానం దొరకటంలేదు.
కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడితే కవిత ఎలా రియాక్టవుతుందో కేసీఆర్ కు అర్ధం అవుతున్నట్లు లేదు. అందుకనే కేసీఆర్ ఏమీ మాట్లాడుతున్నట్లు లేదు. అలాగే కవిత వ్యాఖ్యల్లో నిజాలున్నాయని కేసీఆర్ అంటే కేటీఆర్ రియాక్షన్ ఎలాగుంటుందో అనే సందేహాలు పెరిగిపోతున్నట్లున్నాయి. ఇప్పటికీ కేటీఆర్ నాయకత్వంపై పార్టీలో నూరుశాతం యాక్సెప్టీన్సీ రాలేదు. అందుకనే పార్టీ అధ్యక్షపదవిని ప్రకటించకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో కేసీఆర్ సరిపెట్టారు. ఇలాంటి పరిస్ధితిల్లో కవితకు మద్దతుగా నిలబడితే కేటీఆర్ పరిస్ధితి పార్టీలో మరింత ఇబ్బందిగా మారుతుందని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్ధితుల్లో ఇద్దరి మధ్య వివాదాన్ని ఎలా పరిష్కరించాలో అర్ధంకాక కాలానికే వదిలేశారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అన్నా, చెల్లెళ్ళ మధ్య వివాదం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాల్సిందే.