జహీరాబాద్ లో కేసీఆర్ వ్యూహమేమిటి?
జహీరాబాద్ పార్లమెంటులో పోటీచేస్తున్న అభ్యర్ధుల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే పై అనుమానం రాకమానదు.
ఎన్నికలన్నాక ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ప్రస్తుత రాజకీయాల్లో నిజమైన ప్రత్యర్ధులు ఎవరో . ప్రత్యర్ధులుగా నటిస్తున్న మిత్రులెవరో తెలుసుకోవటం కష్టమే. ఇదంతా ఇపుడు ఎందుకంటే జహీరాబాద్ పార్లమెంటులో పోటీచేస్తున్న అభ్యర్ధుల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే పై అనుమానం రాకమానదు. ఇపుడు విషయం ఏమిటంటే జహీరాబాద్ పార్లమెంటులో కాంగ్రెస్ తరపున సురేష్ షేట్కర్, బీఆర్ఎస్ క్యాండిడేట్ గా అనీల్ కుమార్, బీజేపీ తరపున బీబీ పాటిల్ పోటీలో ఉన్నారు. ఇందులో పాటిల్, షెట్కార్ లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేతలు. అనీల్ కుమార్ మున్నూరుకాపు నేత. అవటానికి ముగ్గురు బీసీలే అయినా వీరిలో అనీల్ కుమార్ మిగిలిన ఇద్దరితో పోల్చితే బాగా బలహీన అభ్యర్ధని తెలుస్తోంది.
ఓట్లపరంగా తీసుకుంటే ముగ్గురు బీసీల ఓట్లను చీల్చుకుంటారు. కాకపోతే పాటిల్, సురేష్ ఇద్దరూ ఆర్ధిక, అంగబలాల్లో గట్టి అభ్యర్ధులు, పాపులర్ నేతలు కాబట్టి తమ సామాజికవర్గం ఓట్లు వీళ్ళకే ఎక్కువ పడే అవకాశముంది. పాటిల్ 2014,2019లో గెలిచి రాబోయే ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని పాటిల్ అనుకుంటున్నారు. అలాగే సురేష్ 2009లో గెలిచి 2014లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అవకాశం రాకపోయినా ఇపుడు మళ్ళీ అభ్యర్ధయ్యారు. పొలిటికల్ ట్రాక్ రికార్డు చూసినా, ఆర్ధిక, అంగబలాలు చూసినా బీఆర్ఎస్ అభ్యర్ధి అనీల్ కుమార్ కన్నా మిగిలిన ఇద్దరు ప్రత్యర్ధులు గట్టివారే అనిపిస్తోంది.
గట్టి నేతలను ఎందుకు పక్కనపెట్టారు ?
బీఆర్ఎస్ అభ్యర్ధిపై నియోజకవర్గంలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. అదేమిటంటే అనీల్ లాంటి బలహీనమైన అభ్యర్ధిని కేసీయార్ ఎందుకు పోటీలోకి దింపినట్లు ? అని. ఎలాగంటే కేసీయార్ కోసం కామారెడ్డి అసెంబ్లీ టికెట్ ను త్యాగంచేసిన గంప గోవర్ధన్, నియోజకవర్గంలో బాగా పాపులరైన బీసీ నేత గాజుల సురేందర్, జుక్కల్ మాజీ ఎంఎల్ఏ హనుమంత్ షిండే, బాన్సువాడ ఎంఎల్ఏ, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు పోచారం భాస్కరరెడ్డి టికెట్ కోసం ప్రయత్నించారు. నిజానికి వీళ్ళందరు పార్లమెంటు అభ్యర్ధులుగా అనీల్ కన్నా గట్టి నేతలే. పోచారంకు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది. పైగా ఆర్ధికంగా అత్యంత పటిష్టమైన స్ధితిలో ఉన్నారు. ఎంత ప్రయత్నించినా భాస్కర్ కు కేసీయార్ టికెట్ ఇవ్వలేదు.
ఇక 2009,14,18 ఎన్నికల్లో మూడుసార్లు వరుసగా గెలిచిన జుక్కల్ మాజీ ఎంఎల్ఏ షిండేకీ కేసీయార్ టికెట్ ఇవ్వలేదు. షిండేకి టికెట్ ఇచ్చుంటే మూడు ఎస్సీ నియోజకవర్గాలు జుక్కల్, జహీరాబాద్, ఆంథోల్ లో బాగా అడ్వాంటేజ్ అయ్యుండేది. కామారెడ్డి ఎంఎల్ఏగా వరుసగా టీడీపీ, టీఆర్ఎస్ తరపున నాలుగుసార్లు గెలిచిన గంప గోవర్ధన్ కు కూడా బలమైన అభ్యర్ధే. ఎంపీ టికెట్ కోసం గంప ఎంత ప్రయత్నించినా టికెట్ ఇవ్వలేదు. పైగా తన అసెంబ్లీ టికెట్ ను గంప మొన్నటి ఎన్నికల్లో కేసీయార్ కోసం త్యాగం కూడా చేశారు. ఇక గాజుల సురేందర్ ఆర్ధికంగా మంచి స్ధితిలో లేకపోయినా జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో బాగా పాపులరైన బీసీ నేత. ఇంతమంది పార్టీలోనే గట్టి అభ్యర్ధులను కాదని బలహీనమైన అనీల్ కు కేసీయార్ ఎందుకు టికెట్ ఇచ్చారనే విషయమై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అనే కాంగ్రెస్ అరోపణలపైన కూడా చర్చ జరుగుతోంది.
ఈ చర్చలో నుండి బీబీ పాటిల్ ఇప్పటికీ కేసీయార్ మనిషే అనే విశ్లేషణ వినబడుతోంది. దీనికి సమర్ధన ఏమిటంటే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ ను టార్గెట్ చేస్తున్నారు కాని బీజేపీ అభ్యర్ధి పాటిల్ ను టచ్ చేయటంలేదు. పాటిల్ ను గెలిపించేందుకే కేసీయార్ బీఆర్ఎస్ తరపున బలహీనమైన అభ్యర్ధిని పోటీలోకి దింపారనే ప్రచారం కూడా జరుగుతోంది.
బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనా ?
ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిశెట్టి నిరంజన్ రెడ్డి మాట్లాడుతు బీఆర్ఎస్, బీజేపీ రెండుపార్టీలు కావన్నారు. రెండుపార్టీలు కలిసిపోయి కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కర్ ను ఓడించేందుకు పనిచేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు రెండు ఒకటే కాబట్టి బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోయిన బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న బీబీ పాటిల్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడటంలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ బీజేపీ క్యాండిడేట్ గురించి ఏమి ప్రస్తావించటంలేదన్నారు. దీంతోనే బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే భావన జనాల్లో పెరిగిపోతోందని చెప్పారు.