కేసీఆర్ రెడీ అవుతున్నారా ?
x
KCR and Kavitha

కేసీఆర్ రెడీ అవుతున్నారా ?

చాలా కాలంగా ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ తొందరలో రాష్ట్ర పర్యటనకు రెడీ అవుతున్నట్లు సమాచారం. షెడ్యూల్ ను పార్టీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌస్ లో చర్చిస్తున్నారు


చాలా కాలంగా ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ తొందరలో రాష్ట్ర పర్యటనకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను పార్టీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌస్ లో చర్చిస్తున్నారు. కేసీఆర్ రాష్ట్ర పర్యటనలకు కారణం ఏమిటంటే రైతు రుణమాఫీ, రైతు బంధకాలే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ రైతు రుణమాఫీ జరగలేదని, తన హయాంలో ఎంతో బాగా అమలైన రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసినట్లు కేసీఆర్ విరుచుకుపడబోతున్నారు.

చాలారోజులుగా రైతురుణమాఫీ అమలుపై కేటీఆర్, హరీష్ తో పాటు బీజేపీ నేతలు చాలా ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు 60 లక్షలమంది రైతులకు సుమారు రు. 31 వేల కోట్లు మాఫీ జరగాల్సిందిపోయి కేవలం 22 లక్షలమంది రైతులకు మాత్రమే పరిమితమైందని గోల చేస్తున్నారు. అలాగే రు. 31 వేల కోట్లకు బదులు రు. 18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేసి రుణమాఫీ అయిపోయినట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటించటంపై ప్రతిపక్షాలు మండిపోతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు 8 లక్షలమంది రైతులకు రుణమాఫీ జరగాల్సుంది. ఇందుకోసం రు. 14 వేల కోట్లు పెండింగులో ఉండిపోయింది.

ఈ విషయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమి చెబుతున్నారంటే రు. 2 లక్షలకు పైగా రుణాలను రైతులు బ్యాంకులకు తీర్చేస్తే హామీ ప్రకారం రు. 2 లక్షలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. ఇదే సమయంలో రు. 2 లక్షలకు లోపు రుణాలు కూడా సాంకేతిక సమస్యల కారణంగా కొందరికి మాఫీ జరగలేదన్నారు. సాంకేతిక సమస్యలు క్లియర్ కాగానే ఈ రుణాలు కూడా మాఫీ అయిపోతాయని తుమ్మల చెప్పారు. అయితే తుమ్మల ప్రకటనను ప్రతిపక్షాలు అంగీకరించటంలేదు.

సరిగ్గా ఇదే పాయింటును కేసీఆర్ టచ్ చేయబోతున్నారు. ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదంటే కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీహార్ జైలులో ఉండటమే. కవిత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాతే తాను రాష్ట్ర పర్యటన ద్వారా జనాల్లోకి రావాలని అనుకున్నారట. కవిత జైలు నుండి రెండు రోజుల క్రితమే బయటకు వచ్చేయటంతో ఇపుడు కేసీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. బహుశా కవితతో కలిసే కేసీఆర్ రాష్ట్రపర్యటన చేయవచ్చని పార్టీ వర్గాల సమాచారం. శుక్రవారం దీనికి సంబంధించిన కార్యాచరణ రెడీ అవుతుందని పార్టీవర్గాలు చెప్పాయి. నియోజకవర్గాల్లో సభలు లేదా కార్నర్ మీటింగులతో జనాలను కేసీఆర్ కలవాలని డిసైడ్ అయ్యారు. పరిస్ధితులు అన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్ మొదటివారంలో తెలంగాణా పర్యటనకు కేసీఆర్ శ్రీకారం చుట్టవచ్చు.

Read More
Next Story