కేసీయార్ పరుగో పరుగు..తెగ తిరుగుతున్నారుగా ?
x
KCR in BRS meeting

కేసీయార్ పరుగో పరుగు..తెగ తిరుగుతున్నారుగా ?

కేసీయార్ పరుగులు పెడుతున్నది మాత్రం దూరమైన వర్గాలను మళ్ళీ దగ్గరకు చేర్చుకునేందుకే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.


తనకు ఇలాంటి పరిస్ధితి వస్తుందని కేసీయార్ కలలో కూడా అనుకునుండరు. ఎన్నికల సమయంలో మిగిలిన పార్టీల అధినేతలు పాల్గొన్నట్లే బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల్లో కేసీయార్ కూడా పాల్గొనటం సహజమే. కాని ఇపుడు కేసీయార్ పరుగులు పెడుతున్నది మాత్రం దూరమైన వర్గాలను మళ్ళీ దగ్గరకు చేర్చుకునేందుకే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎండిన పంటలను చూసేందుకు పొల్లాల్లోకి వెళుతున్నారు. ఎక్కడ కనబడితే అక్కడ రైతులతో రోడ్లపైన, పొలాల్లోకి వెళ్ళి మరీ మాట్లాడుతున్నారు. నామినేషన్లు మొదలైన తర్వాత అంటే 22వ తేదీనుండి ఉదయం 11 గంటల వరకు పొలంబాటతో బిజీగా ఉండబోతున్నారు. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని సాయంత్రం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు లేదా మూడు చోట్ల రోడ్డుషోలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొనబోతున్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్ వరంగల్లో నియోజకవర్గాల్లో భారీ బహిరంగసభల్లో పాల్గొనబోతున్నారు.

తాజాగా కేసీయార్ షెడ్యూల్ చూస్తే ఈ షెడ్యూల్ ను కేసీయార్ నిజంగానే ఫాలో అవుతారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీయార్ వైఖరి ఎలాగుండేది ఎన్నికలతర్వాత, అందులోను పార్లమెంటు ఎన్నికల సమయానికి ఎలాగ మారిపోయిందనే విషయమే ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉన్నపుడు జనాలను కాదు చివరకు మంత్రులను సైతం కేసీయార్ కలిసేవారు కాదు. నెలలతరబడి వెయిట్ చేస్తేకాని మంత్రులకు కేసీయార్ దర్శనభాగ్యం దక్కేదికాదు. అదికూడా మంత్రులతో కేసీయార్ కు ఏదైనా పనుంటే తప్ప కలిసేవాళ్ళు కాదు. మంత్రుల పరిస్ధితే ఇలాగుండేదంటే ఇక ఎంఎల్ఏల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. మంత్రులు, ఎంఎల్ఏల పరిస్ధితే ఇలాగుంటే ఇక మామూలు జనాలను పట్టించుకున్న పాపానపోలేదు. తాను జనాలను కలవదలుచుకున్నపుడు మాత్రమే కేసీయార్ పర్యటనలు చేసేవారు. అంతేకాని జనాల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పర్యటించింది చాలా తక్కువనే చెప్పాలి.

కరువైనా, భారీవర్షాలకు దెబ్బతిన్న పంటలనైనా, బాధితులనైనా ఎక్కువగా పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్, మాజీమంత్రులు కేటీయార్, హరీష్ రావులే పరామర్శించేవారు. బాధితులు తమ బాధలను కేసీయార్ తో చెప్పుకోవాలని ఎంత గోలచేసినా వినిపించుకోలేదు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పత్తిరైతులు గిట్టబాటు ధరలకోసం ఆందోళనచేస్తే వారిని చితకబాదించి, వాళ్ళపైన కేసులు పెట్టి, జైళ్ళకు పంపిన ఘటనలున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటికి సమీపంలో ఉన్న రైతుల పొలాలను మాస్టర్ ప్లాన్ పేరుతో మున్సిపాలిటిలో కలిపేశారు. రైతులతో మాట్లాడకుండా, వారి సమ్మతి తీసుకోకుండానే వాళ్ళ భూములను ప్రభుత్వం తీసేసుకుంటున్నట్లు ప్రకటన ఇచ్చేశారు. దాంతో గోలచేసిన రైతులపై కేసులు పెట్టి జైళ్ళకు పంపిన ఘటనలున్నాయి. పదేళ్ళ పాలనలో కేసీయార్ వైఖరిని చూసి ఇపుడు అయ్యాబాబూ, అమ్మాబాబు అంటు జనాలతో మాట్లాడేందుకు షెడ్యూల్ రెడీ చేసుకోవటమే విచిత్రంగా ఉంది.

కేసీయార్లో ఇంతలో ఎంతమార్పు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. అదేదో సినిమాలో హీరో ప్రతిదానికి తావీదు మహిమ అనే డైలాగు చెప్పినట్లుగా కేసీయార్ మార్పుకు ప్రధాన కారణం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమనే చెప్పాలి. ఒకే ఒక్క ఓటమి కేసీయార్ ను పార్లమెంటు ఎన్నికలు పరుగులు పెట్టిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ది బలుపు కాదు కేవలం వాపే అని జనాల్లో చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే పదేళ్ళు అధికారం అనుభవించిన చాలామంది నేతలు పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. మరికొందరు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు హస్తంగూటికి చేరుకున్నారు. ఇప్పటికే వివిధ సందర్భాల్లో పదిమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తం 25 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

జరుగుతున్న పరిణామాలు, ప్రచారం బహుశా కేసీయార్ ను సరిగా నిద్రపోనివ్వటంలేదేమో. పార్లమెంటు ఎన్నికల్లో గనుక ఆశించిన ఫలితాలు రాకపోతే పార్టీ పరిస్ధితి ఎలాగుంటుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని చూస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్ధులను జనాలు పట్టించుకుంటున్నట్లు లేదు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్-బీజేపీ మధ్యే అనే ప్రచారం పెరిగిపోతోంది. బీఆర్ఎస్ అభ్యర్ధులు కూడా ప్రచారంకూడా అంతంతమాత్రంగానే సాగుతోందని నియోజకవర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే జరుగుతున్న ప్రచారం తప్పని నిరూపించేందుకు కేసీయార్ పరుగులు పెడుతున్నట్లున్నారు. కరీంనగర, సిరిసిల్ల, నల్గొండలో కూడా పర్యటించారు. ఎన్నికల్లో గెలుపుకోసం కారుపార్టీ అధినేత ప్రయత్నాలు ఏమేరకు సఫలమవుతాయో చూడాల్సిందే.

Read More
Next Story