కేసీయార్ చెప్పింది నిజమేనా ?
కేసీయార్ నాయకత్వంలోని బీఆర్ఎస్ రెండుకూటముల్లో ఎందులోను లేదు. పోని ఇంకో కూటమిని ఏర్పాటుచేద్దామని ప్రయత్నిస్తున్నారా అంటే అదీలేదు
మామూలుగా ఆడవాళ్ళ మాటలకు అర్ధలు వేరని అంటుంటారు. దాన్ని కేసీయార్ మాటలకు కూడా అన్వయించుకోవాలేమో. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కేంద్రంలో ఏర్పడబోయేది ప్రాంతీయపార్టీల కూటమి ప్రభుత్వమే అన్నారు. ఎన్డీయేకి మెజారిటి రాదట. ఇండియా కూటమికి అంత సీన్ లేదట. కాబట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ప్రాంతీయపార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వమే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ప్రాంతీయపార్టీల కూటమి అంటే ఏమిటంటే ఎవరికీ తెలీదు. ఎందుకంటే ప్రాంతీయపార్టీల కూటమి అన్నదే జాతీయస్ధాయిలో ఇప్పటికైతే లేదుకాబట్టి. జాతీయస్ధాయిలో ఉన్నది రెండే కూటములు. ఒకటమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, మరోటేమో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి.
ఈ రెండు కాకుండా మరో కూటమే లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ నాయకత్వంలోని బీఆర్ఎస్ రెండుకూటముల్లో ఎందులోను లేదు. పోని ఇంకో కూటమిని ఏర్పాటుచేద్దామని ప్రయత్నిస్తున్నారా అంటే అదీలేదు. గతంలో కేసీయార్ చేసిన ప్రయత్నం దారుణంగా ఫెయిలైంది. ఎన్డీయే, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా మూడోకూటమిని ఏర్పాటుచేయాలని అందుకు తానే కీలకపాత్ర పోషించాలని కదా కేసీయార్ కలలుకన్నారు. అప్పుడే కదా తాను జాతీయరాజకీయాల్లో వెలిగిపోవాలని నిర్ణయించుకుని పశ్చిమబెంగాల్, మహారాష్ట్రా, ఢిల్లీ, తమిళనాడు, ఒడిస్సా, కేరళ, ఏపీ, కర్నాటకల్లో తిరిగింది. అయితే ఉత్ధవ్ థాకరే, మమతాబెనర్జీ, స్టాలిన్, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్, పినరయి విజయన్ ఎవరూ కలిసిరాలేదు. ఎందుకు కలిసిరాలేదంటే కేసీయార్ క్రెడిబులిటి ఆ స్ధాయిలో ఉందిమరి.
ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కూడా కేసీయార్ గెలిచుంటే ఇపుడు పరిస్ధితులు ఎలాగుండేదో. ఓడిపోవటంతో కేసీయార్ ను ఎవరు పట్టించుకోవటంలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడే కేసీయార్ తో చేతులు కలపటానికి ఎవరు ఇష్టపడని వాళ్ళు ఇప్పుడెందుకు చేతులు కలుపుతారు. ఇక ఇండియా కూటమిలోనే ఉంటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐలు ఏ స్ధాయిలో గొడవలుపడుతున్నాయో అందరు చూస్తున్నదే. మమత కూడా ఏమాత్రం నమ్మదగ్గ నేతకాదు. ఈ నేపధ్యంలోనే కేంద్రంలో రాబోయేది ప్రాంతీయపార్టీల సంకీర్ణ ప్రభుత్వమే అని కేసీయార్ పదేపదే చెప్పటం అంటే ఏదో భ్రమల్లో ఉన్నట్లే అర్ధమవుతోంది. కేసీయార్ లాజిక్ ఏమిటంటే మహారాష్ట్ర, బెంగాల్, బీహార్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందట. దక్షిణాదిలో 12 సీట్లకు మించిరావట.
అలాగే ఇండియా కూటమికి కూడా ఎక్కువ సీట్లు రావట. కాబట్టి కేంద్రంలో వచ్చేది ప్రాంతీయపార్టీల కూటమే అని అంటున్నారు. ప్రాంతీయపార్టీల కూటమి అంటే ఏమిటో చెప్పమంటే చెప్పటంలేదు. ఈ కూటమిలో చేరే పార్టీలు ఏవంటే తెలీదు. తాను ఎవరి నాయకత్వంలో పనిచేయటానికి ఇష్టపడరు. తన నాయకత్వంలో పనిచేసే ప్రాంతీయపార్టీలు ఏవీలేవు. ప్రాంతీయపార్టీల కూటమిలో కాంగ్రెస్ కూడా ఒక చిన్నపార్టీగా చేరుతుందని చెప్పారు. మొత్తానికి కేసీయార్ చెప్పిన లెక్కలు లాజిక్కుకే కాదు కనీసం ఊహకు కూడా అందటంలేదు. మరీ పరిస్ధితుల్లో కేంద్రంలో ప్రాంతీయపార్టీల కూటమి ఏమిటో ? అందులో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషించటం ఏమిటో కేసీయార్ కే తెలియాలి. చూద్దాం ఒక ఆరురోజులు ఆగితే ముందు బీఆర్ఎస్ విషయం ఏమిటో తేలిపోతుంది కదా.