కిషన్ రెడ్డి ‘కుట్ర’ సాకును రెడీగా పెట్టుకున్నారా ?
x
Kishanreddy in party meeting

కిషన్ రెడ్డి ‘కుట్ర’ సాకును రెడీగా పెట్టుకున్నారా ?

తాను కూడా చాలామంది రాజకీయనేతల్లాగే ఆలోచిస్తానని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరూపించుకున్నారు


తాను కూడా చాలామంది రాజకీయనేతల్లాగే ఆలోచిస్తానని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరూపించుకున్నారు. ఈనెల 27వ తేదీన హైదరాబాద్(Hyderabad) జిల్లా స్ధానికసంస్ధల ఎంఎల్సీ ఎన్నికల నేపధ్యంలో పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కిషన్ మాట్లాడుతు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు పోటీచేయటంలేదో జనాలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్(BRS) ఓటమిభయంతోనే పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎంఎల్సీ ఎన్నికలోనే కాదు ఈమధ్యనే జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా ఓటమిభయంతోనే బీఆర్ఎస్ పోటీచేయలేదన్న విషయం అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన విషయాన్ని ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఎందుకు మళ్ళీ ప్రకటిస్తుంది ?

ఇక కాంగ్రెస్ విషయంచూస్తే హైదరాబాద్ ఎంఎల్సీ ఎన్నికలో పోటీపెట్టకూడదని ఎప్పుడో నిర్ణయించిన విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే పోటీచేసినా గెలిచేదిలేదు. అందుకనే మిత్రపక్షం ఏఐఎంఐఎం(AIMIM)కు ఈ సీటును వదిలేస్తామని చాలారోజుల క్రితమే హామీఇచ్చింది. అప్పటి హామీ ప్రకారమే ఇపుడు ఎంఐఎం పోటీచేస్తోంది. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇందులో దాపరికం కూడా ఏమీలేదు. కాకపోతే అందరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే అసలు ఈఎన్నికలో బీజేపీ ఎందుకు పోటీచేస్తోందని. ఆత్మప్రబోధం మేరకు ఓట్లేయమని కిషన్(Kishan Reddy) పిలుపిచ్చినా, పార్టీ ఓట్లు నూరుశాతం అభ్యర్ధి గౌతమ్ రావుకే పడినా బీజేపీ అయితే గెలవదన్న విషయం కిషన్ రెడ్డితో పాటు పార్టీలో అందరికీ తెలుసు. పోటీచేసినా గెలవదని తెలిసీ మరి బీజేపీ(BJP) ఎందుకు పోటీచేస్తోందో కిషనే జనాలకు వివరించాలి.

హైదరాబాద్ జిల్లా స్దానికసంస్ధల పరిధిలో సుమారు 110 ఓట్లున్నాయి. కార్పొరేటర్లు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలు మాత్రమే ఓటర్లు. ఈలెక్కల ప్రకారంచూస్తే పోటీ చేస్తున్న ఎంఐఎం, బీజేపీ పార్టీల్లో ఎంఐఎం బలమే చాలా ఎక్కవుంది. రెండుపార్టీల్లోను ఏ పార్టీకి ఎక్కువబలముందో చూద్దాం. ముందు బీజేపీ విషయం తీసుకుంటే 19 మంది కార్పొరేటర్లు, ఒక ఎంఎల్సీ, మరో ఎంఎల్ఏ, నలుగురు ఎంపీలను కలుపుకుంటే కమలంపార్టీ బలం 25గా తేలుతుంది. ఇక ఎంఐఎం బలంచూస్తే 40 మంది కార్పొరేటర్లు, ఏడుగురు ఎంఎల్ఏలు, ఒక ఎంఎల్సీతో పాటు ఒక ఎంపీ ఉన్నారు. ఈ ఓట్లన్నింటినీ కలుపుకుంటే ఎంఐఎం బలం 49గా లెక్క తేలుతోంది. బీజేపీ బలం 25 ఎక్కడ ? ఎంఐఎం బలం 49 ఎక్కడ ? ఎంఐఎం బలానికి మిత్రపక్షం కాంగ్రెస్ బలం కూడా తోడవుతుంది కదా. కాంగ్రెస్ కు ఏడుగురు కార్పొరేటర్లు, ఇద్దరు ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంఎల్సీలు, ఒక ఎంపీతో కలుపుకుని 13 ఓట్లున్నాయి. అంటే ఎంఐఎం బలం 49+కాంగ్రెస్ బలం 13 కలుపితే మొత్తం ఓట్లు 62 అవుతాయి.

ఎవరి బలమెంతో తెలుసుకోవటం కోసం పై లెక్కలు వేయటం చాలా సింపుల్. ఏ కోణంలో చూసినా బీజేపీ అభ్యర్ధి గౌతమ్ రావు గెలవటానికి అవకాశమే లేదు. ఎంఐఎం అభ్యర్ధి గెలుపు సునాయాసమనే చెప్పాలి. ఇలాంటి ఎన్నికలో అసలు బీజేపీ ఎందుకు పోటీచేస్తున్నట్లు ? గుడ్డకాల్చి కాంగ్రెస్ మీద వేయటానికి కాకపోతే. బీజేపీ ఓటమికి కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ కుట్రచేస్తున్నట్లు కిషన్ రెడ్డి విచిత్రమైన ఆరోపణచేశారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతి అభ్యర్ధి తాను గెలవటం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అందరికీ తెలిసిందే. గెలవటం కోసం చేసే ప్రయత్నాలు, అనుసరించే వ్యూహలు కుట్ర ఎలాగవుతుందో కిషన్ రెడ్డే చెప్పాలి. ఓటమి తప్పదని తెలిసీ పోటీచేస్తున్న కారణంగా ఓటర్లు ఆత్మప్రబోధం ప్రకారం ఓట్లేసి బీజేపీని గెలిపించాలనే విచిత్రమైన పిలుపిచ్చారు కిషన్.

ఓడిపోయే సీటులో పోటీచేయటం ఎందుకు ? తమ ఓటమికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని గోలచేయటం ఎందుకు ? ఓటర్లు ఆత్మప్రబోధం ప్రకారం ఓట్లేయాలని పిలుపివ్వటం దేనికో కిషన్ కే తెలియాలి. ఎంఐఎం మీద పోటీచేయకుండా ఏకగ్రీవంగా గెలవటానికి ఎందుకు అవకాశమిచ్చారని ఎవరైనా అడుగుతారేమో అన్న ఆలోచనతోనే బీజేపీ పోటీచేస్తున్నట్లుంది. ఇంతేకాని పోటీచేయటానికి మరో లాజిక్కే తెలీటంలేదు. రేపు ఫలితాల్లో బీజేపీ ఓడిపోయిందని ప్రకటించిన తర్వాత ముందునుండి తాను చెబుతున్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రచేసి ఓడించాయని చెప్పుకునేందుకు కిషన్ రంగం సిద్ధంచేసినట్లున్నారు.

Read More
Next Story