
కొండా సురేఖ పైటరా లేకపోతే వివాదాస్పదురాలా ?
ఇన్నిపార్టీలు ఎందుకు మారారంటే పార్టీల్లోని కీలక నేతలు లేదా అధినేతలతో పడకనే అని అర్ధమవుతోంది
వరంగల్ కు చెందిన మంత్రి కొండా సురేఖ వ్యవహారం మొదటినుండి వివాదాస్పదమే. ఈమెను ఫైటర్ అనాలా లేకపోతే వివాదాస్పదురాలు అనాలా ? ఎందుకంటే ఆమెకు ఎవ్వరితోను పడదు. సొంతపార్టీ నేతలతో గొడవలు, ప్రతిపక్షాల నేతలతో వివాదాలు, సహచర మంత్రులతో విభేదాలు. చివరకు ఇపుడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో కూడా పడటంలేదు. తాజా వివాదంలో గమనించాల్సిన విషయాలు మూడున్నాయి. అవేమిటంటే రేవంత్(Revanth) మీద ఎక్కడా సురేఖ నోరిప్పలేదు. రేవంత్ కు వ్యతిరేకంగా మంత్రి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. భర్త కొండామురళి ఏమో రేవంత్ కు జై అంటున్నారు. రేవంత్ నాయకత్వంమీద తనకు నమ్మకంఉందని, గతంలో తనకు హామీఇచ్చినట్లుగానే ఎంఎల్సీ పదవి ఇస్తారని చెప్పారు. అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధానమంత్రిని చేయాలన్న రేవంత్ ఆలోచనలకు మద్దతుగా తామునడుచుకుంటామని ప్రకటించారు. ఇదేసమయంలో మంత్రి కూతురు కొండా(Konda) సుస్మిత మాత్రం రేవంత్ పై ఫుల్లుగా ఫైరయ్యారు.
రెడ్లంతా ఏకమై తనతల్లిని వేధిస్తున్నారని, తనతల్లికి ఏదైనాజరిగితే అందుకు రేవంతే బాధ్యతవహించాలని హెచ్చరించటం సంచలనంగా మారింది. బీసీ మహిళ అనికూడా చూడకుండా తన తల్లిని ఇంతలా రేవంత్ వేధిస్తారా అని తీవ్ర ఆగ్రహంవ్యక్తంచేశారు. సుస్మిత ఎక్కడో ప్రైవేటుగా మాట్లడలేదు. నేరుగా మీడియాతోనే ఇవన్నీ మాట్లాడటంతోనే పార్టీలో కలకలంరేపింది.
కొండా నేపధ్యం
కొండాసురేఖ తన రాజకీయ ప్రస్ధానాన్ని 1995లో మొదలుపెట్టారు. వరంగల్ రూరల్ మండలంలోని ఊకల్ లో 1964లో పుట్టిన సురేఖ గీసుకొండ ఎంపీటీసీగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచి మండలాధ్యక్ష్రురాలయ్యారు. తర్వాత జడ్పటీసీగా గెలిచారు. 1996లో పీసీసీ సభ్యురాలయ్యారు. మొదటినుండి సురేఖ సూపర్ ఫాస్టనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మద్దతుదారుగా గుర్తింపు పొందిన సురేఖ 1999లో శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి గెలిచారు. ఎంఎల్ఏ హోదాలో మహిళా శిశుసంక్షేమశాఖ, ఆరోగ్య, ప్రధామిక విద్యాకమిటీల్లో సభ్యురాలిగా పనిచేశారు. 2000లో ఏఐసీసీ కో ఆప్షన్ సభ్యురాలిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.
2004లో రెండోసారి కూడా శాయంపేట నుండి గెలిచిన సురేఖ మూడోసారి 2009 ఎన్నికల్లో పరకాల నియోజకవర్గానికి మారి గెలిచారు. అప్పుడు వైఎస్ క్యాబినెట్ లో మొదటిసారి మంత్రయ్యారు. వైఎస్ మరణం తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలతో ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుపలికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అవినీతికేసుల్లో వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో పెట్టడాన్ని నిరసిస్తు 2011, జూలై 4వ తేదీన ఎంఎల్ఏగా రాజీనామా చేశారు. 2012, జూన్ 12 జరిగిన ఉపఎన్నికలో తిరిగి వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు.
పార్టీలో జరిగిన పరిణామాలతో జగన్ తో విభేదించి 2013లో జూలై 13న వైసీపీకి రాజీనామాచేసి టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. కొంతకాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విభేదించి 2018లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సురేఖ మళ్ళీ 2023ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచి ఇపుడు మంత్రిగా పనిచేస్తున్నారు.
ఎన్నిపార్టీలు మారారు
ఇదంతా చెప్పటం దేనికంటే కాంగ్రెస్ తో రాజకీయాలు మొదలుపెట్టిన సురేఖ తర్వాత వైసీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. పై మూడుపార్టీలతో పడక ఒకదాని తర్వాత మరోపార్టీలోకి మారారు. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్లుగా చివరకు కాంగ్రెస్ లోనే చేరారు. పెద్ద పార్టీలంటే ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. ఇన్నిపార్టీలు ఎందుకు మారారంటే పార్టీల్లోని కీలక నేతలు లేదా అధినేతలతో పడకనే అని అర్ధమవుతోంది.
ప్లస్ పాయింట్లేమిటి ?
బీసీ మహిళ కావటమే సురేఖ ప్లస్ పాయింట్. ఇంతకన్నా అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే కొండా మురళి భర్త అవటం. ఆర్ధికంగా కొండా దంపతులు అత్యంత పటిష్టంగా ఉన్నారని పార్టీవర్గాల సమాచారం. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐదారు నియోజకవర్గాల్లో బలమైన మద్దతుదారులు, పట్టున్నది. దీనికారణంగానే జిల్లా అంతా తమ ఆదేశాలకు లోబడే పనిచేయాలని కొండా దంపతులు కోరుకుంటున్నారు. కూతురు సుస్మిత మాటల్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇపుడు మంత్రి విషయం ఇంతగా వివాదాస్పదం అవటంతో సుస్మిత చేసిన బహిరంగ వ్యాఖ్యలు కూడా కారణమే.
ఇపుడు ప్రస్తుత విషయానికి వస్తే జిల్లాలోని వరంగల్ వెస్ట్ ఎంఎల్ఏ నాయిని రాజేంద్రరెడ్డి, పరకాల ఎంఎల్ఏ రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంఎల్సీ బస్వరాజ్ సారయ్య, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ రాజ్యసభ ఎంపీ గుండుసుధారాణి లాంటి చాలామంది నేతలతో సురేఖకు బద్ధవైరముంది. అందుకనే సురేఖకు వ్యతిరేకంగా పైనచెప్పిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీ, ఎంపీ అంతా ఏకమయ్యారు. ఫలితంగా సురేఖ-వ్యతిరేక గ్రూపుతో ప్రతిరోజు కీచులాటలే. ఒకరిపై మరొకరు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ దగ్గర పంచాయితీలు జరిగినా ఎలాంటి ఉపయోగంలేకపోయింది.
స్ధానికంగా ఎంఎల్ఏలు, ఎంఎల్సీ, ఎంపీతో పంచాయితి జరుగుతుండగానే సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ తో గొడవలు మొదలయ్యాయి. వీళ్ళతో ఆగకుండా ఇపుడు రేవంత్ తోనే వివాదం మొదలైంది. ఇదంతా గమనిస్తే అర్ధమవుతున్నది ఏమిటంటే సురేఖ రాజకీయ జీవితం మొదటినుండి వివాదాస్పదమే అని.