
కేటీఆర్ ‘ఈ ఫార్ములా’ తో దొరికినట్లేనా ?
కేటీఆర్(KTR) ఎంఎల్ఏ కాబట్టి కేసు నమోదుచేయాలన్నా, ప్రాసిక్యూట్ చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి
మెల్లిగానే అయినా ఫార్ములా ఈ కార్ రేసు కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకుంటున్నట్లే అనిపిస్తోంది. ఫార్ములా కార్ రేసు(Formula E Car race)లో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటు చీఫ్ సెక్రటరి నుండి ఫైల్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు(T Governor Jishnudev Varma) చేరింది. ఫైల్ అందినవెంటనే గవర్నర్ న్యాయనిపుణులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కేటీఆర్(KTR) ఎంఎల్ఏ కాబట్టి కేసు నమోదుచేయాలన్నా, ప్రాసిక్యూట్ చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి. బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉన్నపుడు కార్ రేసు కేసులో కేటీఆర్ అధికారదుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా పెద్దఎత్తున అవినీతి కూడా జరిగిందని ఇప్పటికే విజిలెన్స్ కమిషన్, ఏసీబీ దర్యాప్తులో తేల్చాయి. అందుకనే కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతి కోరుతు రెండు దర్యాప్తు సంస్ధలు చీఫ్ సెక్రటరీకి లేఖలు రాశాయి.
కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చేఅధికారం చీఫ్ సెక్రటరీకిలేదు. అందుకనే అనుమతి కావాలని చీఫ్ సెక్రటరీ గవర్నర్ కు ఫైల్ పంపింది. ఏసీబీ, విజిలెన్స్ కమీషన్ రిపోర్టులను కూడా గవర్నర్ కు చీఫ్ సెక్రటరీ పంపారు. కేటీఆర్ మీద కేసునమోదు చేసి విచారించాలన్నా గవర్నర్ అనుమతి కావాల్సిందే. అందుకనే గతంలోనే ఏసీబీ రిపోర్టు ఆధారంగా కేసునమోదు చేయటానికి అనుమతి కావాలని చీఫ్ సెక్రటరీ అడిగారు. అప్పుడు కూడా న్యాయనిపుణులతో సంప్రదించిన తర్వాత, ఏసీబీ రిపోర్టును సాంతం పరిశీలించిన తర్వాతే గవర్నర్ అప్పట్లో కేటీఆర్ మీద కేసునమోదు చేసి విచారణకు అనుమతించారు.
అప్పటి అనుమతికి ఇప్పటి రిక్వెస్ట్ కొనసాగింపు మాత్రమే కాబట్టి ఒకటి, రెండురోజుల్లో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యం ఏసీబీ అధికారులు రంగంలోకి దిగటానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇదేకేసులో కీలకపాత్రదారుడు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ మీద యాక్షన్ తీసుకునేందుకు అనుమతికోరుతు చీఫ్ సెక్రటరి డీవోపీటికి లేఖరాశారు. అర్వింద్ ఐఏఎస్ అధికారి కావటంతో ప్రభుత్వం తనంతట తానుగా యాక్షన్ తీసుకునేందుకు లేదు. అందుకనే డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ)కి లేఖరాసింది. డీవోపీటి అన్నది కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది. అఖిలభారత సర్వీసు అధికారుల నియామకాలు, బదిలీలు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం లాంటి వ్యవహారాలను డీవోపీటీనే చూస్తుంది. అర్వింద్ తో పాటు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రాసిక్యూట్ చేయాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసుచేసింది.
కేటీఆర్ జైలుకు పోవటం ఖాయం : పొన్నం
కేసు విషయమై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు మంత్రులు మాట్లాడుతు కేటీఆర్ జైలుకు వెళ్ళటం ఖాయమన్నారు. అధికారంలో ఉన్నపుడు అడ్డుగోలుగా కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు మంత్రులు మండిపోయారు.
అసలు కేసేమిటి ?
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు 2023లో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేవారు. అలాగే అర్వింద్ కుమార్ ప్రిన్సిపుల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఫార్ములా ఈకార్ రేసు నిర్వహించేందుకు కేటీఆర్ ప్రయత్నించారు. ఇందుకోసం ఏస్ నెక్స్ట్ జన్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. అయితే తెరవెనుక ఏమైందో ఏమో మధ్యలోనే ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీ తప్పుకున్నది. దాని ప్లేసులో బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే కంపెనీ చేరింది. రేసునిర్వహణ పేరుతో బ్రిటన్ కంపెనీకి హెచ్ఎండీఏ నుండి రు. 45 కోట్లు బదిలీ అయ్యింది. ఈ మొత్తంమీద గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు కార్ రేసు జరగనేలేదు. ఏర్పాట్లు పూర్తయ్యేదశలో ఎన్నికలు రావటంతో రేసు జరగలేదు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో మొత్తం వ్యవహారమంతా వెలుగుచూసింది.
ఇక్కడే కేటీఆర్ గట్టిగా తగులుకున్నారు. ఎలాగంటే రేసు జరగకపోయినా బ్రిటన్ కంపెనీకి రు. 45 కోట్లు బదిలీచేశారు. ఎందుకు బదిలీచేశారన్నది కీలకమైన ప్రశ్న. అలాగే నిధుల బదిలీకి ఫైనాన్స్ శాఖ అనుమతి తీసుకోలేదు. క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఎన్నికల కమిషన్ అనుమతి కూడా తీసుకోలేదు. విదేశీకంపెనీలకు విదేశీకరెన్సీలో నిధులు బదిలీచేయాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి. అయితే ఆర్బీఐకి చెప్పకుండా, అనుమతి తీసుకోకుండానే హెచ్ఎండీఏ ఖాతానుండి కేటీఆర్ బ్రిటన్ కంపెనీకి నిధులను బదిలీచేయించేశారు. విదేశీకంపెనీకి నిధులు బదిలీ అయిన విషయం తెలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ రు. 8 కోట్లు జరిమానా విధించింది.
ఆర్బీఐ విధించిన జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. జరిమానా విధించింది అంటేనే తప్పుచేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లే కదా. తప్పు ఎవరివల్ల జరిగిందంటే కేటీఆర్ అధికార దుర్వినియోగం కారణంగానే అని అందరికీ అర్ధమైపోతోంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రేసు నుండి తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ నుండి బీఆర్ఎస్ కు రు. 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు పార్టీ ఫండ్ గా అందటం.
ఇక్కడే కేటీఆర్ అధికారదుర్వినియోగం చేయటంతో పాటు అవినితికి పాల్పడినట్లు ఏసీబీ, విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి, గవర్నర్ కు రిపోర్టులో చెప్పాయి. బ్రిటన్ కంపెనీకి నిధుల బదిలీని కేటీఆర్ ఆదేశాల మేరకే చేసినట్లు ఇప్పటికే అర్వింద్, బీఎల్ఎన్ రెడ్డి విచారణలో వాగ్మూలం ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. ఇదేనిజమైతే వీళ్ళద్దరు అప్రూవర్లుగా మారినట్లే అనుకోవాలి. ఒకరోజు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు తాను ఆదేశిస్తేనే అర్వింద్ బ్రిటన్ కంపెనీకి నిధులు బదిలీచేసినట్లు అంగీకరించారు. అయితే ఆ తర్వాత ఎప్పుడూ ఈ విషయమై మాట్లాడలేదు.
కేటీఆర్ వాదన ఏమిటి ?
ఏసీబీ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు కేటీఆర్ రెండుసార్లు హాజరయ్యారు. ఆసందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ‘‘ఈకేసు లొట్టపీసు కేసం’’టు చాలా తేలికగా తీసుకున్నారు. ‘‘కార్ రేసు నిర్వహణ ద్వారా హైదరాబాద్ ఇమేజీని తాను ప్రపంచస్ధాయికి తీసుకెళ్ళటానికి ప్రయత్నించి’’నట్లు సమర్ధించుకుంటున్నారు. ఒక్క రేసు నిర్వహణతోనే హైదరాబాద్ ఇమేజి ప్రపంచస్ధాయికి ఎలా చేరుతుందో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇదే నిజమైతే దశాబ్దాలుగా ఫార్ములా కార్ రేసు నిర్వహిస్తున్న దేశాలు ఎన్నని అడిగితే చాలామంది సమాధానాలు చెప్పలేరు. ఎందుకంటే ఫార్ములా కార్ రేసు మనదేశంలో పాపులర్ స్పోర్ట్ కాదు. ఒకరేసు నిర్వహించినంత మాత్రాన హైదరాబాద్ ఇమేజి ప్రపంచంలో ఏమీపెరిగిపోదు. ఈవిషయం కేటీఆర్ కు కూడా బాగాతెలిసినా తనచర్యలను సమర్ధించుకుంటున్నారంతే.
హైదరాబాద్ ఇమేజిని ప్రపంచస్ధాయికి చేర్చాలని కేటీఆర్ అనుకోవటం, ప్రయత్నాలు చేయటంలో తప్పులేదు. అయితే అందుకు అడ్డుగోలుగా అధికారదుర్వినియోగం చేయటం తప్పు. విచారణలో కేటీఆర్ ఏమిచెప్పారో తెలీదుకాని బయట మీడియాతో మాట్లాడినపుడు మాత్రం తనను ఏమి ప్రశ్నలు వేయాలో అధికారులకు తెలియలేదని, కొన్ని ప్రశ్నలను తానే అధికారులకు అందించానని ఎద్దేవా చేశారు. గంటలకొద్ది విచారణ పేరుతో కూర్చోబెట్టిన అధికారులు అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగినట్లు దర్యాప్తుసంస్ధలను కూడా బాగా చులకనగా మాట్లాడారు. విచారణను ఎంత తేలికగా తీసుకున్నా కేటీఆర్ మొహంలో అయితే టెన్షన్ పడుతున్నట్లు కనబడుతోంది. మరి గవర్నర్ ఏమిచేస్తారో చూడాల్సిందే.