KTR | ప్రజల సింపతీ కోసమే పాదయాత్ర?
పదవుల కోసమే కేటీఆర్ రోడ్డెక్కుతున్నారా..
తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ సింపతి గేమ్ స్టార్ట్ చేస్తున్నారా? తనపైన నమోదైన కేసులే ప్రధానాస్త్రాలుగా ఈ గేమ్‌లో రాణించాలని ప్లాన్ చేస్తున్నారా? అందుకే పాద యాత్రకు సన్నద్ధం అవుతున్నారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. కేటీఆర్ ఇప్పటికే ఒకటి రెండు సార్లు తాను అతి త్వరలో పాదయాత్ర చేస్తానని ప్రకటించి ఉన్నారు. కానీ ఎప్పుడు ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. అంతేకాకుండా పాదయాత్రను ఆ ప్రకటన అంతవరకే పరిమితం చేశారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ పరిస్థితి అంతగా బాగున్నట్లు కనిపించడం లేదు. ఫార్ములా ఈ-కార్ రేసు అంశం కేటీఆర్‌ను తరుముకుంటూ వస్తోంది. ఇందులో ఎలాగైనా ఆయనను విచారించాలని దర్యాప్తు సంస్థలు ఏసీబీ, ఏడీలు సైతం పోటీలు పడుతున్నట్లు నోటీసులు ఇచ్చి ఉన్నాయి. జనవరి 7న విచారణకు రావాలని ఈడీ ముందుగా నోటీసులు అందిస్తే.. ఏసీబీ మాత్రం జనవరి 6న తమ ముందు విచారణకు హాజరుకావాలని తెలిపింది. దీనిపై స్పందించిన కేటీఆర్.. న్యాయ నిపుణుల సలహాల మేరకే తాను విచారణకు వెళ్లేది లేంది ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుడా సీఎం రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పెందుకు రొడ్డు ఎక్కుతున్నాను అని ప్రకటించారు. దీంతో పాదయాత్రకు కేటీఆర్ రెడీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. కాగా ప్రజల్లో సింపతీ పొందడం కోసమే ఆయన పాదయాత్ర ప్రారంభించాలనుకుంటున్నారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.
అసలు ప్లాన్ అదేనా..!
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కోర్టు సైతం ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్చు వచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని తెలిపింది. ఇప్పుడు కోర్టు ఇచ్చే తీర్పు అంశంపై కేటీఆర్‌పై వేలాడుతున్న కత్తిలా మారింది. న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుందో తెలీదు. అరెస్ట్ అవుతారా? కారా? అనేది అంతుచిక్కడం లేదు. ఇంతలో దర్యాప్తు సంస్థలు పోటీ పడుతున్నట్లు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నాయి. అవి కూడా విచారణ జరిపి పంపేస్తాయా? లేదంటే కవితను తీసుకెళ్లినట్లు అటు నుంచి అటే జైలుకు తీసుకెళ్తారా? అనేది తెలీదు. అందుకోసమే కేటీఆర్.. పాదయాత్ర ప్లాన్ చేశారని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు వదిలి.. కోర్టు అరెస్ట్ చేయమంటే.. ఆ సమయంలో ప్రజల మధ్య ఉంటే.. పోలీసులు అక్కడకు వచ్చి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రజాక్షేత్రం నుంచి అరెస్ట్ అయి సింపతీ సంపాదించుకోవచ్చని కేటీఆర్ ప్లాన్ చేస్తుండొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.
అదే జరిగితే.. ప్రజల్లో సింపతీ సంపాదించుకుని రానున్న ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు భావిస్తున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా ఇప్పటికే కవిత, కేటీఆర్ మధ్య సీఎం ఎవరన్న పోటీ మొదలైందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అటువంటిది ఏమీ లేదని కూడా కేటీఆర్ తెలిపారు. కేసీఆరే సీఎం అని ప్రకటించారు. అలా చూసుకున్నా సింపతీ గేమ్‌తో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని తానే సిఎం కావాలని కూడా, కేసీఆర్ సీఎం అయితే మంచి మంత్రిపదవి పొందాలని కేటీఆర్ ప్లాన్ చేస్తుండొచ్చని పలువురు మేధావులు అంచనాలు వేస్తున్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూసుకుంటే పాదయాత్ర చేసిన ప్రతి నేత కూడా ఎన్నికల్లో నెగ్గారు. అదే బాటలో కేటీఆర్ కూడా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎలా చూసుకున్నా ఎండ్ ఆఫ్ ది డే.. కేటీఆర్ టార్గెట్ పదవిగానే కనిపిస్తోందే తప్ప ప్రజల సమస్యలు, ప్రజా సంక్షేమం కనిపించడం లేదని, కానీ వాటిని అడ్డుపెట్టుకునే ప్రజల్లో సింపతి సంపాదించాలని కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.