Mallu Ravi
x
image source : twitter

నాగర్ కర్నూల్ లో మల్లు రవే మళ్లీ ? హీటేక్కిస్తున్న టికెట్ల తకరారు

తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు టికెట్ల వ్యవహారం హీటెక్కిస్తోంది. ఓపెన్ కేటగిరి కంటే రిజర్వుడ్ స్థానాలకు పోటీ పెరిగింది.


తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు టికెట్ల వ్యవహారం హీటెక్కిస్తోంది. ఓపెన్ కేటగిరి కంటే రిజర్వుడ్ స్థానాలకు పోటీ పెరిగింది. 17 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్‌కు వచ్చిన మొత్తం 314 దరఖాస్తులలో 50 శాతానికి పైగా రిజర్వ్‌డ్ నియోజకవర్గాలకు చెందినవే కావడం దీనికి నిదర్శనం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క రిజర్వుడ్ సీటు కూడా గెలవలేదు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగరవేయడం, ఆదిలాబాద్‌ మినహా అన్ని రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో మంచి పనితీరు కనబరచడంతో ఆ స్థానాలకు ఆశావహుల నుంచి పోటీ ఎక్కువైంది. రాష్ట్రంలో 17 పార్లమెంటు సెగ్మెంట్లు ఉండగా అందులో ఐదు రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్ (ఎస్సీ), పెద్దపల్లి (ఎస్సీ), వరంగల్ (ఎస్సీ), ఆదిలాబాద్ (ఎస్టీ), మహబూబాబాద్ (ఎస్టీ) నియోజకవర్గాలకు 169 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో మల్లు రవి టికెట్ డిమాండ్ చేస్తున్న నాగర్ కర్నూల్ స్థానం హాట్ టాపిక్ గా మారింది.

మల్లు రవి మంతనాలు ఫలించినట్లేనా?


కాగా, ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆశిస్తున్న నాగర్ కర్నూలు పైనే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక అధిష్టానం ఆయనకి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవిని కట్టబెట్టింది. అయితే, నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలనే డిమాండ్ తో పదవికి రాజీనామా చేస్తున్నట్లు రేవంత్ రెడ్డికి లేఖను పంపారు. టికెట్ తననే వరిస్తుందని ధీమాగా ఉన్నారు. ఢిల్లీ పెద్దలతో లాబియింగ్ మొదలుపెట్టారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ లతో మల్లు విడివిడిగా భేటీ అయ్యారు. నాగర్ కర్నూల్ ఎంపీ టిక్కెట్ తనకే ఇవ్వాలని కోరడంతో పాటు.. అక్కడి ప్రజల అభిప్రాయాలు, వివిధ సర్వేల రిపోర్టులను హైకమాండ్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ పది మంది అభ్యర్థులను ఎంపిక చేసి లిస్టును హై కమాండ్ కి పంపిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన మల్లు రవి.. ఖర్గే, కేసి లతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించానని తెలిపారు. తనకి టికెట్ ఇవ్వడంపై ఏఐసీసీ కూడా సానుకూలంగా స్పందించినట్లు మల్లు రవి వెల్లడించారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకే వస్తుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. పార్టీ హైకమాండ్, ఇతర ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన సర్వేలన్నింటిలోనూ తనకే హైయెస్ట్ మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల గెలుపునకు తాను కృషి చేశానని, కాబట్టి ఆయా ఎమ్మెల్యేలంతా తనకు సహకరిస్తారని చెప్పారు. అతి త్వరలోనే టిక్కెట్ల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.


అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించేలా చర్యలు..

మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ సామాజిక న్యాయం పాటించేలా ఏఐసీసీ అధిష్టానం రాష్ట్రం నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ సీటును ఆదివాసీకి, మహబూబాబాద్‌లో లంబాడా సంఘం నేతకు ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్సీలకు రిజర్వ్ అయిన మూడు స్థానాల్లో మాల, మాదిగ వర్గాల అభ్యర్థికి ఒక్కో సీటును, మూడో సీటును మాదిగ సామాజికవర్గ మహిళకు ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, జాతీయ ఆదివాసీ నేత బెల్లయ్య నాయక్‌ తదితర నేతలు మహబూబాబాద్ రేసులో ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో నాలుగింటిని బీజేపీ గెలుచుకోవడంతో ఆదిలాబాద్‌ నుంచి గెలుపు గుర్రం కోసం హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది.

ఇక మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేయడంతో పాటు నాగర్‌కర్నూల్ నుండి పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేయడంతో నాగర్‌ కర్నూల్ సీటు రేసు కూడా వేడెక్కింది. పెద్దపల్లి సీటును కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీ అభ్యర్థిస్తున్నారు. అయితే ఇటీవల బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ బీ వెంకటేష్‌ నేత కాంగ్రెస్‌లో చేరడంతో సమీకరణాలు మారిపోయాయని అంతర్గత సమాచారం. వరంగల్‌ స్థానానికి ఆ పార్టీ మహిళా విభాగం నాయకురాలు సింగపురం ఇందిరకు ఇవ్వడంపై పార్టీలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

స్క్రీనింగ్ కమిటీ క్లియర్ చేసినట్లు చెబుతున్న అభ్యర్థుల లిస్ట్

స్క్రీనింగ్ కమిటీ క్లియర్ చేసి ఏఐసీసీకి పంపినట్లు చెబుతున్న లిస్టులో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట్ స్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి), హుస్నాబాద్ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి (కరీంనగర్), మాజీ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ (జహీరాబాద్), సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (నిజామాబాద్), హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా మహేందర్ రెడ్డి (చేవెళ్ల), కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ (మహబూబాబాద్) ఉన్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story