మోత్కుపల్లి ఎక్కడున్నా ఇంతే?
x
Motkupalli Narasimhulu

మోత్కుపల్లి ఎక్కడున్నా ఇంతే?

మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు వ్యవహారం వార్తల్లో వ్యక్తిగా నిలిచారుకాబట్టే. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కటికెట్టు కూడా ఇవ్వలేదన్న ఆగ్రహంతో దీక్ష చేశారు.


కొందరు నేతలంతే తమ పద్దతి మార్చుకోరు. నిత్యసంతృప్తులుగా మిగిలిపోతారు. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రంగా స్పందించటం, అధినేతలపైనే నోటికొచ్చింది మాట్లాడటం, పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయటం, పార్టీలో నుండి బయటకు వచ్చేయటం లేదా పార్టీ నుండి బహిష్కరణకు గురవ్వటం ఇదే జరుగుతుంటుంది. ఇపుడిదంతా ఎందుకంటే మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు వ్యవహారం వార్తల్లో వ్యక్తిగా నిలిచారుకాబట్టే. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటికెట్టు కూడా ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఒక్కరోజు దీక్ష చేశారు. మూడు ఎస్సీ రిజర్వుడు సీట్లలో కనీసం ఒక్కటైనా మాదిగలకు కేటాయించాల్సిందే అనే డిమాండుతో దీక్షచేశారు. పనిలోపనిగా తన దీక్షలోనే రేవంత్ రెడ్డిపై నోటికొచ్చింది మాట్లాడారు. నిజానికి మాదిగలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవటం అన్యాయమే. కాని అది ముగిసిన వ్యవహారమైపోయింది.

ఎందుకంటే మాదిగ సామాజికవర్గం నేతలైన గజ్జల కాంతం, పిడమర్తి రవి, వరప్రసాద్ లాంటి కొందరితో రేవంత్ రెడ్డి భేటీ అయి మాట్లాడారు. మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వని కారణాలను రేవంత్ వివరించారు. తొందరలో జరిగే నామినేటెడ్ పోస్టుల్లో న్యాయంచేస్తానని హామీ ఇచ్చారు. రేవంత్ వివరణతో, హామీలతో మాదిగ సామాజికవర్గం నేతలు కూడా సంతృప్తిచెందారు. సో, ఈ సమయంలో మళ్ళీ మాదిగలకు టికెట్టనే డిమాండ్ పై మోత్కుపల్లి దీక్షచేయటంలో అర్ధమేలేదు. ఇక్కడ విషయం ఏమిటంటే మాదిగ కోటాలో తాను టికెట్ తీసుకుని పోటీచేయాలని అనుకున్నారు. అయితే ఆ కోరిక నెరవేరకపోవటంతో నానా గోల మొదలుపెట్టారు. ఇపుడే కాదు మోత్కుపల్లి వ్యవహార మొదటినుండి ఇంతే. తాను అనుకున్నది జరగకపోయినా, అధినేతలు తనకు ప్రాధాన్యత ఇవ్వటంలేదని అనిపించినా వెంటనే మోత్కుపల్లి నోటికిపనిచెప్పేస్తారు.

మోత్కుపల్లి చరిత్ర

తెలంగాణాలోని ఉమ్మడి నల్గొండ జిలా ఆలేరు మోత్కుపల్లి సొంత నియోజకవర్గం. 1983లో టీడీపీ టికెట్ దక్కకపోవటంతో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలిచారు. దాంతో మోత్కుపల్లిని ఎన్టీయార్ పార్టీలో చేర్చుకున్నారు. 1985లో జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్ధిగా గెలిచారు. 1989లో టికెట్ దక్కకపోవటంతో ఇండిపెండెంటుగా పోటీచేసి మళ్ళీ గెలిచారు. మళ్ళీ టీడీపీలో చేరి 1994 ఎన్నికల్లో గెలిచారు. తర్వాత అధినేతతో పడనికారణంగా కాంగ్రెస్ లో చేరి 1999లో మళ్ళీ గెలిచారు. అంటే 1983లో ఇండిపెండెంటుగా మొదలైన మోత్కుపల్లి ఎంఎల్ఏ ప్రస్ధానం అనేకమలుపులు తిరిగి 2004 ఎన్నికల్లో ఓడిపోవటంతో బ్రేక్ పడింది. 1999లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన తర్వాత పార్టీతో పడనికారణంగా మళ్ళీ టీడీపీలో చేరారు. 2008 ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆలేరు నుండి తుంగతుర్తికి మారారు.

2009లో టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన మోత్కుపల్లి 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ ఎన్డీయేలో ఉండేది. తనకు గవర్నర్ పోస్టు ఇప్పించాలని పదేపదే చంద్రబాబునాయుడు వెంటపడ్డారు మోత్కుపల్లి. తనకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని హామీఇచ్చారు కాబట్టి ఇప్పించాల్సిందే అంటు నానా గోలచేశారు. తర్వాత టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తుపెట్టుకోవాల్సిందే అంటు దీక్ష కూడా చేశారు. దాంతో ఈయన గోల భరించలేక టీడీపీ బహిష్కరించింది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మోత్కుపల్లికి ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2019, నవంబర్లో బీజేపీలో చేరారు. పార్టీలో ఇమడలేక 2021, జూలైలో రాజీనామాచేసి బయటకు వచ్చేశారు. తర్వాత 2021, అక్టోబర్లో బీఆర్ఎస్ లో చేరారు. తర్వాత పదవులకోసం నానా గోలచేసి లాభంలేదని తేలటంతో వేరేదారిలేక 2023, అక్టోబర్లో రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.

ఢిల్లీలోనే ఎందుకు చేరారు ?

బీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీకి వెళ్ళి పార్టీలో ఎందుకు చేరారంటే రేవంత్ రెడ్డితో మోత్కుపల్లికి ఏమాత్రం పడదనే ప్రచారం తెలిసిందే. టీడీపీలో ఉన్నప్పటినుండే ఇద్దరిమధ్యా బాగా వైరముండేదని తమ్ముళ్ళు చెప్పుకునేవాళ్ళు. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోత్కుపల్లి టికెట్ ఆశించినా ఉపయోగంలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంఎల్ఏ టికెట్ అయినా ఎంపీ టికెట్ అయినా ముఖ్యమంత్రి చేతిలో ఉండేది కొంతవరకే. ముఖ్యమంత్రయినా అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందే. ఇపుడు మాదిగలకు ఒక్క టికెట్టు కూడా దక్కలేదంటే అందులో రేవంత్ పాత్ర పరిమితమనే చెప్పాలి. అయితే మోత్కుపల్లి మాత్రం తనకు టికెట్ దక్కకుండా రేవంతే అడ్డకున్నారంటు గోలచేస్తున్నారు. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా ఇలాగే వ్యవహరిస్తుంటారని. ముఖ్యమంత్రి మీద నాయకత్వం మీద గోల మొదలుపెట్టిన మోత్కుపల్లి ఎంతకాలం కాంగ్రెస్ లో ఉంటారో చూడాలి. విషయం పరిజ్ఞానం ఉండి, ఫైర్ బ్రాండ్ గా పాపులరైన మోత్కుపల్లిపై నిత్యసంతృప్తి వాదిగా ముద్రపడింది. ఒక్కరోజు దీక్షచేసిన మోత్కుపల్లి తర్వాత ఏమిచేస్తారో చూడాలి.

ఇదే విషయమై కాంగ్రెస్ లోని సీనియర్ నేత గజ్జల కాంతం తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదన్నది వాస్తవమే అన్నారు. అయితే అందుకు రేవంత్ రెడ్డి చెప్పిన వివరణను తామంతా నమ్ముతున్నట్లు చెప్పారు. ఎన్నికలైపోయిన తర్వాత మాదిగలకు న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. మోత్కుపల్లి దీక్షపై అడిగిన ప్రశ్నకు నో కామెంట్ అన్నారు. తనకు టికెట్ రాకుండా రేవంత్ అడ్డుపడుతున్నారన్న మోత్కుపల్లి ఆరోపణలను గజ్జల కాంతం కొట్టిపారేశారు.

Read More
Next Story