నల్లగొండ జిల్లా చిన్న పిల్లల అమ్మకాల అంగడిగా మారుతున్నదా?
x
కొన్న పిల్లలను అప్పగించాలని సూర్యాపేటలో ధర్నా చేస్తున్న వాళ్లని కొన్న తల్లిదండ్రులు

నల్లగొండ జిల్లా చిన్న పిల్లల అమ్మకాల అంగడిగా మారుతున్నదా?

ఇంకా పరిస్థితి మారలేదా? మళ్లీ వెలుగు చూస్తున్న చిన్నపిల్లల అమ్మకాలు..


ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్ళీ వెలుగు చూస్తున్న చిన్న పిల్లల అమ్మకాలు ఆందోళనలు గురిచేస్తున్నాయి. గతంలో చిన్న పిల్లల అమ్మకాలకు అంగడిగా పేరు పొందిన నల్లగొండ జిల్లాలో పరిస్థితులు మారలేదా? అనే అనుమానం కలుగుతుంది.

ఇటీవల జరిగిన చిన్న పిల్లల అమ్మకాలలో మధ్య వర్తులే పిల్లలు లేని దంపతులను అప్రోచ్ కావటం, ఒక కేసు లో మహిళా డాక్టర్ మధ్యవర్తిగా వ్యవహరించటం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. అధికారులు అక్రమ దత్తత గా చెబుతున్న కొన్ని కేసులలోను భారీగా డబ్బులు మారిన విషయం బయటకు వచ్చింది. సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన 10 మంది పిల్లల విక్రయంలో సంతానం లేని దంపతులు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు చెల్లించినట్లు పోలీసురుల విచారణలో తేలింది. గ్రామంలోని ఎవరో ఒకరు సమాచారం ఇచ్చే వరకు అక్రమ దత్తత విషయం అటు పోలీసులకు కానీ, ఇటు శిశు సంక్షేమ శాఖ అధికారులకు సైతం తెలియటం లేదు. ఇది గ్రామా స్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బంది పనితీరుకు నిదర్శనం.

నిబంధనల ప్రకారం మహిళ గర్భధారణ సమయం నుండి పాప పుట్టిన తర్వాత కూడా అంగన్వాడి సిబ్బంది ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇది పుట్టిన పాప మిస్ అయితే వెంటనే తెలుసుకోవడానికి వీలవుతుంది.

పెరుగుతున్న సంతానం లేమి సమస్య కూడా చిన్న పిల్లల అమ్మకాలు పెరగడానికి ఒక కారణం కావచ్చు Central Adoption Resource Authority (CARA) నిబంధనల ప్రకారం చిన్న పిల్లలను దత్త తీసుకోవాలంటే ఉన్న కఠిన నిబంధనలు వల్ల సంతానలేని దంపతులు చిన్నపిల్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్న పది మంది పిల్లల కొనుగోలు లో గ్రామాలలో తిరుగుతూ కోడిగుడ్లు అమ్ముకునే జంట మధ్యవర్తులుగా పనిచేశారు గ్రామాల్లోని సంతానం లేని దంపతులను గుర్తించి వారి వివరాలను చిన్నపిల్లల అమ్మక ముఠాకు చేరవేశారు. ఇంత జరుగుతున్న దీన్ని జిల్లా యంత్రాంగం గుర్తించలేకపోయింది. బాలుడుని కొనుగోలు చేసిన దంపతులు తాము పొందిన బాలుడు అనారోగ్యం పాలవడంతో, మరొక బాలుడిని ఇవ్వాలని పిల్లల అమ్మకముఠా కోరారు. వారు తిరస్కరించడంతో టేకుమట్ల గ్రామానికి చెందిన ఆ దంపతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిన్నపిల్లల అమ్మక వ్యవహారం బయటకు వచ్చింది.

నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం ఎల్లాపురం తండాలో 10 రోజుల ఆడపిల్లను అమ్మేసిన సంఘటన మరింత ఆందోళనకర విషయాలను బహిర్గతం చేసింది. ఈ సంఘటనలో ఒక మహిళా వైద్యురాలు మధ్యవర్తిగా వ్యవహరించారు.

కెసిఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు సమాజంలో మార్పులు తెచ్చి చిన్నపిల్లల అమ్మకాలను అడ్డుకోవడమే అని గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉదర కొట్టు ప్రచారం చేసింది. మరి ప్రస్తుతం జరుగుతున్న చిన్నపిల్లల అమ్మకాలు ఈ పథకాల లక్ష్యాలను నెరవేర్చినట్లు కనిపిస్తుంది.

మారిన పరిస్థితుల దృష్ట్యా గిరిజన కుటుంబాలలో పేదరికమే ఆడపిల్లల అమ్మకానికి పాత వాదనను పరిశీలించాల్సిన అవసరం ఉంది. పిల్లలను పెంచలేక పోతే పేద గిరిజనులు వారిని శిశు గృహ కు అప్పజెప్పవచ్చు. కానీ ఎందుకు లక్షల్లో డబ్బులు తీసుకొని పిల్లల్ని ఇతరులకు అమ్ముతున్నారు. ఈ పరిస్థితి సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న చిన్న చూపును తొలగించాల్సిన అవసరం ఇంకా ఉందని స్పష్టం చేస్తుంది.


నల్గొండ జిల్లా శిశు సంరక్షణ అధికారి కాసాని గణేష్ మాట్లాడుతూ సంరక్షించిన పిల్లలను జిల్లా కేంద్రం లోని శిశు గృహాల్లో ఉంచటం జరుగుతుందన్నారు. రక్షించిన పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి నిబంధనల ప్రకారం పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ పిల్లల్ని అమ్మే ఉద్దేశం ఉన్నవారు గర్భధారణ తర్వాత అంగన్వాడీ కేంద్రంలో పేరును నమోదు చేసుకోవడం లేదు. దీనివల్ల చిన్నపిల్లల అమ్మకాలను అడ్డుకోవడంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుందని ఆమె అన్నారు. చట్టానికి విరుద్ధంగా చిన్నపిల్లలను దత్తత ఇచ్చినా, తీసుకున్నా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.

పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచుకట్ల సుభాష్ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి మాత్రమే పిల్లల అమ్మకాలకు కారణం కాదని, సామాజిక కోణంలో సైతం దీనిని విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు.


Read More
Next Story