‘పోచంపల్లి’ వైభవం కోల్పోతోందా ?
పోచంపల్లి చీరల వైభవాన్ని ఎంతమంది ఎంతగొప్పగా చెప్పుకున్నా ఖరీదుచేసి కట్టుకునేది మాత్రం కొంతమందే.
ఒకపుడు పోచంపల్లి చీరలు కట్టుకోవటాన్ని చాలామంది ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. పోచంపల్లి చీరల వైభవాన్ని ఎంతమంది ఎంతగొప్పగా చెప్పుకున్నా ఖరీదుచేసి కట్టుకునేది మాత్రం కొంతమందే. అదికూడా అధికాదాయ వర్గాలు మాత్రమే. ఎందుకంటే ఈ చీరలంటేనే చాలా ఖరీదైన వ్యవహారం. పోచంపల్లిలో తయారయ్యే చీరలు నూరుశాతం పట్టుతో మాత్రమే తయారవుతాయి. కాబట్టి పోచంపల్లి పట్టుచీరలంటే మగువలకు ఎంతో ప్రీతి. ఇంత ప్రఖ్యాతిచెందిన చీరలు కాబట్టే పోచంపల్లి చీరను ఒక్కటైనా కొనుక్కోవాలని అనుకోని ఆడవాళ్ళుండరంటే అతిశయోక్తికాదు. ఈ చీరను కట్టుకోవాలని ఎంత కోరికున్నా దాని ధర చూసిన తర్వాత ఆడవాళ్ళని వెనకడుగు వేయిస్తుంది. చీరల్లో కంచి పట్టుచీరలకు ఎంతటి పాపులారిటి ఉందో పోచంపల్లి చీరలూ కూడా అంతే ఫేమస్.
అయితే కాలంతో పోటీపడలేక పోచంపల్లి చీరల వైభవం మసకబారిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే ఈ చీరల ధరలు చాలా ఖరీదు కావటం, వీటికి ఇమిటేషన్ డిజైన్లు వచ్చేయటం, తక్కువధరల్లో నాణ్యమైన చీరలు అందించలేకపోవటం, దీనికి పోటీగా అనేక రకాల చీరలు మార్కెట్ ను ముచ్చేత్తేయటమే. ఇదే సమయంలో చేతిమగ్గాలకు ప్రభుత్వ ఆదరణ కూడా తగ్గిపోవటంతో మగ్గంనేసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోతోంది. కొన్ని సంవత్సరాలుగా చేతిమగ్గాల(హ్యాండ్ లూమ్) స్ధానంలో మరమగ్గాలు(పవర్ లూమ్స్) పెరిగిపోతుండటం కూడా పోచంపల్లి పట్టుచీరలకు పెద్ద సమస్యగా మారింది. అందుకనే ఒకపుడు అంటే 2005 ప్రాంతంలో పోచంపల్లి గ్రామంలో 13 వేలుండే చేతిమగ్గాల సంఖ్య ఇఫుడు 3 వేలకు తగ్గిపోయింది. ఇపుడు చేతిమగ్గాల ద్వారా పోచంపల్లి పట్టుచీరలను నేస్తున్న కుటుంబాల్లో ఇప్పటి తరం వాళ్ళలో మగ్గంనేయటంపై ఆసక్తి కనబడటంలేదు. చదువుకున్న తర్వాత ఉద్యోగాల్లోనో లేకపోతే ఇతరత్రా వ్యాపారాల్లో స్ధిరపడుతున్నారే కాని మగ్గంనేయటంపైన మాత్రం ఆసక్తి చూపటంలేదు. ఇదే సమయంలో మగ్గాలు నేస్తున్న పెద్దవాళ్ళు తమ వారసులను చేనేత రంగానికి దూరంగా ఉంచుతున్నారు. ఎందుకంటే చేనేతరంగంలో బతుకు, భవిష్యత్తు రెండు లేదు కాబట్టే.
పోచంపల్లి-భూదాన్ పోచంపల్లి
ఒకపుడు నల్గొండ ఇప్పటి యాద్రాద్రి-భువనగిరి జిల్లా పరిధిలోకి వచ్చే పోచంపల్లి సుమారు 73 ఏళ్ళక్రితం చిన్న కుగ్రామం. స్ధానిక దేవత పోచంపల్లి పేరుతో వెలసిన గ్రామమే మెల్లిగా పోచంపల్లి గ్రామంగా ప్రసిద్ధిచెందింది. పోచంపల్లిలో పుట్టిన వినోబాభావే భూదానోధ్యమాన్ని ప్రారంభించారు. భూమిలేని నిరుపేదలకు ముఖ్యంగా హరిజనులకు భూమిని దానంచేసి ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో వినోబా దేశమంతా భూదానోద్యమం చేశారు. ఇందులో భాగంగానే 1951 స్వగ్రామానికి వచ్చినపుడు కమ్యూనిస్టు ఉద్యమకారులతో సమావేశమయ్యారు. అప్పుడు భూదానోద్యమం గురించి మాట్లాడారు. పేదలకు పంచటానికి ప్రభుత్వ భూమిలేదని తేలిపోవటంతో అక్కడున్న భూస్వాముల్లో ఒకరైన వెదిరే రామచంద్రారెడ్డి తనకున్న 3500 ఎకరాల్లో వంద ఎకరాలను దానంచేశారు. తర్వాత మరో 800 ఎకరాలను కూడా దానంగా ఇచ్చారు. అప్పుడు వినోబా ఆ 900 ఎకరాలను తీసుకుని భూమిలేని పేదలకు, హరిజనులకు పంపిణీచేశారు. అప్పటినుండే పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా పాపులరైంది.
పోచంపల్లిలో చేనేత ద్వారా పట్టుచీరలను నేయటం మొదలుపెట్టింది పద్మశాలి సామాజికవర్గానికి చెందిన సీత నర్సింహ, కర్నాటి అనంతరాములు, సీత సోమయ్య కుటుంబాలు. మొదట్లో తేలియా రుమాలు, తుండుగుడ్డలు(టవల్స్) దుప్పట్లు నేసేవారు. తర్వాత్తర్వాత పట్టుచీరలను నేయటం కూడా మొదలుపెట్టారు. నేయటం కూడా మామూలు పద్దతిలో కాకుండా టై అండ్ డై (ఇక్కత్) అనే పద్దతిలో నేయటంతో తొందరలోనే చాలా పాపులరైంది. ఇక్కత్ అన్న పదం ఇండోనేషియాది. ఆ దేశంలో ఇక్కత్ పద్దతిలో పట్టుచీరలనే నేసేవారు. దాన్నే మనదేశంలోకి తీసుకొచ్చి పోచంపల్లిలో స్ధిరపరిచారు. పట్టుదారం తీయటం మొదలుకొని, పట్టునేయటం, రంగులు తయారుచేయటం, డిజైన్లు రెడీచేసుకోవటం, ఆ డిజైన్లకు రంగులు అద్దటం, రంగుల డిజైన్లను పట్టుదారాలపైకి ఎక్కించటం లాంటి 20 రకాల దశలను దాటితే కాని ఒక పట్టుచీర తయారవ్వదు. అన్నీ దశలను కలుపుకునే టై అండ్ డై అనంటారు. ఇవన్నీ కూడా పూర్తిగా చేతితోనే చేస్తారు. అందుకనే ఒక పట్టుచీర తయారవ్వాలంటే వారంరోజులు పడుతుంది. నూరుశాతం చేతితోనే పట్టుచీరను నేస్తారు కాబట్టే ఆ చీరకు అంతటి నాణ్యతుంటుంది, అంతటి ధరుంటుంది. చేనేత కార్మికుల శ్రమ తెలిసిన వాళ్ళే ఖరీదైనా పోచంపల్లి చీరలను కొనుగోలు చేస్తారు. శ్రమ తెలిసినా అంతటి ఖరీదు పెట్టలేని వాళ్ళు చూసి ఆనందిస్తారు.
పై మూడు కుటుంబాలతో మొదలైన పోచంపల్లి పట్టుచీరల నేత పరిశ్రమ ఒకపుడు బ్రహ్మండంగా వెలిగింది. ఎప్పుడైతే పోచంపల్లి పట్టుచీరల డిజైన్లకు నకిలీలు తయారవ్వటం మొదలైందో అప్పటినుండే ఈ చీరలకు ఆదరణ తగ్గటం మొదలైంది. ఉదాహరణకు చెప్పాలంటే పోచంపల్లి పట్టుచీర ధర సుమారు 25 వేలుంటుందని అనుకుందాం. ఇదే డిజైన్ తో తయారైన మరో చీర(ఇమిటేషన్) ఖరీదు 1-2 వేల రూపాయల్లోనే దొరికేస్తోంది. అంటే 25 వేల రూపాయలు పెట్టికొన్న చీరకు, 1-2 వేల రూపాయల్లో దొరికే చీరకు తేడా ఉండదు. బట్టలో నాణ్యత తప్ప ఇంకెందులోను తేడా కనిపించకపోవటంతో చాలామంది ప్రత్యామ్నాయ చీరలను కొనటం మొదలుపెట్టారు. చూడగానే మామూలు చీర కూడా పోచంపల్లి చీరలాగే ఉంటుంది. ఇలాంటి ఇమిటేషన్ చీరల తయారీకి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ బాగా పాపులర్. అందుకనే పోచంపల్లిలో నేత కార్మికులు వారంరోజులు కష్టపడి ఒకచీర నేస్తే అదే డిజైన్ తో సూరత్ లో రోజుకు వందల చీరలు తయారవుతాయి. సూరత్ లో తయారయ్యే ఇమిటేషన్ చీరలు దేశంమొత్తాన్ని ముంచెత్తటంతో ఆ చీరలను జనాలు కొనటం మొదలుపెట్టారు. దాంతో పోచంపల్లి పట్టుచీరలకు డిమాండ్ తగ్గిపోయి ఆదరణ పడిపోయింది.
ఆరు లేదా నాలుగు పోగుల పట్టుతో 700 గ్రాములు బరువుండే పోచంపల్లి పట్టుచీర ధర తక్కువలో తక్కువ 7 వేల రూపాయలుంటుంది. ఇన్ని వేలరూపాయలు పెట్టి ఎంతమంది ఒకచీరను కొనగలరు ? పోచంపల్లిలో తయారయ్యే పట్టుచీలకు ముడిపట్టు మొత్తం బెంగుళూరు నుండి వస్తుంది. రంగులు, డిజైన్లు మొత్తాన్ని ఇక్కడి చేనేతలే సిద్ధం చేసుకుంటారు. పవర్ లూమ్ తో తయారయ్యే 200 గ్రాముల బరువుండే చీర 400కే దొరుకుతోంది. బరువులో ఏముంది ధరలో ఇంత తేడా ఉన్నపుడనుకుని చాలామంది రు. 400 ధరుండే చీరనే కొనేస్తున్నారు.
ఇదే విషయాన్ని యాద్రాద్రి-భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అంకం పాండు తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు తొందరలోనే పోచంపల్లి చీరల వైభవం అంతరించిపోతుందన్నారు. పట్టుచీరలు నేయటం అంత లాభసాటి కాకపోవటంతో ఇప్పటి తరాన్ని పెద్దవాళ్ళు చేనేత రంగానికి దూరంగా ఉంచుతున్నట్లు చెప్పారు. ఒకపుడు 13 వేల మగ్గాలతో కళకళలాడిన పోచంపల్లిలో ఇపుడు 3 వేల మగ్గాలుంటే ఎక్కువన్నారు. తాము తయారుచేసే చీరలు బాగా ఖరీదైనవి కావటంతోనే చాలామంది కొనటానికి వెనకాడుతున్నట్లు చెప్పారు. చీర తయారీలో తాము వాడే టై అండ్ డై పద్దతి, తాముపడే శ్రమ అంతా లెక్కేసుకుంటే అంతటి ఖరీదు పెడితేకాని గిట్టుబాటు కాదన్నారు. నకిలీ చీరలు పోచంపల్లిని ఒక రకంగా దెబ్బతీస్తే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఆన్ లైన్ షాపింగ్ వల్ల మరోరకమైన దెబ్బ పడిందని వాపోయారు. మరికొన్ని సంవత్సరాల తర్వాత పోచంపల్లి పేరుమాత్రమే ఉంటుందేమో కాని ఇక్కడ తయారయ్యే పట్టుచీరలు కనబడకపోవచ్చన్నారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప పోచంపల్లి బతకదని బాధతో చెప్పారు.
ఇదే విషయమై హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్సటైల్స్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు చేనేతలను ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు. అందుకనే ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగులు వాడే యూనిఫారంను నూరుశాతం హ్యాండ్ లూమ్స్ (టిస్కో) సొసైటీల నుండే కొనాలని నిబంధన పెట్టినట్లు చెప్పారు. చేనేతలకు ఏడాది పొడవునా చేతినిండా పనికల్పించి తగిన ఆదాయాలను అందించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. టిస్కో సొసైటీ నుండి తప్ప ఇంకెక్కడా అవసరమైన వస్త్రాలను కొనేందుకు లేదని మార్చి 11వ తేదీన జీవో కూడా ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని(ఐఐహెచ్టి) ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని అడిగినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కృషివల్లే ఐఐహెచ్ టిని కేంద్రం మంజూరుచేసిందన్నారు.
ఐఐహెచ్ టి ద్వారా విద్యార్దులకు అవసరమైన శిక్షణ ఇప్పించటంతో పాటు సాంకేతిక పరిజ్ఙానం, టెక్స్ టైల్ డిజైనింగ్, అప్పారల్ డిజైనింగ్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ రంగాల్లో శిక్షణ ఇప్పించబోతున్నట్లు చెప్పారు. హ్యాండ్ లూమ్ సొసైటీలను బలోపేతం చేసే విషయాన్ని కూడా తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటుచేయటం ద్వారా చేనేతలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.