రాజాసింగ్‌కు గాలం వేస్తున్న పొన్నం ప్రభాకర్..?
x

రాజాసింగ్‌కు గాలం వేస్తున్న పొన్నం ప్రభాకర్..?

రాజాసింగ్.. బీజేపీకి రాజీనామా చేయడంతో ఆయనను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడానికి పొన్నం ప్రభాకర్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటా?


రాజాసింగ్ రాజీనామాపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో సరికొత్త చర్చకు దారితీశాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను హస్తం పార్టీలోకి లాగడానికి పొన్నం గాలం వేస్తున్నారా అన్న వాదనలకు తెరలేపాయి. రాజా సింగ్‌ రాజీనామాపై స్పందించిన పొన్నం ప్రభాకర్.. బీజేపీ అధిష్టానంపై ఘాటు విమర్శలు గుప్పించారు. బీసీ నేతలంటే బీజేపీ గిట్టదని మరోసారి తేటతెల్లమయిందన్నారు పొన్నం ప్రభాకర్. బలహీన వర్గాలను బీజేపీ పట్టించుకోదని విమర్శించారు. బీజేపీ అంటే బీసీ వ్యతిరేక పార్టీ అని మరోసారి స్పష్టమైందని, బీసీ నేత కావడం వల్లే రాజాసింగ్ రాజీనామాను జేపీ నడ్డా వెంటనే ఆమోదించారంటూ ఆరోపించారు పొన్నం. రాజాసింగ్ రాజీనామాతో బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని పొన్నం దుయ్యబట్టారు.

బీజేపీ.. బీసీ వ్యతిరేకానికి ఇవే నిదర్శనం..

‘‘ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా, గతంలో బండి సంజయ్‌ను అకారణంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించడం లాంటి నిర్ణయాలు చూస్తే.. ఆ పార్టీ బలహీనవర్గాల వారిని పట్టించుకోదని అర్థమైపోతుంది. బీసీలను పక్కనబెట్టి అగ్రకులాల వారికే అధ్యక్ష పదవులను కట్టబెట్టడం మరో ఉదాహరణ’’ అని అన్నారు.

అయితే పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల్లో కొన్ని విషయాలపై విశ్లేషకులు స్పందిస్తూ.. ‘‘గతంలో ఒక్క మాట చెప్పకుండా బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. ఆ పదవిలోకి అగ్రకుల నాయకుడు అయిన కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన స్థానంలో మరో అగ్రకుల నేతనే నియమించారు. అదే విధంగా రాజాసింగ్ విషయంలో కూడా మాట్లాడాలని, కొన్ని కీలక విషయలు పంచుకోవాలి సమయం ఇవ్వండి అని అడిగినా ఇవ్వలేదు. రాజీనామాను మాత్రం వెంటనే ఆమోదించారు. కాబట్టి ఒక కోణంలో చూస్తే పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు వాస్తవమే అనిపిస్తుంది’’ అని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పొన్నం వ్యాఖ్యలు రాజాసింగ్‌కు గాలమేనా..!

ఈ క్రమంలోనే అసలు తమకు సంబంధం లేని అంశంలో తలదూర్చి.. రాజాసింగ్‌కు మద్దతుగా పొన్నం ప్రభాకర్ మాట్లాడటం ప్రస్తుతం కీలకంగా మారింది. ఆయన రాజాసింగ్‌కు అంత మద్దతుగా ఎందుకు నిలుస్తున్నారు? అన్న ప్రశ్న వినిపిస్తోంది. రాజాసింగ్.. బీజేపీకి రాజీనామా చేయడంతో ఆయనను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడానికి పొన్నం ప్రభాకర్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటా? అన్న వాదన వినిపిస్తోంది. విశ్లేషకులు మాత్రం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు. అందుకు వాళ్లు కూడా కొన్ని బలమైన కారణాలే చెప్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. తన నియోజకవర్గంలో రాజాసింగ్‌కు ఉన్న ఫాలోయింగ్, ప్రజారణ చాలా ఎక్కువ. అలాంటి నేత తమ పార్టీలో చేరితే తమకున్న సీట్ల బలానికి మరోక అంకె చేరినట్లేనని, ఓటు బ్యాంకు కూడా పెరిగినట్లే అవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని, అందుకే రాజాసింగ్‌ను పార్టీలోకి తీసుకురావడానికి పొన్నం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

Read More
Next Story