ప్రతిపక్షాలకు రేవంతే జీవం పోస్తున్నాడా ?
x
Revanth Reddy

ప్రతిపక్షాలకు రేవంతే జీవం పోస్తున్నాడా ?

ప్రతిపక్షాలు పుంజుకుని జవసత్వాలు కూడదీసుకునేందుకు రేవంత్ రెడ్డే అస్త్రాలు ఇచ్చాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉద్యమాలు, ఆందోళనలు చేయటం చాలా సహజం. అయితే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు చేయాల్సినంత అవసరం ప్రతిపక్షాలకు ఇంతకాలం రాలేదు. కారణం ఏమిటంటే ప్రభుత్వం ఏర్పిడింది తొమ్మిది నెలల క్రితమే కాబట్టి. అయితే రొట్టె విరిగి నేతిలో పడినట్లుగా రేవంత్ తీసుకున్న రెండు నిర్ణయాలు ప్రతిపక్షాలకు జీవం పోస్తున్నట్లుగానే ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన పార్టీ నెరవేర్చటంలేదన్నది ప్రతిపక్షాలు ఎప్పుడూ చేసే ఆరోపణలే. నిజానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నూరుశాతం ఎప్పుడూ నెరవేర్చవు. ఈ విషయం జనాలకు కూడా బాగా తెలుసు.

అనేక హామీల్లో కొన్నిమాత్రమే చాలా కీలకంగా ఉంటాయి. అలాంటి కీలకమైన హామీలే సిక్స్ గ్యారెంటీస్. ఇందులో మహిళలకు నెలకు రు. 2500 పెన్షన్ అనే హామీని తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం, సబ్సిడీ ధరలకు గ్యాస్ బండలు, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచటం, రైతురుణమాఫీ హామీలను ప్రభుత్వం దాదాపు నెరవేర్చిందనే అనుకోవాలి. రైతురుణమాఫీ విషయంలో మాత్రమే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇందులో కూడా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు రైతాంగం నుండి పెద్దగా సానుకూలత రావటంలేదు.

అందుకనే ఏమిచేయాలో తెలీక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు తదితరులు రాజకీయ ఆరోపణలు, విమర్శలతో కాలం గడిపేస్తున్నారు. ఇక బీజేపీ విషయం చూస్తే కమలనాదుల్లో చాలామంది ప్రభుత్వంపై మీడియాలో మాత్రమే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. క్షేత్రస్ధాయిలో చెప్పుకోతగిన ఆందోళనల్లాంటివి ఏమీ చేయలేదు. పార్టీలో సమన్వయలేమి, అంతర్గత సమస్యలతోనే కమలనాదుల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. పైగా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే నాదుడు లేకపోవటంతో నేతలు తలోదారిగా నడుస్తున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే రేవంత్ తీసుకున్న రెండు నిర్ణయాలు ప్రతిపక్షాల్లో చురుకుపుట్టించింది. ఇంతకీ ఆ నిర్ణయాలు ఏమిటంటే జలవనరులను రక్షించి యధాతథస్ధితికి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో రేవంత్ హైడ్రాను ఏర్పాటుచేశారు. దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఏవీ రంగనాధ్ ను కమీషనర్ కు నియమించి అవసరమైన జవసత్వాలను స్టేజ్ బై స్టేజ్ ఏర్పాటుచేస్తున్నారు. జలవనరులంటే చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమణల చెరనుండి విడిపించటమే. ఆక్రమణల చెరనుండి విడిపించటం అంటే అక్రమనిర్మాణాలను కూల్చేసి జలవనరులను కాపాడటమే. ఇపుడు హైడ్రా చేస్తున్నది అదే. ఇప్పటివరకు 269 అక్రమనిర్మాణాలను కూల్చేసి కబ్జాకు గురైన స్ధలాలను తిరిగి స్వాధీనంచేసుకుని సంబంధిత శాఖలకు అప్పగిస్తోంది. ఎప్పుడైతే నిర్మాణాలను కూల్చేస్తోంది ఆటోమేటిక్కుగా బాధితులు రోడ్డెక్కుతున్నారు. మూసీనది సమస్యతో పోల్చితే హైడ్రా సమస్య చిన్నదనే చెప్పాలి.

బాధితులు ఎంత గోలచేస్తున్నా హైడ్రా పట్టించుకోకపోవటంతో వేరేదారిలేక వాళ్ళంతా బీఆర్ఎస్, బీజేపీ నేతల దగ్గరకు వెళుతున్నారు. ఇందులో కూడా బీఆర్ఎస్ చాలా స్పీడుగా స్పందించటంతో బాధితుల్లో ఎక్కువమంది బీఆర్ఎస్ ఆఫీసు తెలంగాణా భవన్ కు క్యూ కడుతున్నారు. శుక్ర, శనివారాల్లో బాధితులతో మాజీ మంత్రి హరీష్, సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు సమావేమై భరోసా ఇచ్చారు. వీళ్ళు ప్రభుత్వాన్ని అడ్డుకోలేకపోయినా బాధితులకు కాస్త మాటసాయం చేసి భరోసా కల్పించటంలో సక్సెస్ అయ్యారు. ఇదే సమయంలో బీజేపీ తరపున మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాస్త యాక్టివ్ గా ఉన్నారు. తనను కలుస్తున్న బాధితులతో మాట్లాడటమే కాకుండా స్వయంగా బాధితుల దగ్గరకు వెళ్ళారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీడియాలో ఆరోపణలు, హెచ్చరికలకే పరిమితమయ్యారు.

ఇక హైడ్రాకు మించిన సమస్య మూసీనది సుందరీకరణ రూపంలో బాధితులను భయపెడుతోంది. 57 కిలోమీటర్ల పరిధిలోని మూసీనదిని సుందరంగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. మురికికూపంగా తయారైన మూసీని సుందరంగా తీర్చిదిద్దాలంటే నదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలు, నిర్మాణాలను తొలగించాలి. నదికి రెండువైపులా 15 వేల నిర్మాణాలున్నట్లు అధికారులు సర్వేచేసి రేవంత్ కు రిపోర్టిచ్చారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 30 లక్షలకు పైగా జనాలు సంవత్సరాలుగా నివాసముంటున్నారు. వీళ్ళందరినీ ఉన్నపళంగా ఖాళీ చేయించటం మామూలు విషయంకాదు.

అందుకనే ముందుగా తరలించాల్సిన ఇళ్ళకు అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. బాధితులకు నచ్చచెప్పి అక్కడినుండి ఖాళీచేసేట్లుగా అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే చాలామంది అధికారులు చెబుతున్న మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో మార్కింగ్ చేసేటపుడు, చర్చలు జరిపేటపుడు పెద్ద గొడవలవుతున్నాయి. అయినా ప్రభుత్వం ఒకసారి తలచుకుంటే వెనక్కుపోవటం అంటూ ఉండదు. నిర్ణయాన్ని అమలుచేయటంలో కాస్త ఆలస్యం అయితే అవుతుందంతే. ఈ విషయం తెలుసుకాబట్టే బాధితులు తెలంగాణా భవన్ కు వెళ్ళి హరీష్, సబితలతో తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఒకవైపు హైడ్రా, మరోవైపు మూసీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లే ఉంది.

జరుగుతున్నది గమనించిన తర్వాత ప్రతిపక్షాలు పుంజుకుని జవసత్వాలు కూడదీసుకునేందుకు రేవంత్ రెడ్డే అస్త్రాలు ఇచ్చాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీలు పుంజుకునేందుకు ప్రతిపక్షాల నేతలు మూసీనది పరీవాహక ప్రాంతాల్లోను, హైడ్రా కూల్చివేతలు జరుగుతున్న ఏరియాల్లో పర్యటనలు పెట్టుకున్నారు. ఎలాగూ నేతలు తమ దగ్గరకు వస్తున్నారు కాబట్టి బాధితులు తమ బాధలను చెప్పుకుంటారు. దాంతో ఆ ప్రాంతాల్లో గోలగోలగా తయారవుతుంది. మీడియా కూడా విస్తృతమైన కవరేజి ఇస్తోంది. దాంతో పై రెండు విషయాలతో ప్రతిపక్షాలు హైలైట్ అవుతున్నాయి. హైడ్రా, మూసీనది సుందరీకరణ అన్న నిర్ణయాలు లేకపోతే ప్రతిపక్షాలు జనాల్లోకి వెళ్ళటానికి ఇప్పటికిప్పుడు పెద్దగా అవకాశాలు ఉండేవికావేమో.

Read More
Next Story