జగన్ మార్గంలోనే రేవంత్ వెళుతున్నాడా ?
x
Jagan and Revanth

జగన్ మార్గంలోనే రేవంత్ వెళుతున్నాడా ?

ఆలస్యంగానే అయినా బీసీల విషయంలో జగన్మోహన్ రెడ్డి దారిలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రయాణించాలని డిసైడ్ అయ్యాడు.


ఆలస్యంగానే అయినా బీసీల విషయంలో జగన్మోహన్ రెడ్డి దారిలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రయాణించాలని డిసైడ్ అయ్యాడు. ఇంతకీ జగన్(YS Jagan) మార్గంఏమిటంటే అధికారికంగా కాకుండా పార్టీపరంగా బీసీలకు పెద్దపీట వేయాలని. ఏపీలో జగన్ అయితే పదవుల్లో బీసీలకు సుమారు 70 శాతం కట్టబెట్టాడు. తెలంగాణ(Telangana)లో అది సాధ్యంకాదు కాబట్టి పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్(BC Reservations) కేటాయిస్తామని ప్రకటించాడు. తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు పార్టీపరంగా 42 శాతం టికెట్లు కేటాయించబోతున్నట్లు రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లాగ బీసీలకు 42 శాతం టికెట్లను బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు కేటాయిస్తాయా అని రేవంత్ సవాలు విసిరారు. రేవంత్ విసిరిన సవాలుకు ఇప్పటివరకు బీఆర్ఎస్, బీజేపీల నుండి సరైన సమాధానం రాలేదు.

42శాతం టికెట్లకేటాయింపు విషయంలో రేవంత్ సవాలు విసరటం ద్వారా ఒకవిషయాన్ని చెప్పకనే చెప్పినట్లయ్యింది. అదేమిటంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు సాధ్యంకాదని. కామారెడ్డి డిక్లరేషన్ ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని రేవంత్(Revanth) ప్రకటించారు. నిజానికి చట్టబద్దంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యంకాదు. ఎందుకంటే రిజర్వేషన్లు మొత్తం 50 శాతంకు మించకూడదని గతంలో సుప్రింకోర్టు తీర్పిచ్చింది. సుప్రింకోర్టు తీర్పుప్రకారం చూసుకుంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయటం ఎప్పటికీ సాధ్యంకాదు. ఈ విషయం బాగా తెలుసుకాబట్టే రేవంత్ ను ఇరకాటంలోకి నెట్టేయటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీష్ రావు తదితరులు పదేపదే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాల్సిందే అని డిమాండ్లుచేశారు.

ఇదేవిషయమై సీనియర్లతో చర్చలు జరిపిన రేవంత్ తాజాగా పార్టీపరంగా 42 శాతం టికెట్లను బీసీలకు కేటాయించబోతున్నట్లు ప్రకటించటమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీలు కేటాయిస్తాయా అని చాలెంజ్ విసిరారు. రేవంత్ నుండి ఇలాంటి చాలెంజ్ వస్తుందని బహుశా ప్రతిపక్షాలు ఊహించినట్లులేవు. అందుకనే రేవంత్ సవాలుకు ప్రతిపక్షాలు బదులివ్వలేదు.

జగన్ మార్గంలోనే రేవంత్

2019-24 మధ్య ఏపీలో బీసీ మంత్రాన్ని జపించిన జగన్మోహన్ రెడ్డి పార్టీపరంగా కేటాయించగలిగిన పోస్టుల్లో అత్యధికం బీసీలకే కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల సీట్లుపోను మిగిలిన ఓసీ సీట్లలో అత్యధికం బీసీలకే కేటాయించారు. కౌన్సిలర్, మున్సిపల్ ఛైర్మన్, డివిజన్ కార్పొరేటర్, మేయర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఛైర్మన్ పోస్టుల్లో చాలావరకు బీసీలకే కేటాయించారు. అలాగే ఎంఎల్సీలు, రాజ్యసభ ఎంపీలు, లోక్ సభ ఎంపీల టికెట్లలో కూడా బీసీలనే ఎంపికచేశారు. ప్రభుత్వపరంగా బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించలేనపుడు పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించటం లేదా అత్యధిక సీట్లు కేటాయించటం అన్నది పార్టీ అధినేతల చేతిలోని పని. అప్పట్లో జగన్ బీసీలకు అత్యధికసీట్లను కేటాయిస్తే అదేదారిలో ఇపుడు రేవంత్ నడవబోతున్నారు. రాబోయే స్ధానికఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం టికెట్లు కేటాయించినా లేదా అంతకన్నా ఇంకా ఎక్కువ టికెట్లు కేటాయించినా అడిగేవాళ్ళుండరు. అందుకనే బీసీలకు 42 శాతం టికెట్లను పార్టీపరంగా ఇవ్వబోతున్నట్లు రేవంత్ ప్రకటించింది. ఆచరణలో ఎంతవరకు అమలుచేస్తారో చూడాల్సిందే.

Read More
Next Story