పురుగుల అన్నంతో రేవంత్ పరువు పోతోందా ?
ఒకవైపు ప్రభుత్వం సీరియస్ అవుతోంది. మరోవైపు జరిగే ఘటనలు ప్రతిరోజు జరుగుతునే ఉన్నాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరువుపోతోంది. తరచూ ఏదో ఒక స్కూలులో పిల్లలు తినే భోజనంలో పరుగులు కనబడతున్నాయి. పురుగుల అన్నం తింటున్న విద్యార్ధులు వెంటనే అస్వస్ధతకు గురవుతున్నారు, వారిని స్కూలు సిబ్బంది, స్ధానికులు దగ్గర్లోని ఏదో ఒక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఒకపుడు ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరిగేవి. కాని ఇపుడు రెగ్యులర్ గా బయటపడుతున్నాయి. పురుగుల(Worms in rice) అన్నం వడ్డించని స్కూలు తెలంగాణా(Telangana schools) మొత్తంమీద లేదా అన్నట్లుగా తయారవుతోంది వ్యవహారం. పురుగుల అన్నం వడ్డించటం, పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రిపాలవుతుండటంపై ఒకవైపు ప్రభుత్వం సీరియస్ అవుతోంది. మరోవైపు జరిగే ఘటనలు ప్రతిరోజు జరుగుతునే ఉన్నాయి. నాణ్యతలేని భోజనం పెడితే కటకటాలు లెక్కబెట్టిస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి(Revanth reddy) బహిరంగంగా హెచ్చరించినా పరిస్ధితిలో ఎలాంటి మార్పురాలేదంటే అర్ధమేంటి ? రేవంత్ హెచ్చరికలను కూడా లెక్కచేయటంలేదనే కదా.
భోజనంలో పురుగులు పడుతున్న వరుస ఘటనలపై నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడైనా ఘటనలు బయటపడటం ఆలస్యం వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు స్కూలు హెడ్ మాస్ట, ఇన్చార్జి టీచర్ లేకపోతే డీఈవోలను సస్సెండ్ చేస్తోందే కాని అసలు సమస్య ఏమిటి ? దాని పరిష్కారం ఏమిటనే విషయాన్ని మాత్రం గమనించటంలేదు. సమస్యను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవటంలేదు కాబట్టే అన్నంలో పురుగులు పడుతున్న ఘటనలు పదేపదే రిపీటవుతున్నాయి. అన్నంలో పురుగులుపడుతున్న ఘనలతో సంబంధంలేకపోయినా హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేస్తుండటంపై టీచర్లు, టీచర్ల సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో మండిపోతున్నాయి. అసలు సమస్య పౌరసరఫరాల శాఖ(Civil supplies department)లోనే ఉందన్న విషయం తెలిసినా చక్కదిద్దే చర్యలు మాత్రం రేవంత్ తీసుకోవటంలేదు.
రాష్ట్రంలో 26 వేల స్కూళ్ళున్నాయి. స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనపథకం పెట్టింది ఎందుకంటే పిల్లలను స్కూళ్ళకు రప్పించటంకోసమే. స్కూళ్ళల్లో పిల్లల సంఖ్యను బట్టి పౌరసరఫరాల శాఖ బియ్యం సరఫరాచేస్తుంది. బియ్యం మినహా మిగిలిన పప్పులు, ఉప్పులు, కోడిగుడ్లను స్కూళ్ళ పరిధిలో ఉండే స్వయంసహాయకబృందాల నిర్వహణలోనే ఉంటాయి. ఎక్కువమంది విద్యార్ధులు ఉండే స్కూళ్ళకు ఎక్కువ బడ్జెట్ ఉంటుంది కాబట్టి బియ్యం, పప్పులు, ఉప్పులో కొంతవరకు నాణ్యత ఉంటోంది. పిల్లల సంఖ్య సరిగా లేని చాలా స్కూళ్ళల్లోనే పురుగులున్నం అన్న సమస్య రెగ్యులర్ గా తలెత్తుతోంది. 13,005 స్కూళ్ళల్లో విద్యార్ధుల సంఖ్య 50 లోపు మాత్రమే ఉన్నది. దీంతో ఇలాంటి స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సమస్యగా మారుతోంది.
పురుగుల అన్నం తినటంతో నారాయణపేట జిల్లాలోని మాగనూరు(Maganuru school) హైస్కూలులో మూడురోజుల క్రితం పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. దాంతో పెద్ద గొడవై స్కూల్ హెడ్ మాస్టర్, ఇన్చార్జి టీచర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరుసటి రోజు భోజనం వడ్డింనపుడు మళ్ళీ పురుగులు కనబడటంతో ఇంకా పెద్ద గొడవైంది. దాంతో తలపట్టుకున్న ప్రభుత్వం వెంటనే డీఈవో, ఎంఈవోను సస్పెండ్ చేసింది. ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటున్నా పిల్లలకు పురుగులన్నం అయితే తప్పటంలేదు. దాంతో ఏంచేయాలో దిక్కుతోచక ప్రభుత్వం తలపట్టుకుంటోంది. సమస్య పౌరసరఫరాల శాఖలోనే ఉందని తెలిసినా సంస్కరించటానికి ప్రభుత్వం ఎందుకు ఆలోచించటంలేదో ఎవరికీ అర్ధంకావటంలేదు.
ఇదే విషయాన్ని తెలంగాణా స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి చావారవి ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు సమస్యంతా పౌరసరఫరాల శాఖలోనే ఉందన్నారు. ‘శాఖ నుండి స్కూళ్ళకు సరఫరా అవుతున్న బియ్యంలోనే వివిధ కారణాలతో పురుగులు ఉంటున్నాయ’న్నారు. ‘బియ్యాన్ని బావుచేయకుండా స్కూళ్ళకు సరఫరా చేస్తున్నా’రని చెప్పారు. స్కూళ్ళల్లో కూడా బియ్యాన్ని అలాగే ఉపయోగిస్తుండటంతో అన్నంలో పురుగులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ‘అన్నంలో పురుగులు వస్తున్న ఘటనలు తక్కువే అయినా బాగా హైలైట్ అవుతున్న’ట్లు చెప్పారు. ‘ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లల సంఖ్య 26 లక్షలు కాగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ), (KGBV Schools)రెసిడెన్షియల్ స్కూళ్ళ(Residential schools)లో పురుగులన్నం సమస్య తక్కువగా ఉంద’న్నారు. ‘ప్రభుత్వ స్కూళ్ళల్లో కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం పెడుతున్నారు కాబట్టి హైస్కూల్ పిల్లల్లో ఒక్కోరికి 10 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతోంద’న్నారు. ప్రాథమిక స్కూల్ పిల్లల్లో తలకు 5.47 రూపాయలు, అప్పర్ ప్రైమరీ స్కూల్ పిల్లల్లో తలకు 8.17 రూపాయలు పథకంలో ప్రభుత్వం ఖర్చుపెడుతోందని చెప్పారు. అయితే ‘స్కూల్ తో సంబంధంలేకుండా ప్రతి పిల్లాడికి 15 రూపాయలు కేటాయించాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ’ని చెప్పారు.
‘కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుతున్న 8లక్షల పిల్లల్లో ఒక్కో విద్యార్ధికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చును 36 నుండి 50కి పెరిగింద’ని చెప్పారు. ‘ఈ స్కూళ్ళన్నీ పూర్తిగా రెసిడెన్షియలే కాబట్టి విద్యార్ధుల మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది’ అన్నారు. అందుకనే ఇక్కడ విద్యార్ధిమీద పెడుతున్న ఖర్చు ఎక్కువగా ఉందన్నారు. ‘ప్రభుత్వం చెబుతున్నట్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు సన్నబియ్యం ఎక్కడా సరఫరాచేయటంలేద’న్నారు. ‘దొడ్డు బియ్యాన్నే మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి సన్నబియ్యమని చెప్పి దాన్నే స్కూళ్ళకు సరఫరా చేస్తున్నార’ని రవి ఆరోపించారు. సరఫరాచేసే బియ్యాన్నే పౌరసరఫరాల శాఖ దగ్గరే బావుచేసి సరఫరాచేస్తే స్కూళ్ళల్లో ఎలాంటి సమస్యలు తలెత్తవని రవి అభిప్రాయపడ్డారు. ఇదే నమయంలో పౌరసరఫరాల శాఖ అందిస్తున్న బియ్యాన్ని బాగుచేసి వండాల్సిన బాధ్యత ఏజెన్సీల మీద కూడా ఉందన్నారు. పెరిగిన ఖర్చులకు తగ్గట్లుగా ప్రభుత్వం రేట్లు పెంచకపోవటం, సకాలంలో ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకపోవటం కూడా వంటల్లో నాణ్యత తగ్గిపోవటానికి కారణమవుతోందని చెప్పారు. అందుకనే తమిళనాడు తరహాలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు శాశ్వత యంత్రాంగం ఉండాలని సూచించారు. సమస్యంతా ఎక్కువగా బియ్యంలోనే వస్తోందని, పప్పులు, కూరగాయలు, గుడ్లలో ఎక్కువగా రావటంలేదన్న విషయాన్ని రవి గుర్తుచేశారు.