రేవంత్ మాటలకు విలువుంటుందా ?
x
Revanth reddy

రేవంత్ మాటలకు విలువుంటుందా ?

పైకి చూస్తే రేవంత్ భలేగా మాట్లాడాడు అని హ్యాపీగా ఫీలవ్వచ్చు. కాని కాస్త ఓపికగా ఆలోచిస్తే రేవంత్ మాట్లాడిన మాటల్లో ఉత్త చెత్త తప్ప ఏమీ లేదని అర్ధమైపోతుంది.


‘కేసీఆర్ ఫామ్ హౌసులో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా’..

‘గజ్వేల్ లో వెయ్యి ఎకారాల్లో ఫాంహౌస్ ఉంది. అందులో 500 ఎకరాలిస్తే ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా’..

‘కేసీఆర్ భూదానం చెయ్యి. ఇండ్లు కట్టించే బాధ్యత నాది’..

‘జన్వాడలో కేటీఆర్ కు 50 ఎకరాలుంది. అందులో 25 ఎకరాలు ఇవ్వు..ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తా’..

‘బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో రు. 1500 కోట్లున్నాయి. ఒక రు. 500 కోట్ల ఇవ్వండి ప్రజలకు పంచుదాం. ఇదంతా ప్రజల నుండి దోచుకున్న సొమ్మే కదా’..

పై మాటలన్నీ కేసీఆర్, కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కేంద్రమాజీమంత్రి గడ్డం (గుడిసెల) వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా జరిగిన సభలో రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు. పైకి చూస్తే రేవంత్ భలేగా మాట్లాడాడు అని హ్యాపీగా ఫీలవ్వచ్చు. కాని కాస్త ఓపికగా ఆలోచిస్తే రేవంత్ మాట్లాడిన మాటల్లో ఉత్త చెత్త తప్ప ఇంకేమీ లేదని సులభంగానే అర్ధమైపోతుంది. కేసీఆర్ ఫామ్ హౌసులో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాడట. ఎలాగ కట్టిస్తాడు ? కేసీఆర్ ఫాంహౌస్ ప్రైవేటు ప్రాపర్టీ. కేసీఆర్ ప్రైవేటు ప్రాపర్టీలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు ఎలా కట్టగలదు ? కేసీఆర్ ఎందుకు ఇస్తారు ? కేసీఆర్ భూదానం చేయలట ? ఎందుకు చేస్తారు ? గజ్వేలులో వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని అన్నారు.

గజ్వేలులో ఉన్న వెయ్యి ఎకరాల్లో ఫాంహౌసులు ఎవరివి ? అన్నీ కేసీఆర్, కేటీఆర్ వేనా ? కాదు కదా. అందులో 500 ఎకరాలు ఇస్తే ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తానని చెప్పాడు. ఎవరి భూమి, ఎవరివ్వాలి ? జన్వాడలో కేటీఆర్ కు 500 ఎకరాలున్నాయని అన్నారు. అందులో 25 ఎకరాలిస్తే ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తానని రేవంత్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళకు కేటీఆర్ తన ఫామ్ హౌస్ భూమి ఎందుకిస్తారు ? అసలా ఫాంహౌస్ తనది కాదని తన ఫ్రెండుదని కడా కేటీఆర్ చెబుతున్నది. జన్వాడ ఫాంహౌస్ ఫ్రెండుది కాదు కేటీఆర్ దే అని ఇంతవరకు ప్రభుత్వం నిరూపించలేకపోయింది. ఏ ఫాంహౌస్ ఎవరిదనే విషయాన్ని కూడా తేల్చలేని స్ధితిలో ప్రభుత్వం చేతకానిది అయిపోయిందా ?

ఇక బీఆర్ఎస్ అకౌంటులో రు. 1500 కోట్లున్నాయని రేవంత్ అన్నారు. అందులో నుండి రు. 500 కోట్లు ఇస్తే ప్రజలకు పంచుదామని సూచించారు. పైగా ఉన్న డబ్బంతా ప్రజల నుండి దోచుకున్నదే అని కూడా అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రజల నుండి వందల కోట్ల రూపాయలు దోచుకున్నట్లు రేవంత్ నిరూపించగలరా ? ఆరోపణలు వేరు, ఆధారాలతో నిరూపించటం వేరని రేవంత్ కు తెలీదా ? బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో జన్వాడ ఫాంహౌస్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కొడుకుల ఫామ్ హౌసులున్నాయని, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఫాంహౌస్ కూడా ఉందని రేవంత్ అన్నారు. ఆ ఫాంహౌసులన్నింటినీ కూల్చద్దా అని అడిగారు. ప్రముఖల ఫాంహౌసులన్నీ బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలోనే ఉంటే హైడ్రాతో చెప్పి రేవంత్ ఇప్పటివరకు ఎందుకు కూల్చలేకపోయారు ?

సబిత కొడుకు కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు తమకు అసలు ఫాంహౌసులే లేవన్నారు. తన ఫాంహౌస్ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే సర్వే చేయించి ఫైనల్ చేయిస్తే తానే దగ్గరుండి కూల్చేయిస్తానని కేవీపీ ముఖ్యమంత్రికి ఓపెన్ లెటరే రాశారు. దానిపై రేవంత్ ఇప్పటివరకు స్పందించనే లేదు. జనాలున్నారు కదాని ప్రత్యర్ధులపై నోటికొచ్చింది మాట్లాడేస్తే చప్పట్లు కొడితే కొట్టచ్చు కాని దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రేవంత్ తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాట్లాడే ప్రతి మాటకు విలువుండాలి. ఎవరిమీదైనా ఆరోపణ చేసేటపుడు తగిన సమాచారం, ఆదారాలు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే రేవంతే జనాల ముందు చులకనైపోతారు. చివరకు మాట్లాడే మాటలకు ఏమాత్రం విలువలేకుండా పోతుందని రేవంత్ గ్రహించాలి.

Read More
Next Story