Revanth and Delhi elections|రేవంత్ వ్యక్తిగత బాధ్యత చెల్లుతుందా ?
ఢిల్లీఎన్నికల్లో గెలిపిస్తే ఇచ్చిన హామీలఅమలుకు వ్యక్తిగత బాధ్యత తీసుకుంటానని హామీ ఇవ్వటం విచిత్రంగా ఉంది.
ఎన్నికల్లో ఇచ్చినహామీలను నెరవేర్చలేక ముఖ్యమంత్రి హోదాలోనే రేవంత్ రెడ్డి తెలంగాణలో నానా అవస్తలు పడుతున్నాడు. అలాంటిది ఢిల్లీఎన్నికల్లో గెలిపిస్తే ఇచ్చిన హామీలఅమలుకు వ్యక్తిగత బాధ్యత తీసుకుంటానని హామీ ఇవ్వటం విచిత్రంగా ఉంది. అసలు ఎన్నికల్లో ఇచ్చే హామీలకు నేతలు వ్యక్తిగత బాద్యత తీసుకోవటం సాధ్యమేనా ? ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేసి, ఓటర్లను మాయచేయటానికి మాత్రమే ఇలాంటి ఉత్తుత్తి హామీలు పనికొస్తాయి. లేకపోతే ఢిల్లీ ఎన్నిక(Delhi Elections)ల్లో ఒకవేళ కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీల అమలుకు రేవంత్(Revanth) ఏ విధంగా ప్రయత్నింగలడు ? ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి-అధిష్టానం హమీల అమలును చూసుకుంటాయి. 2023 ఎన్నికల్లో తెలంగాణ(Telangana)లో ఇచ్చిన హామీలకే నూరుశాతం దిక్కులేదని అందరికీ తెలుసు. ఎక్కడో ఢిల్లీఎన్నికల్లో హామీల అమలుకు వ్యక్తిగత హామీ ఉంటానని ప్రకటించిన రేవంత్ మరి తెలంగాణలో ఇచ్చినహామీలను ఎందుకు గాలికొదిలేసినట్లు ?
పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ తెలంగాణలో చాలా హామీలిచ్చాడు. అర్హులైన ప్రతి మహిళకు నెలకు రు. 2500 పెన్షన్, తులంబంగారం, రైతుభరోసా హామీ ఎంతగా వివాదాస్పదమవుతోందో చూస్తున్నదే. ఇక ఆసరా పెన్షన్ కింద అర్హులకు నెలకు రు. 4 వేలన్నాడు, ఇచ్చాడా ? రు. 5 లక్షల విద్యాభరోసా హమీ ఇంతవరకు అమలేకాలేదు. ప్రతి విద్యార్ధినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైందో తెలీదు. నెలకు 200 యూనిట్లవరకు ఉచితవిద్యుత్ ఎంతమందికి అందుతోందో తెలీదు. రైతురుణమాఫీ సంపూర్ణంగా అమలైపోయిందని రేవంత్ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు మండిపోతున్నాయి. ఆరుగ్యారెంటీల్లో నూరుశాతం అమలైన పథకాలు రెండుమాత్రమే. ఒకటి మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, రెండోది ఆరోగ్యశ్రీ పరిధిని రు. 15 లక్షలకు పెంచటం.
మిగిలిన రైతురుణమాఫీ, రైతుభరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఏడాదికి 3 సిలిండర్ల పథకాలఅమలు బాగా వివాదాస్పదమయ్యాయి. చివరి పథకం అర్హులైన ప్రతి మహిళకు నెలకు రు. 2500 పెన్షన్ ఇంకా అమల్లోకే రాలేదు. ఎప్పుడు అమల్లోకి తెస్తారో కూడా చెప్పటంలేదు. తెలంగాణలోనే ఇలాంటి పరిస్ధితి ఉంటే ఇక ఢిల్లీలో కూడా రెండు హామీలిచ్చారు. అవేమిటంటే అధికారంలోకి వస్తే రు. 500కే సిలిండర్ తో పాటు రేషన్ కిట్, నెలకు 300 యూనిట్ల ఉచితవిద్యుత్ పథకం. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేస్తామని చెప్పిన రేవంత్ అంతటితో ఆగుంటే సరిపోయేది. అగకుండా హామీల అమలులో తాను వ్యక్తిగతబాద్యత తీసుకుంటానని ప్రకటించటమే విడ్డూరంగా ఉంది. ఇలాంటి హామీలను ప్రకటించినా మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra) కాంగ్రెస్ పార్టీని జనాలు పట్టించుకోలేదు. మహారాష్ట్రలో కూడా రేవంత్ రోడ్డుషోలు, ర్యాలీలు, బహిరంగసభల్లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ గెలుపుకోసం రేవంత్ అంతకష్టపడినా చివరకు తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. మరి ఢిల్లీ జనాలు ఏమిచేస్తారో చూడాల్సిందే.