
మహిళల ఓట్లకోసం రేవంత్ సూపర్ స్కెచ్ ?
ప్రస్తుతం 119 మంది ఎంఎల్ఏల్లో అన్నీపార్టీల్లో మహిళా ఎంఎల్ఏలు తొమ్మిదిమంది మాత్రమే ఉన్నారు.
తొందరలోనే మహిళలకు అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్ అమలవుతుంది అప్పుడు 60 మంది మహిళలను ఎంఎల్ఏలుగా గెలిపించుకుంటాను....ఇది తాజాగా ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. వ్యవసాయ విశ్వవిద్యాయంలో రేవంత్ మాట్లాడుతు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణలో 50 మంది మహిళా ఎంఎల్ఏలకు టికెట్లు దక్కుతాయన్నారు. ఇది ఎప్పుడంటే తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుండి 153కి పెరిగినపుడు. ఇపుడు అసెంబ్లీ, పార్లమెంటులో మహిళలకు ప్రత్యేకంగా 33 శాతం రిజర్వేషన్ అంటు ఏమీలేదు. రాజ్యాంగం ప్రకారం అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనే గట్టి నేతలు అనుకున్న మహిళలకు పార్టీలో టికెట్లు దక్కుతున్నాయి. ఈకోటాలో గెలిచే వాళ్ళు గెలుస్తున్నారు మరికొందరు ఓడిపోతున్నారు. ప్రస్తుతం 119 మంది ఎంఎల్ఏల్లో అన్నీపార్టీల్లో మహిళా ఎంఎల్ఏలు తొమ్మిదిమంది మాత్రమే ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలవుతున్నట్లే అసెంబ్లీ, పార్లమెంటులో కూడా 33 శాతం రిజర్వేషన్లు అమలవ్వాలనే డిమాండ్లు చాలాకాలంగా వినబడుతున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న రిజర్వేషన్ల డిమాండుకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో తెలీదు. ఎన్డీయే ప్రభుత్వం కూడా 33 శాతం మహిళా రిజర్వేషన్(Women Reservation Bill) బిల్లు ఆమోదంపై సానుకూలంగా ఉంది కాబట్టి 2029 ఎన్నికల్లోను మహిళాబిల్లుకు మోక్షం లభిస్తుందని అనుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రకారం 50 సీట్లు కేటాయింపు ఉంటుందని అన్నది. ఇక్కడివరకు రేవంత్(Revanth) ప్రకటనతో ఎలాంటి సమస్యా లేదు. ఎందుకంటే రిజర్వేషన్లు అమల్లోకి వస్తే(Telangana Congress) కాంగ్రెస్ మాత్రమే కాదు ఏ పార్టీ అయినా మహిళలకు 50 సీట్లు కేటాయించక తప్పదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అభ్యర్ధుల్లో ఎవరు గెలిచినా ఓడినా 50 మంది మహిళా ఎంఎల్ఏలు అసెంబ్లీలోకి అడుగుపెట్టడం మాత్రం ఖాయం.
ఇంతవరకు ఓకేనే కాని దానికి కొనసాగింపుగా రేవంత్ చేసిన ప్రకటనపైనే అందరికీ అనుమానం. ఇంతకీ ఏమన్నాడంటే 50 సీట్లకు అదనంగా మరో పదిసీట్లను తాను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. పదిసీట్లను కేటాయించటమే కాకుండా మొత్తం 60మంది మహిళలను కాంగ్రెస్ తరపున ఎంఎల్ఏలుగా గెలిపించుకుంటానని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే కాంగ్రెస్ తరపున 60 మందికి టికెట్లు కేటాయించి మొత్తం 60 మందినీ గెలిపించుకుంటానని రేవంత్ ప్రకటించటమే విడ్డూరంగా ఉంది. రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి 50 మంది మహిళలకు టికెట్ల విషయంలో ఎలాంటి పేచీ ఉండదు. కాని అదనంగా కేటాయిస్తానని ప్రకటించిన 10 సీట్ల విషయంలోనే సమస్యంతా.
ఎవరెంత చెప్పుకున్నా మనది పురుషాధిక్య సమాజమన్న విషయం అంగీకరించాల్సిందే. రాజకీయాల్లో ఈ ఆధిపత్యం మరింత స్పష్టంగా కనబడుతుంది. ఏకారణం వల్లయినా పురుషులు పోటీనుండి తప్పుకోవాల్సి వచ్చినపుడు మాత్రమే ఆడవాళ్ళు ఎన్నికల్లో నిలబడుతున్నారు. ఇంట్లోని మగవాళ్ళని కాదని ఆడవాళ్ళు రాజకీయంగా యాక్టివ్ గా ఉండటం, ఎన్నికల్లో పోటీచేయటం తక్కువనే చెప్పాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల ప్రకారం రిజర్వయ్యే నియోజకవర్గాలు ఏవో ముందు ముందు తెలుస్తాయి. భవిష్యత్తులో రిజర్వేషన్లంటు ప్రత్యేక కోటా అమలవుతుంది కాబట్టి వేరేదారిలేక 50 మంది మగాళ్ళ స్ధానాల్లో ఆడవాళ్ళు తెరమీదకు రాకతప్పదు. ఈ పరిస్ధితుల్లో రిజర్వేషన్లకు అదనంగా మరో 10 సీట్లంటే టికెట్లను త్యాగంచేసే మగనేతలు ఎవరుంటారు అన్నదే ప్రశ్న.
రిజర్వేషన్లు అమలైతే 50 మంది మగాళ్ళు పోటీనుండి తప్పుకోక తప్పదన్నది పెద్ద కుదుపుగా చూడాలి. అలాంటిది అదనంగా మరో పది నియోజకవర్గాల్లో కూడా అనధికారికంగా మహిళలకే టికెట్లంటే రచ్చరచ్చయిపోవటం ఖాయం. ఎంతో అనుభవం ఉన్న రేవంత్ కు ఈ విషయం తెలీకుండా ఉండదు. అయినా బహిరంగంగా ప్రకటించారంటే ఏమిటర్ధం. అదనంగా 10 మంది మహిళలకు టికెట్లు ఇవ్వటం అన్న హామీని అడ్డంపెట్టుకుని పార్టీలో తన ప్రత్యర్ధులను తొక్కేద్దామని ప్లాన్ వేశారా ? లేకపోతే మహిళల ఓట్లను గంపగుత్తగా పార్టీకి వేయించుకునే ఉద్దేశ్యంతో మాత్రమే ఇలాంటి హామీ ఇచ్చారా అన్నది తెలీటంలేదు. తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో మహిళల ఓట్లను ఆకర్షించే ఉద్దేశ్యంతో మాత్రమే రేవంత్ ఈ ప్రకటన చేశారు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఎందుకంటే నియోజకవర్గాల్లో టికెట్లు కేటాయించటం రేవంత్ చేతిలో పనికాదు. పట్టుమని పదినియోజకవర్గాల్లో కూడా తన మద్దతుదారులకు ఎంఎల్ఏ, ఎంపీ టికెట్లు ఇప్పించుకోవటమే రేవంత్ కు గగనం అవుతుంది. అలాంటిది రిజర్వేషన్లకు అదనంగా మరో 10మంది మహిళలకు టికెట్లు ఇప్పించుకోవటం అంటే చిన్నవిషయం కాదు.
ఇపుడు రేవంత్ ప్రకటన 2023 ఎన్నికలకు ముందు ప్రకటించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీనే గుర్తుకు తెస్తున్నది. బీసీల ఓట్లను ఆకర్షించటమే ఏకైక లక్ష్యంతో అప్పట్లో స్ధానికసంస్ధల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని హామీ ఇచ్చాడు. అప్పట్లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ హామీ అమలుపరిస్ధితి ఇపుడు ఏమిటో అందరు చూస్తున్నదే. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయగలరే కాని చట్టప్రకారమైతే సాధ్యంకాదని తేలిపోయింది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయటం అంటే అనధికారికంగా అమలుచేయటమే. మహిళలు 60మందికి టికెట్ల హామీకూడా ఇలాంటిదేనా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తే అదనంగా ఇస్తానని హామీ ఇచ్చిన 10 సీట్ల విషయంలో రేవంత్ ఏమిచేస్తాడో చూడాల్సిందే.