
మావోయిస్టు రూపేష్..ఆ అగ్రనేత ఒకరేనా ?
ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానాలు ఏమిటంటే రూపేష్ అధికార ప్రతినిధి మాత్రమే కాదు అంతకుమించే అన్నట్లు
ఈమధ్య తరచు మావోయిస్టులకు సంబందించి ఒకపేరు ప్రచారంలో ఉంటోంది. ఇంతకీ ఆ పేరు ఏమిటంటే రూపేష్. రూపేష్ ఎవరంటే మావోయిస్టు పార్టీ నార్త్-వెస్ట్ సబ్ జోన్ జోనల్(ఇన్చార్జి) అధికార ప్రతినిధి. కేంద్రప్రభుత్వంతో శాంతిచర్చలు జరిపేందుకు మావోయిస్టులు(Maoist Rupesh) సిద్దంగా ఉన్నారంటు రూపేష్ పదేపదే ప్రతిపాదనలు పంపుతున్నారు. తక్షణమే ప్రభుత్వాలు ‘ఆపరేషన్ కగార్’(Operation Kagar) నిలిపేయాలని, మావోయిస్టులతో శాంతిచర్చలకు వచ్చేలా ఒత్తిడిపెట్టాలని ప్రజాసంఘాలు, మేథావులకు రూపేష్ అప్పీల్ చేస్తున్నారు. శాంతిచర్చల విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించకపోవటంతో రూపేష్ పదేపదే అప్పీల్ చేస్తు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రూపేష్ అంటే అసలు ఎవరు ? ఎలాగుంటాడు అన్న విషయంలో చాలామందికి క్లారిటిలేదు.
అయితే ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానాలు ఏమిటంటే రూపేష్ అధికార ప్రతినిధి మాత్రమే కాదు అంతకుమించే అన్నట్లు. అంతకుమించే అంటే మావోయిస్టులోని టాప్ లీడర్లలో రూపేష్ కూడా ఒకడని అనుమానిస్తున్నారు. రూపేష్ అసలుపేరు కాదని అసలుపేరు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఇంత సడెన్ గా ఇంటెలిజెన్స్ అధికారులకు ఈ అనుమానం ఎందుకు వచ్చినట్లు ? ఎందుకంటే రూపేష్ ఈమధ్యనే ఛత్తీస్ ఘడ్ లోని ఒక యూట్యూబ్ ఛానల్(You Tube Channel Interview) ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో యూట్యూబ్ ప్రతినిధి మొహం కనబడుతోంది కాని ఇంటర్వ్యూ ఇచ్చిన రూపేష్ బ్యాక్ ఫేస్ మాత్రమే కనబడింది. అయితే వీడియోలోని రూపేష్ కదలికలు, మాటలు తదితరాలను బట్టి నిఘావర్గాలు తమ దగ్గరున్న మావోయిస్టుల టాప్ లీడర్ల మొహాలు, గొంతులను తమదగ్గరున్న డేటాబేస్ తో మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించారని సమాచారం.
ఆప్రయత్నంలో భాగంగా రూపేష్ పేరుతో చెలామణి అవుతున్న వ్యక్తి పోలికలు, గొంతు టాప్ లీడర్ తక్కెళ్ళపల్లి(Takkellapalli Vasudeva Rao) వాసుదేవరావు పోలికలు, గొంతుతో సరిపోలినట్లు సమాచారం. దాంతో రూపేష్ పేరుతో చెలామణి అవుతున్న మావోయిస్టు లీడర్ అసలు పేరు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. నిజానికి తెక్కెళ్ళపల్లి వాసుదేవరావుకు మరో పేరు కూడా ఉండేది, అదేమిటంటే ఆశన్న. గతంలో ఆశన్న పేరుతో ప్రస్తుత రూపేష్ చాలా పెద్ద ఆపరేషన్లే చేశాడు. కొందరు ప్రముఖులను టార్గెట్ చేశాడు.
మోస్ట్ వాటెండ్
నిఘావర్గాల సమాచారం ప్రకారం రూపేష్ అలియాస్ తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న మోస్ట్ వాటెండ్ మావోయిస్టు. ఈయనది ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామం. హనుమకొండలో పాలిటెక్నక్ చదువుతు ర్యాడికల్ ఉద్యమాలవైపు ఆకర్షితుడై చదువును మధ్యలోనే నిలిపేశాడు. 1989లోనే ర్యాడికల్ ఉద్యమంలోచేరి చాలాకాలం అజ్ఞాతంలో ఉన్నాడు. ఆతర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ చేపట్టిన అనేక యాక్షన్లలో కీలకంగా వ్యవహరించాడు. ఉమ్మడి ఏపీలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి గుర్తున్నాడా ? నల్గొండ నుండి హైదరాబాదుకు 2000, మార్చి 7వ తేదీన మాధవరెడ్డి వస్తున్నపుడు బాంబులు పేల్చి హతమార్చేశారు మావోయిస్టులు. మాధవ రెడ్డి హత్యతో ఆశన్న పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
అంతకన్నా ముందు 1999, సెప్టెంబర్ 4వ తేదీన హైదరాబాదు, సంజీవరెడ్డి నగర్ సిగ్నల్ పాయింట్ దగ్గర ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర కాల్పుల్లో చనిపోయారు. ట్రాఫిక్ లో నిలిపివున్న ఉమేష్ చంద్రను కారులోనే కాల్చిచంపిన ఘటనలో కూడా ఆశన్న పేరు బాగా వినబడింది. టార్గెట్ ఎవరో ఫిక్సయిన తర్వాత మాటువేసి కాల్పులు జరిపి లేదా బాంబులు పేల్చి చంపటంలో ఆశన్న వ్యూహాలు చాలావరకు వర్కవుటైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
చంద్రబాబు మిస్
ఆశన్న టార్గెట్ నుండి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) మిస్సయ్యారు. 2003, అక్టోబర్ లో తిరుమల(Tirumla) శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళుతున్నపుడు అలిపిరి టోల్ గేట్ దాటగానే క్లెమోర్ మైన్స్ పేలిన విషయం గుర్తుండే ఉంటుంది. క్లెమోర్ మైన్స్ పేలుడు ఘటనలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు దాదాపు 20 అడుగులు గాలిలోకి ఎగిరి కిందపడింది. కారులో కూర్చున్న చంద్రబాబు చిన్నగాయాలతో తప్పించుకున్నారు. చంద్రబాబు మీద హత్యాయత్నం చేసిన తొమ్మిదిమంది బృందానికి ఆశన్నే నాయకత్వం వహించాడు. అలిపిరి ఘనతోనే ఆశన్న అలియాస్ తక్కెళ్ళపల్లి వాసుదేవరావు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆశన్నపేరు చాలాకాలం పెద్దగా వినబడలేదు. అలిపిరి ఘటన తర్వాత ఆశన్న ఆంధ్ర-ఒడిశా బార్డర్(ఏవోబీ)లో మావోయిస్టుపార్టీని బలోపేతం చేయటం కోసం కేంద్రనాయకత్వం పంపించిందని నిఘావర్గాలు పసిగట్టాయి. ఏవోబీ నుండి ఆశన్న 2017లో ఛత్తీస్ ఘడ్ కు వెళ్ళినట్లు సమాచారం. అప్పటినుండి ఆశన్న మావోయిస్టుపార్టీ నార్త్-వెస్ట్ సబ్ జోన్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు.
తమ గుర్తింపును బహిరంగంపర్చటం ఇష్టంలేని చాలామంది మావోయిస్టు అగ్రనేతలు ఏవేవో మారుపేర్లతో చెలామణి అవుతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు మావోయిస్టు అధికార ప్రతినిధి రూపేష్ పేరుతో వస్తున్న ప్రకటనలు, ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కనబడుతున్నది తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నే అని నిఘావర్గాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. రూపేషే అలియాస్ ఆశన్న అలియాస్ తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అన్న విషయంలో ఎప్పుడు క్లారిటి వస్తుందో చూడాలి.