కాంగ్రెస్-బండి బంధం బలపడుతోందా ?
x
Bandi and Revanth

కాంగ్రెస్-బండి బంధం బలపడుతోందా ?

కరీంనగర్(Karimnagar) నియోజకవర్గంలో బండి మీడియాతో మాట్లాడుతు నియోజకవర్గం అభివృద్ధికి అందరు ఎంఎల్ఏలతో కలిసి పనిచేస్తానని చెప్పారు.


బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కరీంనగర్(Karimnagar) నియోజకవర్గంలో బండి మీడియాతో మాట్లాడుతు నియోజకవర్గం అభివృద్ధికి అందరు ఎంఎల్ఏలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధిపై అందరికీ మంచి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి కలిసి పనిచేస్తామన్నారు. మానుకొండూరు నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి అందరం కలిసే ముందుకు వెళతామని బండి (Bandi Sanjay) చెప్పారు. బండి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియా(Social Media)లో బాగా వైరల్ అవుతున్నాయి. చాలాకాలంగా బీజేపీ(BJP)-కాంగ్రెస్(Congress) లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), హరీష్ రావు తదితరులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బీఆర్ఎస్-బీజేపీలు అవగాహనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని రేవంత్ అండ్ కో పదేపదే ఆరోపిస్తున్నారు.

అందుకనే ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి పనిచేస్తోందనే అయోమయం జనాల్లో పెరిగిపోతోంది. ఎందుకంటే మూడుపార్టీల వాళ్ళు కలిసిపనిచేయటం, అవగాహనతో ముందుకు వెళ్ళటం, లోపాయికారి ఒప్పందాలు అనే అంశాలపైన ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దాంతో జనాలకు క్లారిటి రావటంలేదు. మొదటినుండి కూడా బండి లేదా బీజేపీ సీనియర్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీపైన కన్నా ఎక్కువగా బీఆర్ఎస్ పైనే దృష్టిపెట్టారు. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను టార్గెట్ చేయటం కన్నా బలహీనంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను టార్గెట్ చేయటం సులభం కాబట్టి. ఏదో రూపంలో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టి ఆ ప్లేసును తాము అందుకోగలిగితే అప్పుడు కాంగ్రెస్ పనిపట్టవచ్చన్నది బీజేపీ నేతల వ్యూహం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కాని జాతీయస్ధాయిలో కాని బీఆర్ఎస్ కు మద్దతుగా ఒక్క పార్టీ కూడా లేదు. అధికారంలో ఉన్నంతకాలం ఎంఐఎం మిత్రపక్షంగా ఉండేది. కొంతకాలం వామపక్షాలున్నా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల తర్వాత విడిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎంఐఎం బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ కు మిత్రపక్షంగా మారిపోయింది. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలను చూస్తే బీఆర్ఎస్ ఇపుడు ఎన్డీయే(NDA)లో కాని ఇండియా కూటమి(INDIA Alliance)లో కాని లేదు. జాతీయస్ధాయిలో ఏ కూటమిలోను లేని కారణంగా పై కూటముల్లోని ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ కు అండగా నిలవటంలేదు. దాంతో కారుపార్టీ ఇంటా, బయటా ఇపుడు గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటోందనే చెప్పాలి.

ఈ నేపధ్యంలో ప్రతిరోజు బీజేపీ నేతలు ముఖ్యంగా కేంద్రమంత్రులు బండి సంజయ్, జీ కిషన్ రెడ్డి(G KishanReddy) పదేపదే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి అందరు ఎంఎల్ఏలతో కలిసి పనిచేస్తామని చెప్పటం సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎల్ఏల నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఏమాత్రం నిధులు ఇస్తున్నదో అందరు చూస్తున్నదే. పైగా కేంద్రం నిధులను ఒక్కపటి బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుని తినేసిందని బండి తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులు జనాలకు కనబడేవారు కాదని కూడా అన్నారు. ఇపుడు కాంగ్రెస్ మంత్రులు జనాలకు కనబడుతున్నారని, కొంత అభివృద్ధి కూడా జరుగుతోందని చెప్పటం అంటే కాంగ్రెస్ తో మైత్రికి సిద్ధపడుతున్నారా ? అనే సందేహం పెరిగిపోతోంది. శతృవుకు శతృవు మిత్రుడు అనే రాజనీతి ఉండనే ఉంది కదా. ఆ పద్దతిలోను సాంతం బీఆర్ఎస్ ను లేవకుండా దెబ్బకొట్టేందుకు బండి కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story