
బీఆర్ఎస్ చేతిలో తీన్మార్ మల్లన్న ఆయుధంగా మారుతున్నాడా ?
కేసీఆర్ తో పాటు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా రెచ్చిపోయే తీన్మార్ సడెన్ గా కేటీఆర్, హరీష్ తో భేటీఅవటం సంచలనం కాకుండా మరేమవుతుంది ?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు..శాశ్వత శతృవులుండరనే నానుడి అందరికీ తెలిసిందే. ఇపుడీ విషయం దేనికంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్-తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నపుడు కాంగ్రెస్ సస్పెండెడ్ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్ళి కేటీఆర్(KTR), మాజీమంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. కేటీఆర్ తో ప్రతిరోజు ఎంతోమంది భేటీ అవుతుంటారు, ఎంతోమందిని కేటీఆర్ కలుస్తుంటారు. అయితే తీన్మార్ భేటీకే ఎందుకింత ప్రాధాన్యత ? ఎందుకంటే కేసీఆర్-తీన్మార్ మధ్య సంబంధాలు ఉప్పునిప్పులాగుంటుంది. కేసీఆర్ పదేళ్ళ పాలనకు వ్యతిరేకంగా తీన్మార్(Teenmar Mallnna) కొన్ని వేలవీడియోలు చేసుంటాడు. కేసీఆర్(KCR) తో పాటు పనిలోపనిగా కేటీఆర్, హరీష్(Harish) రావు, కల్వకుంట్ల కవితపైన కూడా తనదైన శైలిలో ప్రతిరోజు సొంత యూట్యూబ్ ఛానల్లో ఆకాశమేహద్దుగా రెచ్చిపోయేవాడు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్న కారణంగా తీన్మార్ పైన పోలీసులు పదులసంఖ్యలో కేసులుపెట్టి అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. దాంతో కేసీఆర్ తో పాటు కుటుంబానికి వ్యతిరేకంగా తీన్మార్ తెలంగాణ(Telangana) అంతా పర్యటించి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. కేసీఆర్ తో పాటు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా రెచ్చిపోయే తీన్మార్ సడెన్ గా కేటీఆర్, హరీష్ తో భేటీఅవటం సంచలనం కాకుండా మరేమవుతుంది ? ఇంతకీ కేటీఆర్ తో తీన్మార్ ఎందుకు భేటీ అయ్యాడంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో చర్చజరిపి బిల్లు కూడా ఆమోదించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తెలంగాణ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పంపింది.
కేంద్ర క్యాబినెట్ ఓకేచేసిన తర్వాత బిల్లును పార్లమెంటులో చర్చకుపెట్టి ఆమోదించి, రాష్ట్రపతి సంతకం చేస్తేకాని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయటం సాధ్యంకాదు. రేవంత్ ప్రభుత్వం తనపని తాను చేసేసింది. ఇక చేయాల్సింది కేంద్రంలోని నరేంద్రమోడీ(Narendra Modi) ప్రభుత్వమే. అందుకనే కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటంకోసం తొందరలోనే తెలంగాణలోని రాజకీయపార్టీలను ఢిల్లీకి తీసుకెళ్ళేందుకు తీన్మార్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అన్నీ పార్టీల మద్దతు కూడగడుతున్నాడు. ఇందులో భాగంగానే కేటీఆర్ తో కూడా భేటీ అయ్యాడు. తీన్మార్ రిక్వెస్టుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించి మద్దతు పలికారు. ఈ భేటీతోనే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు..శాశ్వత శతృవులుండరనే నానుడి మరోసారి నిజమైంది.
తీన్మార్ ఫ్రీ బర్డేనా ?
కాంగ్రెస్ నుండి ఎప్పుడైతే తీన్మార్ సస్పెండ్ అయ్యాడో అప్పటినుండి ఫ్రీబర్డ్ అయిపోయాడు. పార్టీలోనే ఉండుంటే ప్రతిపక్షాలను తనిష్టంవచ్చినట్లు కలిసేందుకు ఉండదు. ప్రతిపక్షాలను ఆహ్వానించి సమావేశం పెట్టాలంటే అయితే రేవంత్ రెడ్డి లేదా రేవంత్ ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాని మరొకరు కాని పెట్టాలంతే. పార్టీపరంగా అఖిలపక్ష సమావేశం పెట్టాలంటే రేవంత్ ఆదేశాలతో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma) నిర్వహించాలి. అంతేకాని తనిష్టప్రకారం అఖిలపక్ష సమావేశాన్ని పెట్టేందుకు, అందరినీ ఢిల్లీకి తీసుకుని వెళ్ళేందుకు తీన్మార్ కు ఎప్పటికీ అవకాశమైతే రాదు. తీన్మార్ పరిస్ధితి గుంపులో గోవిందాలాగ అయిపోయేది. అదే ఇపుడు కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయినా ఎంఎల్సీ అనే హోద ఉందికాబట్టి, బీసీలను ఏకంచేస్తానని కొంతకాలంగా ప్రకటనలు ఇస్తున్నాడు కాబట్టి తీన్మార్ అన్నీపార్టీలను కలుస్తున్నాడు. ఇంకా తేదీ నిర్ణయంకాలేదు కాని తన నాయకత్వంలో అన్నీ పార్టీలను బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనకోసం ఢిల్లీకి తీసుకుని వెళ్ళటానికి తీన్మార్ పెద్ద ప్లానే వేస్తున్నాడు.
బీఆర్ఎస్ ప్లాన్ ఏమిటి ?
బీసీలకు నాయకత్వం వహించేందుకు తీన్మార్ గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. ఈ నేపధ్యంలోనే రేవంత్ రెడ్డితో విభేదించి చివరకు పార్టీనుండి సస్పెండ్ అయ్యాడు. మొదటినుండి బీఆర్ఎస్ కీలకనేతలు కేటీఆర్, హరీష్, కవితలు రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి శతృవుకిశతృవు మిత్రుడు అన్న రాజనీతిని కేటీఆర్ అమలుచేస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎలాగంటే ఒకవైపునుండి రేవంత్ ను తాము ఎటాక్ చేస్తునే మరోవైపు నుండి తీన్మార్ తో ఎటాక్ చేయించటం. ప్రతిరోజు రేవంత్ పై బీఆర్ఎస్ ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉంటుంది కాబట్టి జనాలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అదే కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయిన ఎంఎల్సీ పైగా బీసీనేతగా ఎదగాలని అనుకుంటున్న తీన్మార్ తో చేతులుకలిపి రేవంత్ పై ఆరోపణలు, విమర్శలు చేయించాలని కేటీఆర్ ఆలోచించినట్లున్నారు.
బీసీల్లో తీన్మార్ ఇపుడిప్పుడే ఎదుగుతున్న నేత. అందుకనే బీసీనేతతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయిస్తే జనాల్లోకి బాగా ఎక్కుతుందని కేటీఆర్ ఆలోచించినట్లున్నారు. అందుకనే అడిగిన వెంటనే తీన్మార్ తో వైరాన్ని పక్కనపెట్టి మరీ కేటీఆర్, హరీష్ భేటీఅయ్యింది. తీన్మార్ కు సొంతంగా యూట్యూబ్ ఛానలుంది. బీసీ యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా రేవంత్ వ్యతిరేకుల్లో మెజారిటి బీసీ నేతలు తీన్మార్ ను చేరదీసే అవకాశాలను కొట్టిపారేయలేము. ఇలాంటి అనేక కోణాలను ఆలోచించిన తీన్మార్ పాతవైరాన్ని పక్కనపెట్టి అందరినీ కలుస్తుంటే రేవంత్ వ్యతిరేకులు కూడా ఇదేపద్దతిలో తీన్మార్ తో భేటీ అవుతున్నారు.
తీన్మార్ కు ఏమిటి అవసరం ?
2023 ఎన్నికలకు ముందు ఊపందుకున్న బీసీవాదం ఇపుడు ఇంకా ఎక్కువైంది. విద్యా, ఉద్యోగాలతో పాటు స్ధానికసంస్ధల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానంతోనే రాష్ట్రంలో బీసీవాదన ఎంతబలంగా ఉందనే విషయం అర్ధమవుతోంది. కొంతకాలంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణలో బీసీలను ఏకంచేసేంత స్ధాయి ఉన్న నేతలు ఎవరూ లేరు. చాలామంది బీసీ నేతలు తాము గొప్పనేతలమని అనుకున్నా నిజానికి వారికి అంతటి స్టేచర్ లేదన్నది వాస్తవం. అందుకనే బీసీల్లో నాయకత్వ లేమి బాగా ఇబ్బందిపెడుతోంది. కాబట్టి నాయకత్వలోపాన్ని తాను భర్తీచేయాలని తీన్మార్ అనుకుంటున్నట్లున్నాడు. రాష్ట్రంలోని బీసీ సామాజికవర్గాలకు తానే ఏకైక నాయకుడిని అని నిరూపించుకోవాలని తీన్మార్ గట్టిగా డిసైడ్ అయినట్లున్నాడు. అందుకనే బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని తీన్మార్ గట్టిగా పట్టుకున్నాడు.
పార్టీలను ఢిల్లీకి తీసుకుని వెళ్ళే బృందానికి నాయకత్వం వహిస్తే తెలంగాణ బీసీల్లో తీన్మార్ ఇమేజి అమాంతం పెరిగిపోవటం ఖాయం. అయితే సీనియారిటిలో జూనియర్ మోస్టయిన తీన్మార్ కు వివిధ పార్టీల్లోని బీసీ నేతలు సహకరిస్తారా ? అవకాశం ఇస్తారా ? నాయకత్వ వహించే అవకాశం వస్తే తాము వదులుకుంటారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో బీసీల జనాభా 24.9 శాతం అని తేలింది. బీసీల్లో సుమారు 140 ఉపకులాలున్నాయి. ఇందులో జనాభాను ప్రతిపదికగా తీసుకుంటే ముదిరాజ్ అత్యధిక జనాభాతో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది. తర్వాత స్ధానాల్లో యాదవులు, గౌడ్లు, మున్నూరుకాపులు, పద్మశాలీలుంటారు.
జనాభాపరంగా చూస్తే ముదిరిజ్ లు 26.36 లక్షలు (7.43శాతం), యాదవులు 20.17 లక్షలు(5.69శాతం), గౌడ్లు 16.27 లక్షలు(4.59శాతం), మన్నూరుకాపులు 13.71 లక్షలు(3.87శాతం), పద్మశాలీలు 11.79 లక్షలు(3.32 శాతం) ఉంటారు. బీసీలకు నాయకత్వం వహించేందుకు తీన్మార్ గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నాడు కాని మున్నూరుకాపుకు చెందిన వ్యక్తికి నాయకత్వపగ్గాలు అప్పగించేందుకు ముదిరాజ్, యాదవులు, గౌడ్ ఉపకులాల్లోని సీనియర్ నేతలు అంగీకరిస్తారా అన్నది చూడాలి. సమాజంలో బీసీల జనాభా సగానికి పైగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బీసీ సామాజికవర్గాల్లోని నేతలు రాజకీయపార్టీలను శాసించేంతస్ధాయిలో ఎందుకు లేరన్నది అసలైన ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే బీసీల్లో 140 ఉపకులాలు ఉండటమే పెద్ద సమస్యగా మారింది.
సామాజికవర్గాల పరంగా తీసుకుంటే రెడ్లు, కమ్మ, వెలమలే పార్టీలకు నాయకత్వాలు వహిస్తున్నారు. ప్రాంతీయపార్టీలైన టీడీపీ లేదా బీఆర్ఎస్ అధినేతలు కమ్మ, వెలమ సామాజికవర్గాలన్న విషయం తెలిసిందే. ఈ పార్టీలు అధికారంలో ఉంటే ముఖ్యమంత్రులుగా ప్రతిపక్షంలో ఉంటే పార్టీ అధినేతలుగా పై సామాజికవర్గాల నేతలే ఉంటారు. రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణలో టీడీపీ దాదాపు భూస్ధాపితం అయిపోయింది కాబట్టి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) తెలంగాణలో పార్టీని వదిలేశారు. అయితే పార్టీకి తెలంగాణలో చాలా ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా పెట్టాలని అనుకున్నారు. కొడుకు లోకేష్ కాని, కమ్మ సామాజికవర్గంలో గట్టి నేతలు ఎవరూ ముందుకు రాలేదుకాబట్టి వేరేదారిలేక బీసీ నేతను పార్టీకి అధ్యక్షుడిగా నియమించారు. ఇక బీఆర్ఎస్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్ జాతీయపార్టీ కాబట్టి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవరు పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలనే నిర్ణయం అధిష్ఠానం చూసుకుంటుంది. బీజేపీది కూడా ఇదేపద్దతి.
బీసీ ఉపకులాల్లో మున్నూరుకాపులకన్నా బలమైన ముదిరాజ్, యాదవ, గౌడ్ నేతలున్నారు కాబట్టి ఈ నేతలు తీన్మార్ నాయకత్వంలో పనిచేయటానికి అంగీకరిస్తారా అన్నది సందేహమే. లెక్కకుమిక్కిలి ఉపకులాలుండటం, ఉపకులాల్లోని నేతలు ఎవరికివారు తమకే బీసీలకు నాయకత్వం వహించే అవకాశం దక్కాలని పోటీలుపడుతున్న కారణంగానే బీసీలనుండి తిరుగులేని నాయకుడు అని చెప్పుకునేందుకు ఒక్కళ్ళు కూడా లేరు. ఈ విషయం తీన్మార్ కు తెలీదని అనుకునేందుకు లేదు. అందుకనే ముందుగా బీసీలంరినీ ఏకంచేయటానికి కష్టపడుతున్నాడు. పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్ళే విషయంలో తీన్మార్ సక్సెస్ అయితే బీసీల్లో కొత్తాదేవుడిగా తీన్మార్ ను పైనచెప్పిన ఐదుఉపకులాల్లోని బీసీలు గుర్తిస్తారేమో చూడాలి. మున్నూరుకాపుతో కలిపి మెజారిటి ఉపకులాలు గనుక తీన్మార్ ను నాయకుడిగా అంగీకరిస్తే అప్పుడు పైన చెప్పిన మిగిలిన నాలుగుకులాల్లోని నేతలు కాకపోయినా మిగిలిన జనాలు అంగీకరిస్తారేమో. అదే జరిగితే తీన్మార్ వ్యూహం సక్సెస్ అయినట్లే అనుకోవాలి. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.