తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. జగన్ బాటలో నడుస్తున్నారా?
సినిమా, ప్రత్యర్థులపై కేసు విషయంలో అదే వైఖరి
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. కేసీఆర్ పాలనపై ఏర్పడిన వ్యతిరేకత, బీజేపీ బండి సంజయ్ ను పార్టీ చీఫ్ గా తొలగించడంతో కమలదళంలో ఏర్పడిన నాయకత్వ లోటు, పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించడంతో ఇక్కడ అదే ఊపుతో అధికారంలోకి వచ్చింది.
రాష్ట్రంలో పార్టీకి నాయకుడిగా రేవంత్ రెడ్డి లాంటి మాటకారి తోడవడంతో మెజారిటీకి అవసరమైన సీట్లను సాధించింది. అయితే కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవలంభించిన విధానాలను గుర్తుకు తెస్తున్నాయి. అవేంటో చూద్దాం..
కేటీఆర్ పై కేసు...
మాజీ మంత్రి, బీఆర్ఎస్ లో నెంబర్ టూ పొజిషన్ లో ఉన్న కేటీఆర్ పై ప్రభుత్వం ఫార్మలా ఈ రేస్ కార్ల వ్యవహరంలో నిధులు దుర్వినియోగం చేశారని కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయనను విచారించడానికి ఏసీబీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సిద్దంగా ఉన్నాయి.
రెండు సంస్థలు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశాయి. అంతకుముందు ఆయన హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు కొట్టివేసింది. ఇక జరగబోయేది ఏంటో అందరూ ఊహించవచ్చు. ఏసీబీ విచారణ సందర్భంగా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అరెస్ట్ కావచ్చు కూడా.
తాజాగా ఆయనపై ఓఆర్ఆర్ విషయంలో ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీనిపై ఇంకా కేసు నమోదు చేయడం లాంటివి జరగలేదు కానీ.. ప్రతిపక్షంలో ఉండగా, రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ విషయంలో అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందు జగన్ సీఎంగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడిపై పలు కేసులు బనాయించి, సీఐడీ, ఏసీబీ అంటూ విచారణ చేయించారు. చివరకు 50 రోజులకు పైగా సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. తనను అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు జైలు కు పంపించడంలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో, టీడీపీ అధినేత పాత్ర అంతే ఉందన్నది ఆయన మదిలో ఉన్న అనుమానం.
పైగా మాటిమాటికి తనను ఖైదీనంబర్ అంటూ సంబోధించడంతో చంద్రబాబుకు మాటను ఉపయోగించాలని, తాను నిప్పులా బతికానని బాబు గారు ప్రకటించుకునే మాటకు బ్రేక్ వేయడానికి ఈ ఎత్తు వేశారన్నది అప్పటి రాజకీయ నాయకుల విశ్లేషణ.
ఇప్పుడూ ఇదే బాటలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నట్లు అనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక తొట్ట తొలి ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం, అందులో భాగంగా నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి ఏసీబీ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడటం అందరికి గుర్తుండే ఉంటుంది.
తనను నెలనాళ్లు జైలులో ఉంచడంలో అప్పటి ఏసీబీ కీలకంగా వ్యవహరించింది. ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయిన రేవంత్ రెడ్డి కొన్నాళ్లకు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అనేక సవాళ్లను ఎదుర్కొని పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురాగలగడమే కాకుండా సీనియర్లను కాదని సీఎం అయ్యారు.
ఇప్పుడు తన ప్రత్యర్థుల భరతం పట్టేందుకు అదే ఏసీబీని ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగంగానే ఫార్ములా రేస్ కార్లు వ్యవహరం తెరపైకి వచ్చింది. ఒప్పందం లేకుండా రూ. 46 కోట్ల రూపాయలను ఓ బ్రిటన్ సంస్థకు బదలాయించడంలో అవినీతి చోటుచేసుకుందని ప్రభుత్వ వాదన.
అందుకే కేసులు పెట్టి, విచారణకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది. ఈ కేసు ఎప్పటికీ తేలేనో ఎవరికి తెలియదు. కానీ తనను జైలులో పెట్టిన కేసీఆర్ ఫ్యామిలిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి, మాత్రం రేవంత్ రెడ్డికి మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు కేవలం కేటీఆర్ అరెస్ట్ మాత్రమే మిగిలి ఉంది. చంద్రబాబును, జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించినట్లు, కేటీఆర్ ను రేవంత్ సర్కార్ కచ్చితంగా జైలుకు పంపడం ఖాయం?
సినిమా వాళ్ల విషయంలో...
జగన్ అధికారంలోకి రాగానే టాలీవుడ్ నుంచి పేరున్న హీరోలు, నిర్మాతలు ఒక్కరు కూడా ఆయనను కలవలేదు. దాంతో ఆయన సినీ రంగంలో టికెట్ల సంస్కరణలు ప్రవేశపెట్టారు. ప్రజలకు అందుబాటులో వినోదం ఉండే పేరుతో చర్యలు చేపట్టారు.
దీనితో అగ్ర హీరోలు, నిర్మాతలు మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టారు. తరువాత కొంత పట్టుసడలించిన వైసీపీ సర్కార్.. మొత్తానికి టాలీవుడ్ కు వ్యతిరేకంగానే వ్యవహరించిందనే గుసగుసలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే తిరిగి టీడీపీ అధికారంలోకి రాగానే తమ గొంతును జగన్ కు వ్యతిరేకంగా వినిపించారు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కూడా ఇలాగే సినీ పెద్దలు వ్యవహరించారు. కనీసం ఒక్కరూ కూడా వచ్చి ప్రత్యక్షంగా కలవలేదు. కొన్ని రోజులకు ఫంక్షన్ అల్లుఅర్జున్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు.
పుష్ఫ 2: ది రూల్ సినిమాకు బెన్ ఫిట్ షోలు వేసుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో పాటు, టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అంగీకరించారు. కానీ అందులో ఓ మహిళ మరణించడం, ఆమె కుమారుడు ఆస్పత్రి పాలవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైళ్లోకి నెట్టారు. బెన్ ఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అంగీకరించేది లేదని ప్రకటించారు.
దీనితో దిల్ రాజు తో సహ ఇతర సినీ పెద్దలు పరుగు పరుగున వచ్చి సీఎం, ఇతర మంత్రులతో భేటీ అయ్యారు. కానీ ఆయన సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల విషయంలో వెనక్కి తగ్గలేదు. ఎక్కడా బెన్ ఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు సానుకూలంగా స్పందించలేదు. ఓ కమిటీ వేస్తున్నట్లు మాత్రం ప్రకటించారు.
ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి విడత జగన్ పాలన కాలంలో జరిగినట్లుగానే, రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్నాయి. ఇవన్నీ యాధృచ్చికమే కావచ్చు కానీ.. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు, సినిమా వాళ్ల విషయంలో వ్యవహారించిన తీరు అచ్చు అలాగే ఉంది.
కానీ చంద్రబాబుపై కేసు తరువాత ఆయన తిరిగి అధికారంలోకి రావడానికి కారణమైందనే విషయం మరువరాదు. అలాగే తెలంగాణలో కూడా కేటీఆర్ అరెస్ట్ తో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో, లేదో చూడాలి. దానికి ఇంకో నాలుగేళ్ల సమయం ఉంది.. కానీ జమిలి ఎన్నికలకు వెళ్లడానికి తొందరపడుతున్న బీజేపీ, దాన్ని కాస్త ముందుకు జరిపితే.. రేవంత్ రెడ్డే ప్రత్యర్థి చేతికి ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది.
Next Story