
బీఆర్ఎస్ కు ఏసీబీ ‘దసరా ఆఫర్’ తప్పదా ?
మంగళవారం లేదా బుధవారంలోపు కేసులు నమోదుచేసి దర్యాప్తు చేయమని ఏసీబీకి చీఫ్ సెక్రటరీ అనుమతి ఇచ్చేఅవకాశాలు ఉన్నట్లు సమాచారం
దసరాపండుగ సందర్భంగా జనాలకు ఉత్పత్తి సంస్ధలు రకరకాల ఆఫర్లు ఇస్తుంటే ఏసీబీ మాత్రం బీఆర్ఎస్ కు మరో రకమైన ఆఫర్ ఇచ్చేట్లుగా కనబడుతోంది. కాళేశ్వరం(Kaleshwaram Corruption) ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపై కేసులు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టేందుకు అనుమతి కోరుతు ఏసీబీ(Telangana ACB) ప్రభుత్వానికి లేఖరాసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ నుండి చీఫ్ సెక్రటరీకి లేఖ అందింది. ఈ లేఖ ప్రస్తుతం చీఫ్ సెకట్రరీ పరిశీలనలోనే ఉంది. ముఖ్యమంత్రి (Revanth)ఎనుముల రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఏసీబీకి చీఫ్ సెక్రటరీ ఏ విషయం చెబుతారు. మంగళవారం లేదా బుధవారంలోపు కేసులు నమోదుచేసి దర్యాప్తు చేయమని ఏసీబీకి చీఫ్ సెక్రటరీ అనుమతి ఇచ్చేఅవకాశాలు ఉన్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టులో వేలకోట్లరూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని, అవినీతి, అవకతవకలు జరిగాయని విజిలెన్స్ కమిషన్ చేసిన విచారణలో తేలింది. అందుకనే బాధ్యులపై కేసులు నమోదుచేసి దర్యాప్తుచేయాలని కమిషన్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ కు లేఖ రాసింది. విజిలెన్స్ కమిషన్ నుండి అందిన లేఖను ఏసీబీ యధాతథంగా చీఫ్ సెక్రటరీకి పంపి అనుమతి కోసం వెయిట్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఇంజనీరింగ్ శాఖలోని ఇంజనీర్ ఇన్ చీఫులు, చీఫ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లలో కొందరిపై ఇప్పటికే ఏసీబీ కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు సలహాదారుడు, మురళీధరరావు, హరిరామ్, నూనె శ్రీధర్ లాంటి మరికొంతమందిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాడుల్లో లెక్కకు మించిన ఆస్తులను కనుగొన్నది. మార్కెట్ విలువ ప్రకారం పట్టుబడిన ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ఏసీబీ దాడుల్లో దొరికి అరెస్టయి ప్రస్తుతం రిమాండులో ఉన్న వారిలో అత్యధికులు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారే.
ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల దగ్గరే వందల కోట్ల విలువైన ఆస్తులు దొరికితే ఇక పాలకులు, విధాన నిర్ణయాలు తీసుకునే వారు ఎంత సంపాదించుంటారు ? అనేప్రశ్న సామాన్య జనాల్లో బాగా చర్చ జరుగుతోంది. కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బాధ్యతంతా కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ దే అని స్పష్టంగా చెప్పింది. మరో 20 మంది ఇంజనీరింగ్ అధికారులతో పాటు అప్పటి చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషి, స్మితా సబర్వాల్ తదితరులను కూడా తప్పుపట్టింది.
సీబీఐ ఏమిచేస్తోంది ?
ఇంతసడెన్ గా విచారణ విషయంలో ఏసీబీ ఎందుకు జోరు పెంచిందన్న విషయమే అర్ధంకావటంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై యాక్షన్ తీసుకోమని ప్రభుత్వం సీబీఐకి లేఖ రాసింది. సీబీఐ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్నీ ఫైళ్ళను పరిశీలిస్తోంది. ఫైళ్ళ పరిశీలన ద్వారా కేసును టేకప్ చేయాలా ? వద్దా అన్నవిషయాన్ని సీబీఐ నిర్ణయించుకుంటుంది. కేసును టేకప్ చేస్తే సీబీఐకి ఒక సమస్య ఎదురయ్యే అవకాశముంది. అదేమిటంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కేసీఆర్, హరీష్ తో పాటు ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. ఈటల ఎవరంటే బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ అని అందరికీ తెలిసిందే. కేసును సీబీఐ టేకప్ చేస్తే కేసీఆర్, హరీష్ తదితరులతో పాటు ఈటల మీద కేసు కేసు పెట్టాల్సిందే, అవసరమైతే అరెస్టు చేయక తప్పదు.
బీజేపీ ఎంపీ, బీసీ నేతకూడా అయిన ఈటలపై సీబీఐ కేసునమోదు చేసి అరెస్టు చేయగలదా ? ఈటలను వదిలేసి మిగిలిన వాళ్ళపై కేసులు నమోదుచేస్తాము, అరెస్టుచేస్తామంటే చెల్లదు. పోని ప్రాజెక్టులో అవినీతి జరగలేదని చెప్పేందుకూ లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంలాగ వాడుకుంటోందని గతంలో నరేంద్రమోదీ, అమిత్ షా దగ్గర నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలందరు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి అందరిమీద కేసులు పెట్టాల్సిందే, అరెస్టులు చేయాల్సిందే తప్ప వేరేదారిలేదు.
ఏసీబీ జోరుపై అనుమానాలు
ఈనేపధ్యంలోనే ఏసీబీ జోరుపెంచటంపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. సీబీఐ కేసు టేకప్ చేయటంలో తాత్సారం చేస్తోందని ఏసీబీ అనుమానించిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసు టేకప్ చేసే విషయంలో సీబీఐ నిర్ణయం చెప్పేందుకు బాగా సమయం తీసుకుంటోందని ఏసీబీ అనుమానించినట్లుంది. అందుకనే ఈలోగా తాము జోరుపెంచే ఉద్దేశ్యంతోనే బాధ్యులపై కేసులు నమోదుచేసి విచారణ మొదలుపెట్టాలని డిసైడ్ అయినట్లు అర్ధమవుతోంది. ఏసీబీ గనుక రంగంలోకి దిగితే చాలాస్పీడుగా యాక్షన్లోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావుపై బంపర్ ఆఫర్ తప్పదనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఏసీబీ లేఖకు తొందరలో జరగుతాయి అనుకుంటున్న స్ధానికసంస్ధల ఎన్నికలకు ఏమైనా లింకుందా ?